11, జనవరి 2018, గురువారం

హస్తరేఖలలోని వివాహ రేఖల రహస్యాలు

హస్తరేఖలలోని వివాహ రేఖల రహస్యాలు  

వివాహరేఖలనే కళ్యాణ రేఖలని, పరిణయ రేఖలని, ప్రేమ రేఖలని, దాంపత్య రేఖలని అంటారు. అరచేతిలో చిటికిన వ్రేలు క్రింద బుధ స్ధానంలో ప్రేమకు ప్రతిరూపమైన ఆత్మరేఖకు పై భాగంలో అంచున ప్రారంభమై బుధ స్ధానంలో  ఏర్పడి ఉండే చిన్న రేఖలను వివాహరేఖలు అంటారు. మరియు వివాహ యోగ్యత రేఖలు అంటారు. 

ఖచ్చితమైన వివాహయోగ్యత రేఖలు బుధక్షేత్రాన్ని నాలుగు భాగాలు చేయగా మూడో భాగం వరకు వెళ్ళిన రేఖలు ఖచ్చితమైన వివాహయోగ్యత రేఖలు అంటారు. వివాహరేఖ మూడో భాగం దాకా వచ్చి నాల్గవ భాగంలో విడిపోతే దాని వలన దాంపత్య జీవితం బాగోదని భావించకూడదు. ఎందుకంటే నాలుగవ భాగంలోకి వెళ్ళిన రేఖను బుధరేఖ అనాలి గాని వివాహరేఖగా గుర్తించకూడదు. అలా ఉండటం వలన బుధుడికి సంబందించి మూర్ఛ, మాటకు సంబందించిన ప్రాబ్లమ్స్, పిసినారితనం, చర్మవ్యాధులు, విద్యా సంబంధ ఇబ్బందులు  వస్తాయి తప్ప వివాహ విషయంలో ఇబ్బందులు రావు. మరియు హృదయరేఖ నుండి బుధ క్షేత్రం వరకు నాలుగు అడ్డ భాగాలుగా చేయగా మూడో భాగంలో వచ్చే రేఖ ఖచ్చితమైన వివాహరేఖగా గుర్తించాలి. 

ఒక్కొక్కసారి హృదయరేఖ పైన మరియు గురు క్షేత్రంలో కూడా వివాహరేఖలు గుర్తించవచ్చును. వీటిని వివాహరేఖలుగా గుర్తించరాదు. ఈ మూడో భాగంపై ఉన్న వివాహ రేఖలపైనా వచ్చే త్రికోణాలు, కత్తెర గుర్తులు, యవాలు, నక్షత్ర గుర్తులను ఆధారంగా చేసుకొని ఫలితాలను విశ్లేషించాలి. నాల్గవ భాగంలో వచ్చే గుర్తులు బుధ క్షేత్రానికి సంబందించిన ఫలితాలను విశ్లేషించాలి తప్ప వివాహ రేఖలుగా విశ్లేషించరాదు.   

వివాహరేఖల పైన వచ్చే చిన్న నిలువు రేఖలను సంతాన రేఖలు అంటారు. ఈ వివాహరేఖ పొడవుగా, స్పష్టంగా, లోతుగా, కాంతివంతంగా ఏర్పడి ఉంటే ఆ వ్యక్తికి వివాహం అవుతుంది. మంచి భార్య లభిస్తుంది. వివాహ జీవితం బాగుంటుంది. దాంపత్య జీవితంలో సుఖశాంతులు ఉంటాయి. కొంతమందికి వివాహరేఖలు రెండు, మూడు, నాలుగు వరకు ఉంటాయి. అయితే చాలా రేఖలుంటే చాలా వివాహాలు జరుగుతాయి అనేది నిజం కాదు. ఈ రేఖలలో ఈ రేఖ పెద్దగా, స్పష్టంగా, ఎటువంటి దోషం లేకుండా ఉంటుందో అది మాత్రమే అసలైన వివాహరేఖ. మిగతా రేఖలు శేష రేఖలు. అంటే జీవిత భాగస్వామి లేని వారు వీరిపై ఆధారపడి జీవించేవారు అనుకోవచ్చును. లేదా తన కుటుంబంలో ఉన్న వ్యక్తుల వివాహ భాద్యతలు తను చేయవలసి రావచ్చు. మొత్తంగా ఈ అస్పష్ట రేఖలను ఇతనిపై ఆధారపడిన వారి రేఖలుగా భావించవచ్చును. ప్రమాదాలు, పరిచయాలు జరగవచ్చును. సాదారణంగా ఈ స్ధానంలో ఒకటి లేదా రెండు రేఖలు కనిపిస్తూ ఉంటాయి. స్పష్టమైన వివాహరేఖ ఉంటే ఆ రేఖ తెలియజేయు కాలపరిమితిలో వివాహం అవుతుంది. ఈ వివాహరేఖ స్పష్టంగా లేకపోతే సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ తొందరగా వివాహం జరగదు. 

