22, ఫిబ్రవరి 2018, గురువారం

భూతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

భూతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

భూతత్వరాశులు:- వృషభం, కన్య, మకర రాశులు భూతత్వానికి చెందినవి. వీటికి వరుసగా శుక్ర, బుధ, శని అధిపతులు. భూతత్వరాశుల వారు మంచి దృడమైన శరీరం కలిగి ఉంటారు. మంచి భోజన ప్రియులు. కూడబెట్టుట, ఏదైనా పనిని ప్రారంభించే ముందు లాభ నష్టములను బేరీజు వేసుకొని ప్రవర్తించెదరు. వ్యక్తిగత విషయాల యందు, ఊహా జగత్తుల యందు విహరించుట. బౌతిక విషయాల యందు, జీవనం నందు విశ్వాసం ఉండును. ఏదైనా పనిని ప్రారంభించిన వదిలిపెట్టరు. వీటిని అర్ధ త్రికోణ రాశులు అని కూడ అంటారు. మంచి జీవనోపాధి కలిగి ఉంటారు. 


కుటుంబ పోషణ బాధ్యత కలిగి ఉంటారు. కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. లౌకిక విషయాలపై, సామాజిక అంశాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు. మంచి ఉపాధి కలిగి సంసార జీవితాన్ని సుఖవంతం చేసుకుంటారు. ప్రతి విషయంలోను ప్రయోజనాన్ని ఆశిస్తారు. తక్కువ శ్రమతో సంపాదించే తెలివితేటలు కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితంపై మక్కువ కలిగి ఉంటారు. కష్టపడి విజయం సాధిస్తారు. ప్రతి పని ఓర్పుగా నేర్పుగా చేస్తారు. సహనం, పోటీతత్వం కలిగి ఉంటారు. ముందు జాగ్రత్తగా భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా కార్యక్రమాలను రూపకల్పన చేస్తారు. ధనాన్ని కూడబెట్టుకోవటం అలవాటుగా చేసుకుంటారు. ఆచి తూచి నెమ్మదిగా పనులను చక్కబెడతారు.

వృషభరాశి:- వృషభరాశి మేషాది క్రమంలో రెండవ రాశి కావటం వలన ధనం కూడ బెట్టటం, కోరికలు కలిగి ఉండటం, విలువలకు ప్రాధాన్యత, ప్రయోజనాన్ని ఆశించి పెట్టుబడి పెట్టటం, కుటుంబ పరిరక్షణ మొదలగు అంశాలపై ఆసక్తి కలిగి ఉంటారు. సంపాదనను, స్ధిర, చరాస్ధులను, స్వంతమైన వస్తువులను సద్వినియోగం చేసుకొని సౌకర్యాలను, సౌఖ్యాలను అనుభవించటం చేస్తారు. ధనాన్ని, వస్తువులను, స్ధిర చరాస్ధులను భద్రంగా కాపాడుకుంటారు. సంపాదనా మార్గాలను అన్వేషిస్తారు. వృషభరాశికి అధిపతి శుక్రుడు కావటం వలన సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. 

అందంగా కనపడాలనుకోవటం, ఆకర్షణగా కనపడాలనుకోవటం, అందమైన, ఆకర్షణీయమైన దుస్తులు ధరించాలని కోరుకుంటారు. ఖరీదైన ఆభరణాలపై మక్కువ కలిగి ఉంటారు. విలాస వంతమైన వస్తువులతో సౌఖ్యాలను అనుభవిస్తారు. ఖరీదైన వాహనంలో సుఖాలు కోరుకుంటారు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు. ఆకర్షణీయమైన చిత్రాలపై, ప్రకృతిపై మక్కువ. చిత్రలేఖనం, సంగీతం, పాటలు పాడటంపై ఆసక్తి కలిగిస్తుంది. బ్యాంకింగ్, వస్త్రాలు, వాహనాలు, భూ సంభంధమైన, గృహ సంభంధమైన వ్యాపారాలు లేదా ఉద్యోగాలలో రాణించే అవకాశాలు వృషభ రాశి వారికి ఉంటాయి.

