15, ఆగస్టు 2018, బుధవారం

మిధున రాశి, లగ్నంలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం

మిధున రాశి, లగ్నంలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం 

మిధున లగ్నం, మిధున రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు చతుర్ముఖి, సప్తముఖి, షణ్ముఖి రుద్రాక్షలు. మిధున లగ్నానికి లగ్నాధిపతి అయిన బుధుడికి చతుర్ముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన శుక్రుడికి షణ్ముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన శనికి సప్తముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. మిధున లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు గాని గురువారం రోజు గాని శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.


మిధునరాశి పురుషుడు ఒక చేత్తో గధ ,స్త్రీ ఒక చేత్తో వీణ దరించిన స్వరూపం. బార్యా భర్తలు ఇద్దరు యుక్తా యుక్త జ్నానాన్ని కలిగి ఉందురు. కుటుంబమును పోషించెదరు. మానవతా దృక్పదం కలిగి ఉంటారు. ఒకరి కోసం ఒకరు అనే భావన, వైవిధ్యం, కొంతకాలం ఆర్ధిక ప్రతికూలత, కొంతకాలం ఆర్ధిక అనుకూలత, రెండు వృత్తుల ద్వారా ఆదాయం కలిగి ఉంటారు. మిధున రాశి మేషాదిగా తృతీయ రాశి కావటం వలన తరచుగా దగ్గరి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మధ్యవర్తిత్వం చేయటంలో సిద్ధహస్తులు. సోదరీ సోధరుల సహకారం కలిగి ఉంటారు. సమీప వ్యక్తుల ప్రభావం ఎక్కువ. సన్నిహితులు, బంధువుల సహకారం. ప్రాతినిధ్యం చేయటంలో మంచి నేర్పరులు. సందేశాలు పంపటంలో ముందుంటారు. సమాచారాన్ని సేకరించగల సమర్ధులు. రచనలు చేయటంలోను, వ్రాయటంలోను మంచి నైపుణ్యం కలవారు. చూచిన దానిని కావాలని కోరుకుంటారు. మిధున రాశి వారు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించటం వలన అన్ని విషయాలలో సమర్ధత, ప్రతి విషయాన్ని అంచనా వేసే సామర్ధ్యం, మంచి ఆదాయ మార్గాలు కలిగి ఉంటారు.  

మిధునరాశి వారు పఠనా సామర్ధ్యం కలవారు. విన్న వాటిని, చూచిన వాటిని ఊహాత్మకంగా మలుస్తారు. వ్రాత సంబంధమైన వృత్తులలో రాణిస్తారు. ఇతరులతో ఎప్పుడూ సంభాషిస్తుంటారు. తన మనసులో ఉన్న ఆలోచనలను పుస్తక రూపంలో ప్రచురించగలరు. ప్రసారమాద్యమాల వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఇతరులకు తమ బోధనల ద్వారా చైతన్యవంతులను చేస్తారు. మిధున రాశికి బుధుడు అధిపతి కావటం వలన ఎప్పుడూ ఏదో ఒకటి చదవటం, వినటం చేస్తూ ఉంటారు. పలు విషయాలను అధ్యయనం చేస్తారు. మిధునరాశిలో జనించిన వారికి పలు అంశాలపైనా సమన్వయం ఉండును. వ్యాక్యాతలు, భోధన చేసేవారుగా రాణిస్తారు. సందేహాలు ఎక్కువ, సంకోచాలు ఎక్కువ, ఏ విషయాన్ని నిర్దారించలేరు. తొందరగా ఒక నిర్ణయానికి రాలేరు. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు. ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలరు. స్వతంత్రంతో ఏ పని చేయలేరు. కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలలో మాత్రమే స్ధిరత్వం కనిపిస్తుంది. మరికొన్ని విషయాలలో సందర్భాలలో అభిప్రాయాలు మారుతుంటాయి. పరిస్ధితులకు అనుగుణంగా మార్పులకు సర్దుబాట్లకు ఇష్టపడతారు. ప్రధానమైన వృత్తితో పాటు ఒక ఉప వృత్తిని కూడా చేపడతారు. స్నేహం, అనురాగం విషయంలోను ద్వంద్వ అలోచన చేస్తారు. విభిన్నమైన ఆశయాలు, అభిరుచులు, అనుబంధాల మూలంగా నిర్ణయాలకు రావటంలో తికమక పడతారు. మంచి చెడులు, యుక్తాయుక్తాలు గ్రహించగలరు. విమర్శలు, సమీక్షలు, విచారణలు చేయగలరు. విచక్షణను చక్కగా ఉపయోగించగలరు.  ఈ రుద్రాక్ష కవచాన్ని ధరించటం వలన వృత్తి, ఉద్యోగాలలో ఆదిపత్య పోరు ఉండదు. ఇతరుల యొక్క ప్రభావం, నరదృష్టి ఉండదు. 