వివాహ కాల నిర్ణయం తెలుసుకోవాలంటే రెండవ కుజ స్ధానం నుండి జీవితరేఖను లేదా బుద్ధి రేఖను తాకే రేఖ వివాహ వయస్సును నిర్ణయిస్తుంది. ఒక రేఖ కాకుండా మూడు, నాలుగు రేఖలు ఉన్నప్పుడూ కుజదోషం ఉన్నదని, జీవిత భాగస్వామిని ఎన్నుకొనే విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చని, బుద్ధిరేఖ మంచిగా లేకుంటే చంచల బుద్ధితో, వక్ర బుద్ధితో ఇతర వ్యక్తులతో రహస్య సంబంధాలు, వివాహేతర సంబంధాలు, కోరికలు తీర్చుకుంటారని, బుద్ధిరేఖ మంచిగా ఉంటే మంచి కుటుంబ వాతావరణంలో పెరిగిన వారై, మంచి విద్యావంతులైనవారైనా, మంచి ఆర్ధిక పరిస్ధితులు ఉన్న  ఇలాంటి చెడు సంబంధాలు పెట్టుకోవటానికి మనస్సు సహకరించదు. అలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడతారు. తన జీవిత బాగస్వామితోటే తన కోరికలు తీర్చుకుంటారు. బుద్ధిరేఖ బాగుంటే క్రమశిక్షణ కలిగినవాడై చెడు అవకాశం వచ్చిన మనస్సును నియంత్రించుకునే అవకాశం ఉంటుంది.   

వివాహ రేఖ ముక్కలు అయినా, వివాహరేఖ ఆత్మరేఖ వైపు వంగిపోయినట్లు ఉన్నా, వివాహరేఖ ముందుభాగం రెండు పాయలుగా చీలి ఉన్నా దంపతులు విడిపోయే ప్రమాదం లేదా ఒకరికి ఒకరు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంపత్య జీవితంలో సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలంటే ఆత్మరేఖ మరియు వివాహరేఖ స్పష్టంగా బలంగా ఉండాలి. వివాహరేఖ లేని అరచేయి మోటుగా, అతి చిన్నదిగా ఉంటే ఆ వ్యక్తికి వివాహం తొందరగా కాదు. వివాహం అయిన తరువాత దంపతుల మద్య ఎడబాటు ఉంటుంది. అరచేతిలో రెండు వివాహరేఖలు ఉన్నంత మాత్రాన రెండు వివాహాలు జరగవు. ఒక సంబంధం దగ్గరదాక వచ్చి తెగిపోయి ఇంకో సంబంధం కుదరచ్చు. కొన్ని సందర్భాలలో ఇతరులతో కొద్దికాలం పరిచయాలు జరగచ్చు. అంతేకాని రెండు వివాహాలు జరగవు. 

వివాహరేఖ ఆత్మరేఖకు అత్యంత దగ్గరగా ఉంటే మేనరికం గాని, బందువులలో గాని వివాహం జరగవచ్చు. వివాహరేఖ హృదయరేఖ వైపుకు సూక్ష్మంగా  కనబడి కనబడనంత వంగి ఉంటే వివాహ సమయం దగ్గరగా ఉన్నట్టు గమనించాలి. వివాహం అయిన తరువాత ఈ వంపు లేకుండా సవ్యంగా ఉంటుంది. వివాహరేఖ ముక్కలుగా ఉంటూ ఆత్మరేఖ కూడా చాలా చిన్నదిగా ఉంటే వారికి వివాహం కావటం చాలా కష్టం. వివాహం ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. వివాహం అయిన తరువాత కూడా మనస్పర్ధలు ఉంటాయి. వీరి జీవితంలో ఆనందం, సుఖశాంతులు ఉండటం చాలా కష్టం. 

