1, ఆగస్టు 2018, బుధవారం

జాతక చక్రంలో దుస్ధానాల పరిశీలన

జాతక చక్రంలో దుస్ధానాల పరిశీలన

జాతకంలో దుస్ధానాలలో ఉన్న గ్రహాలు ఇచ్చే శుభ, అశుభ ఫలాలను కూలంకషంగా పరిశీలించిన తరువాత మాత్రమే ఫలిత నిర్ణయం చేయవలసి ఉంటుంది. వివిధ జ్యోతిష్య ఫల గ్రంధాలన్నీ 6, 8, 12 స్ధానాలు దుస్ధానాలుగా చెప్పటం జరిగింది. భారతీయులు దుస్ధానాలుగా భావించే స్ధానాలకు కూడా శుభ ఫలాలను ఆపాదించటం జరిగింది. వీరు దుస్ధానాలు కూడా శుభ ఫలాలను ఇవ్వగలవని చెప్పటం జరిగింది.

బృహత్ పరాశర హోరా శాస్త్రం 27 అధ్యాయంలో షష్థాష్టమ వ్యయ భావాలు దుస్ధానాలుగా చెప్పటం జరిగింది.  లగ్నం నుండి ఆరవ భావాన్ని శత్రు స్ధానం గాను, అష్టమ భావాన్ని ఆయుర్భావం గాను, ద్వాదశ భావాన్ని వ్యయ భావంగాను, మిగతా తొమ్మిది భావాలు శుభ భావాలగాను చెప్పటం జరిగింది.
సర్వార్ధ చింతామణి గ్రంధంలో మొదటి ప్రకరణంలో 6, 8, 12 స్ధానాలలో ఉన్న గ్రహాలు తమ ప్రభావాన్ని కోల్పోతాయని, అటువంటి గ్రహాల ఆదిపత్య భావాలు కూడా దెబ్బతినగలవని వివరించబడింది.

ఉత్తర కాలామృతం ఆయుర్ధాయ భాగంలో అష్టమాధిపతి షష్ఠ వ్యయాలలో ఉన్నప్పుడు, షష్ఠాధిపతి అష్టమ, వ్యయ స్ధానాలలో ఉన్నప్పుడు, వ్యయాధిపతి షష్ఠాష్టమాలలో ఉన్నప్పుడు, ఈ మూడు దుస్ధానాధిపతులు ఏ విధంగానైనా సంబంధాన్ని కలిగి ఉన్న అనగా పరివర్తన లేదా పరస్పర దృష్ఠి కలిగి ఉన్న ఇతర గ్రహ సంబంధం లేకుండా ఉంటే రాజయోగం కలుగుతుందని, అటువంటి జాతకులు పేరు ప్రఖ్యాతలు, సంపదలు కలవారుగా ఉండగలరని చెప్పటం జరిగింది.

సత్యా జాతకంలో శుభులు తామున్న భావాన్ని వృద్ధి చేస్తారని, పాపులు తామున్న భావాన్ని క్షీణింపజేస్తారని చెప్పటం జరిగింది. 6, 8, 12 స్ధానాధిపతుల విషయంలో ఫలితాలు తారుమారుగా ఉంటాయని అనగా షష్ఠ భావంలోని శుభులు వ్యాధులను తగ్గించగా పాపులు తీవ్ర వ్యాధులను కలిగిస్తాయని, అదే విధంగా వ్యయ భావంలో శుభులు వ్యయాన్ని తగ్గించగా పాపులు వ్యయాన్ని పెంపు జేస్తాయని చెప్పటం జరిగింది.

జాతక తత్వంలో ఏ భావం నుండైనా 6, 8, 12 స్ధానాలలో పాపులుంటే ఆ భావం బలహీనపడుతుందని, అలాగే  ఏ భావాధిపతైనా 6, 8, 12 స్ధానాలలో ఉన్నప్పుడు లేదా ఏ భావమైనా 6, 8, 12 స్ధానాధిపతులు స్దితిని పొందినప్పుడు అట్టి భావం నశిస్తుందని వివరించటం జరిగింది.

