
"రుద్రాక్ష" పరమేశ్వరుని కనుల నుండి జాలువారిన కన్నీళ్ళే భూమిపైన రుద్రాక్షలుగా ఉద్భవించాయి. రుద్రాక్ష పుట్టుక గురించి పురాణాలలో అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. పురాణ శాస్త్ర ప్రకారం శివుడు రాక్షసులతో పోరాడి మూడు పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారిస్తాడు. అలా శివుడు విచారించినప్పుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారతాయి. వాటి నుంచి పుట్టినవే “రుద్రాక్షలు”.

శివుని కుడికన్ను అయిన ‘సూర్యనేత్రం’ నుండి పన్నెండురకాల రుద్రాక్షలు, ఎడమకన్ను అయిన ‘చంద్రనేత్రం’ నుండి పదహారు రకాల రుద్రాక్షలు, మూడవ కన్ను అయిన ‘అగ్నినేత్రం’ నుండి పది రకాల రుద్రాక్షలు వచ్చాయని శాస్త్ర వచనం. సూర్యుని నుండి వచ్చినవి ‘ఎర్ర’గాను, చంద్రుని నుండి వచ్చినవి‘తెల్ల’గాను,అగ్ని నుండి వచ్చినవి ‘నల్ల’ గాను ఉంటాయని దేవీ భాగవతంలో తెలియజేయబడింది.
రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.