10, జూన్ 2016, శుక్రవారం

కేతువు గ్రహ వివరణ

జ్యోతిష్యంలో కేతు గ్రహం యొక్క వివరణ, కారకత్వం, వ్యాధులు, వృత్తులు వ్యాపారాలు, దశ, గోచార ఫలితాలు, పరిహారాలు(రెమిడీస్)

 కేతువు గ్రహ వివరణ

కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని ఏడవ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం ఏడు సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి పుట్టిన ఆరంభ దశ కేతు దశ. కేతువుకు అవల, శిఖి, ధూమ, ధ్వజ, మృత్యు పుత్ర అనే ఇతర నామాలు ఉన్నాయి. కేతువు పురుష గ్రహము. గ్రహ స్వభావం పాప గ్రహం, తత్వం వైరాగ్యము, స్వభావం క్రూర స్వభావం, గుణం తమోగుణం, దిక్కు వాయవ్యము, ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. ఆత్మాధికారం మోక్షం, పాలనా శక్తి భటుడు, లోహము ఇనుము, కుటుంబ సభ్యుడు తాత, వర్ణం ధూమ్ర వర్ణం, గ్రహ పీడ అతి తెలివి, గ్రహ వర్గం గురువు, గృహంలోని ఖాళీ ప్రదేశాలను సూచిస్తాడు.


కాల బలము పగలు, కాల బలం పగలు, శత్రు క్షేత్రం కటకం, సమ క్షేత్రం మీనము, ఉచ్ఛ క్షేత్రము వృశ్చికము, నీచ క్షేత్రము వృషభము, మిత్రులు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శత్రువులు శని, శుక్రుడు, సములు గురువు, బుధుడు. వయసు ముసలి వయసు, చెట్లు ముళ్ళ చెట్లు, ధాన్యం ఉలవలు, పండ్లు సీతా ఫల, ప్రదేశములు గుహలు, బిలములు. దేశంలో కేతువు ఆధిక్యత ఉన్న ప్రదేశం అంతర్వేధి. ధాన్యము ఉలవలు, పక్షులు రాబందు, గద్ద, కోడి. జంతువులు కుక్క, పంది, గాడిద. మూలికలు తెల్ల జిల్లేడు, పున్నేరు వేరు, సమిధలు దర్భ. దైవ వర్గం వైష్ణవ, గోత్రము పైఠీనస. అవతారం మీనావతారం. గ్రహారూఢ వాహనం గ్రద్ద, రత్నము వైఢూర్యం, రుద్రాక్ష నవ ముఖ రుద్రాక్ష, లోహము కంచు, శుభ సమయం ఉదయ కాలం. వారము ఆదివారం. స్వభావం చంచల స్వభావం. దృష్టి అధోదృష్టి.

కేతుగ్రహ కారకత్వము

కేతువు కుటుంబ సభ్యులలో తాత(తల్లికి తండ్రి)ను సూచిస్తాడు. కేతువు దైవోపాసన, వేదాంతం, తపస్సు, మోక్షము, మంత్ర శాస్త్రము, భక్తి, నదీస్నానం, మౌన వ్రతం, పుణ్యక్షేత్ర దర్శనం, మోసము, పరుల సొమ్ముతో సుఖించుట, దత్తత మొదలైన వాటిని సూచిస్తాడు.

కేతుగ్రహ వ్యాధులు :- అజీర్ణం, స్పోటకము, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గ్యాస్, అసిడిటీ, వైద్యము, జ్వరము, వ్రణములను సూచిస్తాడు కేతువు ఏగ్రహముతో కలిసిన ఆ అవయవమునందు బాధలు కలిగిస్తాడు. రోగ నిర్దారణ సాగదు కనుక చికిత్స జరుగుటలో సమస్యలు సృష్టిస్తాడు. ఇతడు మృత్యు కారకుడు, భయాన్ని కలిగిస్తాడు, రక్తపోటు, అలర్జీ, మతి స్థిమితం లేక పోవుట మొదలైన వ్యాధులకు కారకుడౌతాడు.