పై గ్రంధాలన్నీ 6, 8, 12 స్ధానాలు దుస్ధానాలుగాను, ఆ స్ధానాలలో చేరిన గ్రహాలు, ఆ స్ధానాధిపతులతో సంబంధం పొందిన గ్రహాలు మరియు అట్టి భావాలు బలహీనపడి దుష్ఫలితాలు ఇస్తాయని తెలుస్తుంది. అంతేకాక ఆయా భావాల నుండి లెక్కించినప్పుడు ఆ స్ధానాల నుండి 6, 8, 12 స్ధానాధిపతులు ఆ భావాన్ని క్షీణింపజేయగలరని, ఈ మూడు స్ధానాలలోని పాపగ్రహాలు కూడా ఆ భావానికి చెడు చేయగలవని గమనించాలి. అంటే ప్రతి గ్రహం ఏదో భావానికి చెడు చేసేదిగా ఉంటుంది. సహజ శుభులు, సహజ పాపులు, ఆదిపత్య శుభ శుభత్వం వివేచన చేసి ఫలిత నిర్ణయం చేయవలసి ఉంటుంది.

దుస్ధానాధిపతుల్లో అష్టమాధిపతి ఎక్కువ పాపిగాను, షష్ఠాధిపతిని అంతకంటే కొంత తక్కువ పాపిగాను, వ్యయాధిపతి తక్కువ దోషకారిగా భావించవచ్చును. దుస్ధానాధిపతులు అనుకూల స్ధానాలలో ఉన్నప్పటికీ ఇతరత్రా శుభత్వం పొందినప్పటికి కొంత దోష ఫలాలను ఇవ్వక మానటం లేదు.

షష్టమ స్ధానం:- లగ్నం నుండి ఆరవ స్ధానం వ్యాధి, విరోధం, ఋణం, బాధ, గాయాలు, తగువులు, దురదృష్ఠం, చెడ్డపేరు, దొంగతనం, అగౌరవం, శత్రుబాధలు వంటి చెడు ఫలితాలతో పాటు విజయాలు, పరిశీలనా సామర్ధ్యం,  పోటీతత్వంతో ముందుకు వెళ్ళటం వంటి శుభ ఫలితాలను కూడా సూచిస్తుంది. అయితే ఈ భావ కారకత్వాల ద్వారా లభించే శుభ ఫలితాలు కూడా మరో విధంగా కొంత బాధను కలిగించటం గమనించాలి. విజయం పొందటం ఆనందదాయకం అయినా ఆ విజయాన్ని పొందటానికి ఎంతో శ్రమించాలి. పైగా సాధించిన విజయాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం కృషి చేయాలి. అంటే ఆరవ స్ధానం తెచ్చిపెట్టే ఈ విజయం ఎంతో శ్రమకరమైనదిగా గమనించాలి. సత్యాచార్యుల వారు లగ్నాదిగా షష్ఠాధిపతి లగ్నంలో ఉంటే వ్యక్తి అధికార సంపన్నుడు అవుతాడని అదే విధంగా రోగగ్రస్తుడు కూడా కావటం గమనించాలి అని చెప్పారు.

ఆరవ స్ధానాధిపతి ఎనిమిది, పన్నెండు స్ధానాలలో ఉంటే విపరీత రాజయోగాన్ని కలిగించినా దురలవాట్లు, అనారోగ్యం కల్పించటం గమనించాలి. షష్ఠాధిపతి  ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ సంబంధమైన వ్యాధులు కలగటం, ఆ గ్రహ సంబంధ కారకత్వాలు తగ్గిపోవటం, గురువు వంటి శుభగ్రహాలు ఆరవ స్ధానంలో చేరినా ఆ స్ధానానికి అనుగుణంగా వీటి గ్రహ కారకత్వాలు ప్రభావితం కావటం జరుగుతుంది. ఆరవ స్ధానం శుభ గ్రహ స్ధానమై అందులో శుభ గ్రహాలు ఉంటే జాతకునికి దాయాదుల సహాయం లభించినప్పటికి శత్రు బాధలు ఉంటాయని కొన్ని నాడీ గ్రంధాలు తెలుపుతున్నాయి.

అష్టమ భావం:- లగ్నం నుండి ఎనిమిదవ స్ధానం ఆయుష్షు, అవమానం, ఆపద, వ్యాధి, దుఃఖం, బద్ధకం, ధన నష్ఠం, భయం, ప్రభుత్వం ద్వారా నష్టం, దుష్టులతో స్నేహం, పాపం, జీవ హింస, కారాగారం, అవయవ లోపం వంటి చెడు కారకత్వాలతో పాటు ఆకస్మిక ధన లాభం, బంధు మరణం వలన కలసి వచ్చే ఆస్తి వంటి కొన్ని ఇహపర సౌఖ్యాన్ని ఇచ్చే విషయాలు అష్టమ భావ కారకత్వాలుగా చెప్పబడినాయి. ఈ భావం బలహీనంగా ఉంటే తక్కువ ఆయుష్షు కలగటం, బలంగా ఉంటే ఎక్కువ ఆయుష్షు పొందటం జరుగుతుంది. మితిమీరిన ఆయుర్ధాయం కూడా బాధాకరమైనది. అల్పాయుష్షు కలవానికి జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా ప్రయోజనం ఉండదు. బంధు మరణం వలన సంక్రమించిన ధనంతో బాధ కూడా మిళితమై ఉంటుంది. ఆకస్మికంగా లభించిన ధనం వ్యక్తిని బాద్యతారహితునిగా మార్చటం మనం గమనించవచ్చును.

