అతి ముఖ్యమైన ప్రయాణములకు పరిఘాదండ చక్ర ప్రాముఖ్యత
పూర్వ కాలామృతం గ్రంధం నందు ముఖ్యమైన ప్రయాణములు చేయు వారు పరిఘాదండ చక్రం పరిశీలించి ఆయా నక్షత్రములు తెలిజేయు దిక్కు నందు ఆ రోజు ప్రయాణం చేయకూడదని తెలియజేయబడినది. అలా చేసిన కార్యసఫలత పొందలేరని తెలియజేయడమైనది.
శ్లోకం:-ఆగ్నేయానిలకోణయోచ్చ విలిఖేడే కాంచ రేఖాం చతు
ష్కోణే ప్రాగ్లిఖితే ప్రసిద్ధ పరిఘా దండాఖ్య చక్రే శుభే
తత్ప్రాగాదిషు సప్త సప్త గమనే వహ్న్యదితారా లిఖే
దష్టా వింశతి సంఖ్యయైవ పరిఘాదండో నలంఘ్యేధ్వగై
ఆగ్నేయం దిక్కు నుండి వాయువ్య దిక్కుకు ఒక రేఖ గీయవలెను, ఈశాన్యం దిక్కు నుండి నైరుతి దిక్కుకు మొదటి రేఖను ఖండిస్తూ ఒక రేఖ గీయవలెను. అభిజిత్ నక్షత్రంతో కలిపి 28 నక్షత్రాలను నాలుగు దిక్కులకు వ్రాయవలెను.
కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు తూర్పు దిక్కును,
మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ నక్షత్రాలు దక్షిణ దిక్కును,
అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, అబిజిత్, శ్రవణం నక్షత్రాలు పడమర దిక్కును,
ధనిష్ఠ, శతబిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి నక్షత్రాలు ఉత్తరం దిక్కును తెలియజేస్తాయి.
ఆయా దిక్కు నందు ఉండు నక్షత్రముల యందు ఆయా దిక్కులకు ప్రయాణం కూడదని కార్య సఫలత పొందలేరని పూర్వ కాలామృతం గ్రంధం నందు తెలియజేయడమైనది.