వివాహరేఖ ముందుభాగం ఇలా రెండు పాయలుగా చీలి ఉంటే మంచిది కాదు. ఆత్మరేఖ కూడా చిన్నగా ఉంటే ఆ దంపతులు విడిపోతారు. జీవితంలో సుఖశాంతులు ఉండవు. ప్రతి ఛిన్న విషయాలకు గొడవ పడతారు. సర్దుకుపోయే మనస్తత్వం ఉండదు. మనస్సు చంపుకొని రాజీపడి బ్రతకవలసి వస్తుంది. 

వివాహరేఖను ఆనుకొని చిన్నచిన్న రేఖలు క్రిందకు ఉంటే వివాహ బాగస్వామికి అనారోగ్య సమస్యలు వస్తాయి. వివాహరేఖ వంపు తిరిగి ముక్కలు ముక్కలుగా ఉంటే భాగస్వామికి ప్రమాదాలు సంభవించవచ్చు లేదా అకస్మాత్తుగా దీర్ఘకాల అనారోగ్యం కలగచ్చు. వివాహరేఖ మొదట్లో యవరేఖ అనగా వడ్ల గింజ రేఖ ఉన్న వివాహం ఆలస్యం కావటం జరుగుతుంది. వివాహం అయిన వెంటనే దూరంగా ఉండవలసి వస్తుంది. వివాహరేఖ మధ్యలో యవరేఖలు ఉంటే వివాహం అయిన తరువాత కొన్నాళ్ళకు గొడవలు వలన దూరంగా ఉంటారు. వివాహరేఖ చివర యవరేఖ ఉంటే దాంపత్య జీవితంలో చివరి దశలో గొడవలు కలిగి విడిపోవటం జరుగుతుంది. 

వివాహరేఖ చీలి త్రిశూల రేఖగా ఉంటే ఒంటరి జీవితాన్ని కోరుకోవటం లేదా వివాహం అయిన తరువాత ఒంటరిజీవితాన్ని కోరుకోవటం జరుగుతుంది. ఈ త్రిశూల రేఖ ఆత్మరేఖ వైపుకు వంగి ఉంటే కోర్టు ద్వారా విడిపోవటం జరుగుతుంది. 

వివాహరేఖ సూర్య క్షేత్రంలోకి ఉర్ద్వముఖంగా ఉంటే మంచి పేరుప్రఖ్యాతలు, గౌరవాలు, ఆర్ధికాభివృద్ధి ఉన్న జీవిత భాగస్వామి లభిస్తుంది. అదే అధోముఖంగా ఉంటే వివాహం తరువాత పేరు ప్రఖ్యాతలను పోగొట్టుకుంటాడు. వివాహరేఖ బుధ క్షేత్రంలోకి సూక్ష్మంగా పైకి ఉంటే మంచితెలివితేటలు ఉన్న, ఉన్నత విద్యావంతులు జీవిత భాగస్వామిగా లభించవచ్చును. వివాహరేఖ బుధక్షేత్రంలోకి మొదట పర్వం దాకా వస్తే చాలా సంబంధాలు చూస్తూ ఉంటారు. బుధవ్రేలు యొక్క మొదటి పర్వంలోకి వివాహరేఖ వెళితే వివాహం కావటం కష్టం. ఒకవేళ వివాహం అయిన దాంపత్య సౌఖ్యం ఉండదు. బుధవ్రేలు యొక్క రెండవ పర్వంలోకి వివాహరేఖ వెళితే వివాహం కావటం కష్టం. వివాహరేఖ అధోముఖంగా కుజ క్షేత్రంలోకి ఉంటే దాంపత్య జీవితంలోకి మూడో వ్యక్తి ప్రవేశం ఉంటుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...