అష్టమ భావంలో చేరిన గ్రహం పాప ఫలితాన్ని ఇస్తుంది. శుభగ్రహాలు కొంత శుభ ఫలితాలను ఎంతో కొంత చెడు ఫలితాన్ని ఇవ్వక మానవు. అష్టమ బుధుడు మంచి బంధువులను, స్నేహితులను ఇచ్చిన విధ్యాభంగం కలిగిస్తుంది. గురుడు మంచి ఆయుష్షు, వినయ విధేయతలను కల్పించినా సంతాన దోషం కలిగిస్తుంది. నీచ కర్మలు చేసే విధంగా ప్రోత్సహిస్తుంది. సామాన్యంగా అష్టమాధిపతి వ్యక్తిని అత్యాశకు లోబడేటట్లు చేస్తుంది. అష్టమాధిపతి బలంగా ఉంటే వ్యక్తి ఋణ విముక్తుడు అవుతాడు. అష్టమాధిపతికి పాప గ్రహ, స్ధాన సంబంధం కలిగితే దారిద్ర్యం, అపకీర్తి, రోగం, మరణ తుల్య కష్టాలు కలుగుతాయి.     

వ్యయ భావం:- లగ్నం నుండి 12 వ భావం వ్యయ భావం. నష్టం, ఖర్చు, దీనత్వం, దయ, దైవజ్ఞానం, ధైవారాధన, మోక్షం, మరణాంతరం జీవుని స్ధితి, దుబారా, నిద్రలేమి, మానసిక ఆందోళన, శత్రుభయం, బందనం, ప్రజాద్వేషం, అంగవైకల్యం, సమయం వృధా, లైంగిక సమస్యలు, వివాహ భంగం, అధికార నష్టం, అపకారం, కోపం, వివాదం, అనారోగ్యం, మరణం, స్ధాన చలనం, భార్యా భర్తల మద్య ఎడబాటు మొదలగు అంశాలు వ్యయభావం నుండి పరిశీలించవచ్చును. ధైవ భక్తి, మోక్షమార్గం, యోగ, ధ్యానం వంటి కొన్ని శుభ ఫలాలు వ్యయ సూచకమైనప్పటికి ఎన్నో అవయోగాలకు,కష్ట నష్టాలకు కూడా ఇదే నిలయం.

వ్యయ భావంలోని శుభగ్రహాలు పాప ఫలాలను తొలగించి అనుకూల ఫలాలను వృద్ధి చేస్తే, పాప గ్రహాలు వ్యతిరేక ఫలాలను వృద్ధి చేస్తాయి. వ్యయంలో బుధుడు పరిశోధనాశక్తిని, రచనా శక్తిని కల్పించినా వాక్ శుద్ధిని తగ్గించి, ఆందోళనను పెంచును. శుక్రుడు శయ్యా సుఖాన్ని, నిధి నిక్షేపాలు, బహుమతుల ద్వారా లబ్ధి పొందినప్పటికి ప్రేమ వ్యవహారాలలో ప్రతికూలతలకు, అధిక వ్యయానికి కారణమవుతుంది. వ్యయ గురువు యోగ, ధ్యానాదులకు కారణమైన గురుద్వేషం, సంతాన నష్టం, అధిక ధన వ్యయం కలిగిస్తుంది. వ్యయ సూచకమైన విదేశీయానం ధనార్జనకు ఉపయోగపడుతున్నా సౌఖ్య లోపం, బందువుల నుండి, ఆప్తుల నుండి దూరంగా ఉండవలసి రావటం వంటి అసంతృప్తి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మితిమీరిన వైరాగ్యం, మోక్ష భావన వ్యక్తిని లౌకిక కార్యాచరణకు దూరం చేస్తుంది. మితిమీరిన వ్యయం అనేక ఇబ్బందులను కలిగిస్తుంది.

వీటన్నింటిని పరిశీలించిన తరువాత దుస్ధానాల ద్వారా లభించే కొద్దిపాటి శుభ ఫలాలు కూడా అసంపూర్ణానందాన్ని మాత్రమే ఇవ్వగలవని తెలుస్తుంది.   

1 కామెంట్‌:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...