కేతుగ్రహ రూపము

కేతువు పార్ధివ నామసంవత్సరం ఫాల్గుణమాసం శుక్ల పౌర్ణమి అభిజిత్ నక్షత్రంలో బుధవారం జన్మించాడు. కేతువు గోత్రం జైమినీ పైఠీనస. కేతువు బూడిద(బూడిద)వర్ణంలో రెండు భుజములతో ఉంటాడు. కేతువు వాహనం గ్రద్ద. బ్రహ్మదేవుడికి తాను సృష్టించి జనం అపారంగా పెరగడంతో వారిని తగ్గించడానికి మృత్యువు అనే కన్యను సృష్టించాడు. మానవులకు మరణం ఇచ్చే బాధ్యతను అప్పగించాడు. తనకు మరణం ఇచ్చినందుకు ఆ కన్య దుఃఖించింది. ఆమె కన్నీటి నుండి అనేక వ్యాధులు ఉద్భవించాయి. అప్పుడు తెల్లని పొగ రూపంలో ఒక పురుషుడు జన్మించాడు. కీలక నామ సంవత్సరం మార్గశిర కృష్ణ అమావాస్య నాడు మంగళ వారం మూలా నక్షత్రంలో కేతువు జననం జరిగింది. బ్రహ్మ ఆజ్ఞానువర్తి అయి కేతువు ధూమ్ర కేతువుగా సంచరించ సాగాడు. క్షీరసాగర మధన సమయంలో మోహినీ చేతి అమృతం తాగిన తరువాత విష్ణువుకేతువు తల నరికి ఆస్థానమలోపాము తలను ధరింప చేసాడు. అప్పటి నుండి కేతువుగా నామధేయం చేయబడి విష్ణు అనుగ్రహం చేత గ్రహస్థితి పొందాడు. కేతువు పత్ని చిత్ర రేఖ. సాధారణంగా కేతువు ఒంటరిగా కుజ ఫలితాలను ఇచ్చినా ఏగ్రహంతో చేరి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. గ్రహస్థానం పొందిన కేతువు విష్ణువుకు అంజలి ఘటిస్తూ ఉంటాడు.

కేతుగ్రహ పరిహారాలు

కేతుగ్రహ పరిహార పూజార్ధంగా కంచు ప్రతిమ శ్రేష్టం. అధి దేవత బ్రహ్మ. నైవేధ్యం చిత్రాన్నం, కుడుములు, ఉలవ గుగ్గిళ్ళు. ప్రీతికరమైన తిథి చైత్ర శుద్ధ చవితి. ఆచరించ వలసిన వ్రతం పుత్ర గణపతి వ్రతం, పారాయణం చేయవలసినది శ్రీ గణేశ పురాణం, కేతు అష్టోత్తర శతనామావళి, గణేశ శతనామావళి. దక్షిణగా ఇవ్వ వలసిన జంతువు మేక, ధరించ వలసిన రత్నం వైడూర్యం, ధరించ వలసిన మాల రుద్రాక్ష మాల, ధరించ వలసిన రుద్రాక్ష నవముఖి రుద్రాక్ష. ఆచరించ వలసిన దీక్ష గణేశ దీక్ష. చేయ వలసిన పూజ విజ్ఞేశ్వర పూజ, సూర్యారాధన, దానం చేయవలసిన ఆహార పదార్ధాలు ఖర్జూరం, ఉలవలు. గ్రహస్థితిని పొందిన వారం బుధవారం. మండపం జెండా ఆకారం. గ్రహం బలంగా ఉంటే ఆధ్యాత్మిక చింతన బలహీనమైన అతి భయం కలుగుతుంది.

ద్వాదశ స్ధానాలలో కేతువు

1.     లగ్నంలో కేతువు ఉన్నజాతకుడు అవయవములు కలవాడు సుఖహీనుడు, స్థానభ్రష్టుడు, మాయావులతో మాటాడు వాడు ఔతాడు. అధికంగా స్వేదం స్రవించువాడు, చక్కని ప్రజా సంబంధాలు కలిగిన వాడు, కృతఘ్నుడు, చాడీలు చెప్పువాడు, జాతిభ్రష్టుడు, స్థానభ్రష్టుడు, అసంపూర్ణమైన అవయవములు కలవాడు, మాయావులతో కలసి ఉండు వాడు ఔతాడు.