మిధున రాశిలో జన్మించిన వారు హాస్యప్రియులు. వ్యవహార సంబంధమైన విషయాలను తమదైన పద్ధతిలో తెలియజేస్తారు. ఇతరుల్లో మార్పులు తేవాలని ఆశిస్తారు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించుకోవాలని చూస్తారు. సంధర్భాన్ని బట్టి మాట్లాడటంలో నేర్పు కలిగి ఉంటారు. భవిష్యత్ ప్రణాళికను చక్కగా నిర్మించుకుంటారు. ఉన్నత స్ధానాలలో ఉన్నవారు, బంధువులు, స్వంత మనుషులు ముఖ్యమైన ప్రతి సందర్భంలోను ద్రోహం చేస్తారు. చిన్నతనం నుండే కష్ట సుఖాలు, ఎత్తు పల్లాలు చూస్తారు. జీవితంలో ఎంతో అనుభవాన్ని పొందుతారు. అన్ని రంగాల పట్ల స్పష్టమైన అవగాహన చిన్న వయస్సులోనే కలుగుతుంది. వివాహం, సంతానప్రాప్తి, ఊహించిన ఇబ్బందులు ఎదురు కాకుండా నడిచిపోతాయి. మాటతప్పే మనుషుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవసరానికి ఉపయోగించుకొని ప్రత్యుపకారం చేయని వాళ్ళ వలన జీవితంలో అధికంగా కష్టం కలిగిస్తారు. తమకు న్యాయపరంగా సంప్రాప్తించాల్సిన ఆస్ది అనుకున్నంత చేతికి రాదు. ఇతరుల ధనం మీద, స్వజనుల ఆస్ధి మీద పెద్దగా ఆశ, ఆసక్తి  ఉండదు. స్వార్జిత సంపాదన పైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది. పధకాలను రచించటంలో, అమలు చేయటంలో మంచి నేర్పరితనం  ఉంటుంది. ఎవరైనా తోడు లేకపోతే కార్యక్రమాలు చేపట్టటానికి వెనుకాడతారు. దీని వలన కొంత నష్టానికి గురవుతారు. సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సామర్ధ్యం కలిగి ఉంటారు. రాజకీయ రంగాలలో రాణించాలని అమితమైన ఆసక్తి ఉంటుంది. శత్రువులపైన విజయం సాదించటానికి, సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించటానికి ఈ రుద్రాక్ష కవచం ఎంతగానో ఉపయోగపడుతుంది. 

శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలం. ఈ దశల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. జీవితంలో జరిగిన అవమానాలు, ఎదురుదెబ్బలు, నిరాదరణ భవిష్యత్ కు పునాది అవుతాయి. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. శత్రువులను దెబ్బతీయటానికి ఎంతగానో యోచిస్తారు. సమయం చిక్కిన ప్రతీకారం తీర్చుకోలేరు. సంతాన సంబంధిత విషయంలో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. తమ ఆలోచనలను సంతానం మీద రుద్దే ప్రయత్నం చేయరు. వీరి ఆలోచనలను, సామర్ధ్యాన్ని, నైపుణ్యాన్ని ఇతరులు తిరస్కరించే అవకాశం ఉంది. మన చుట్టూ ఉన్నవారే సమస్యలు సృష్టించి, ఏమి ఎరగనట్టు మళ్ళీ పరిష్కార మార్గాలను తెలియజేస్తారు.  ప్రభుత్వపరంగా, చట్టపరంగా ఉన్న లోపాలను అందరికంటే  సులువుగా గ్రహిస్తారు. కొంత ధనం చేతికి అందితే దాని ద్వారా మంచి అభివృద్ధి, అందుకు సంబంధించిన మార్గాలను చక్కగా అన్వేషించి వినియోగం చేసుకోగలరు. లెక్కలు అన్నీ కాగితం మీద లేకపోయినా అన్ని గుర్తు పెట్టుకుంటారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. సమస్య వస్తే పరిష్కరించే దాకా నిద్రపోరు. ప్రతిఘటన అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రహస్యాలు కాపాడుకోవటంలో ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. స్త్రీల వలన అపకారం కలిగే అవకాశాలు ఉన్నాయి. అందరిని ఐకమత్యంగా ఉంచటానికి గ్రూపు రాజకీయాలు రూపుమాపటానికి అధికంగా కృషిచేస్తారు. వ్యక్తిగత కుటుంబ విషయాల్లో ఇతరుల మితిమీరిన జోక్యం కాలక్రమేణ ఇబ్బంది కలిగిస్తుంది. జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాల్లో ప్రావీణ్యత ఉంటుంది. ప్రదానంగా చిన్నతనం నుండి నేర్చుకున్న విద్య కన్నా మద్యలో నేర్చుకున్నదే జీవితానికి ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యుల, సన్నిహితుల వలనే ఇబ్బందులు కలుగుతాయి. మనస్సుకు పట్టనట్లుగా వ్యవహరించి గతాన్ని మర్చిపోతే జీవితంలో ఉన్నత స్ధానాలు అందుకుంటారు. అన్నిరకాల విద్యలలో రాణించటానికి, అన్నిరకాల వృత్తి, ఉద్యోగాలలో రాణించటానికి కుటుంబ విషయాలలో అనుకూలతకు ఈ రుద్రాక్ష కవచాన్ని ధరించాలి.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...