కన్యారాశి :- కన్యారాశి మేషాదిగా ఆరవ రాశి అయినందున కృషికి తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తారు. కృషికి ప్రాధాన్యత కలిగి ఉండటం చేత ప్రయోజనాన్ని, సౌకర్యాలను పొందుతారు. సమగ్రమైన వివరాలు సేకరించటంలో అనుభవం కలిగి ఉంటారు. వివిధ రీతులలో, వివిధ పరిస్ధితులలో విషయాన్ని సేకరించగలిగే నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా వివరించగలిగే సామర్ధ్యం కలిగి ఉంటారు. సమీక్షలు, సమావేశాలు జరిపి సమగ్రమైన నివేదిక సమర్పిస్తారు. సూక్ష్మ పరిశీలనా ఙ్ఞానాన్ని కలిగి ఉంటారు. ప్రతి అంశాన్ని, పరిస్ధితులను అంచనా వేయటం, ఖచ్చితమైన లెక్కలు వేయగలరు. కొలతలు, తూనికల పట్ల శ్రద్ధ వహిస్తారు. వ్రాయటం, లెక్కలు కట్టటం వంటి పనులపై మక్కువ. జీర్ణాశయ సమస్యలు కలిగి ఉంటారు. 

వ్యవసాయం, పాడి పరిశ్రమ, తోటలు, సాధు జీవులను పోషించటం, మొక్కలు పెంచటంపై మక్కువ. అంచనా వేయగలిగే వృత్తులలో రాణిస్తారు. ఇతరులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. తొందరగా ఒక అంచనాకు రాలేరు. ద్వంద రీతిలో ఆలోచిస్తారు. ఆరోగ్య సంబంధమైన ఆహార ధాన్యాలు, తినుభండారాలు, మందులు, పారిశుద్యం, వైధ్యం మొదలగు వృత్తి ఉద్యోగాలలో రాణింపు. శ్రమ సంబందమైన హస్తకళలు, కులవృత్తులు, నేత వస్త్రాలు, కుట్టుపని, పరిశ్రమలు, సేవా కార్యక్రమాలు, యంత్ర పరికరాలు, కార్మికులు, జీతం, ఉద్యోగం మొదలగు వృత్తి ఉద్యోగాలు కన్యారాశి లక్షణాలు.

మకరరాశి :- మకరరాశి మేషాదిగా పదవ రాశి కావటం వలన ఉపాధి మార్గాలను సూచిస్తుంది. ఉద్యోగం, వ్యాపార వృత్తి, పరిశ్రమలు మొదలైన వాటి ద్వారా ఉపాధి మార్గాలను పొందుతారు. సంఘంలో పేరుప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకుంటారు. ఎప్పుడు పై స్ధాయిలో ఉండాలనుకోవటం వలన రాజకీయ పదవి వరించే అవకాశం ఉంటుంది. అధికారం చూపించే వృత్తి, ఉద్యోగాలలో రాణిస్తారు. తను ఉన్నచోట పెద్ద మనుషులుగా చెలామణి అవుతారు. భాద్యతాయుతంగా ప్రవర్తిస్తారు. వయోవృద్ధులపై, అనాదలపై, మానసిక వికలాంగులపై మక్కువ కనబరుస్తారు. ప్రతి పని పట్టుదలగా జాగ్రత్తగా చేస్తారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. 

రక్షణ చర్యలు చేపడతారు. సహనం కలిగి ఉంటారు. నిదానంగా పనులు చక్కపెడతారు. నెమ్మదిగా శ్రమించి పని చేస్తారు. ప్రతి పని ఏకాగ్రతగా చేస్తారు. శ్రమతో కూడిన పనులు చేస్తూ కార్యసాధన లక్ష్యంగా ఎంచుకుంటారు. ఉన్నత స్ధాయికి రావాలనే ఆకాంక్ష. ప్రతి వారికి ఉపయోగపడే పనులు చేయటం. ప్రయోజనం, లాభం చేకూర్చే పనుల పట్ల ఆసక్తి కలిగి ఉండటం. స్వార్ధం, పోటీతత్వం లేకపోవటం. తరచుగా నడవటానికి ఇష్టపడతారు. చేతికి మట్టి, మరక అంటుకునే వృత్తి, ఉద్యోగాలలో రాణిస్తారు. ఖాళీగా లేకుండా ఎప్పుడూ ఎదో ఒక పని చేయటం చేస్తారు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కలిగి ఉండటం మకరరాశి కారకత్వాలుగా చెప్పుకోవచ్చు.                      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...