2.     ద్వితీయ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు విద్యలేని వాడు, విద్యాహీనుడు, ధనం లేనివాడు, అల్పపదములు పలుకువాడు, దుష్టబుద్ధి కలిగిన వాడు, పరుల మీద ఆధారపడి జీవించువాడు, శాంతస్వభావులు, ముక్తసరిగా మాటాడు వాడు ఔతాడు.

3.     తృతీయ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు చిరంజీవి, శక్తి సంపన్నుడు, ఆస్తి కలవాడు, కీర్తికలవాడు, భార్యాసమేతంగా జీవితం సాగించువాడు, సుఖంగా భుజించు వాడు, సోదరుని కోల్పోవు వాడు ఔతాడు.

4.     చతుర్ధ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు భూమిని, తల్లిని, వాహనములను, సుఖములను కోల్పోవును. స్వస్థలమును వదిలి అన్యప్రదేశంలో జీవించు వాడు. పరధనముతో జీవించు వాడు, గొడవలు పెట్టుకునే స్వభావం కలవాడు ఔతాడు.

5.     పంచమ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు గర్భకోశ వ్యాధి పీడితుడు ఔతాడు, సంతతిని నష్టం కలుగువాడు, పిశాచపీడచేత బాధపొందువాడు, దుర్బుద్ధి కలవాడు, మోసగాడు ఔతాడు.

6.      షష్టమ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు మాటకారి, ఉదారుడు, ఉత్తమగుణ సంపన్నుడు, దృఢచిత్తుడు, మిగుల కీర్తివంతుడు, ఉన్నతోద్యోగి, శతృనాశనాపరుడు, కోరికలు సిద్ధించు వాడు ఔతాడు.

7.     సప్తమ స్థానమున కేతువు ఉన్న జాతకుడు అగౌరవం పొందువాడు, దుష్ట స్త్రీ సమేతుడు, అంతర్గత రోగపీడితుడు, కళత్రనష్టం పొందువాడు, శక్తి హీనుడు,

8.     అష్టమ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు అల్పాయుష్మంతుడు, ప్రాణమిత్రులను విడిచిన వాడు, కలహములతో జీవించువాడు, ప్రాణమిత్రులను విడిచిన వాడు, ఆయుధముల చేత గాయపడిన వాడు, నిరాశా నిస్పృహలతో కార్యములు చేయువాడు, కళత్రముతో పేచీలు పడువాడు ఔతాడు.

9.     నవమ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు పాపచింతన కలిగిన వాడు, అశుభవంతుడు, పితృదేవతలను అణచివేయు వాడు, దురదృష్ట వంతుడు, ప్రసిద్ధులను దూషించు వాడు, చత్వారం, మంచి కళత్రం కలిగినవాడు ఔతాడు.

10.  దశమ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు కార్యములలో విజ్ఞములు కలుగు వాడు, మలినుడు, నీచమైన కార్యములు చేయువాడు, శక్తిమంతుడు, బహుకీర్తిమంతుడు, తాత్విక చింతన కలవాడు ఔతాడు.

11.  ఏకాదశ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు ధనవంతుడు, బహుగుణవంతుడు, భోగి, మంచి వస్తువులు పొందు వాడు, ప్రతి కార్యమునందూ విజయం సాధించు వాడు, హాస్యచతురత కలిగిన వాడు ఔతాడు.

12.  ద్వాదశ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు రహస్యంగా దురాచారములు చేయువాడు, అధమ కార్యాలు చేయువాడు, ధననాశనం పొందిన వాడు, ఆస్తిని నాశనం చేయువాడు, విరుద్ధమైన ప్రవర్తజ్ఞ కలిగిన వాడు, నేత్రరోగి, విదేశీయానం చేసేవాడు ఔతాడు.

కేతువు ఉన్న స్థాన ఫలితాలు కేతువు మహర్ధశా కాలములో మాత్రమే ఫలితాలను ఇస్తాయి.

1.     లగ్నము :- జాతక చక్రములో ప్రధమ స్థానాన్ని లగ్నము అంటారు. కేతువు ప్రధమ స్థానములో ఉన్న జాతకుడు ధైవభక్తి కలిగి ఉంటాడు. వికార దేహం కలిగి ఉంటాడు. కోప స్వభావాలు  ప్రదర్శించే వారుగా ఉంటారు. మనో చింతన కలిగి ఉంటారు.

2.  ద్వితీయస్థానములో కేతువు ఉన్న జాతకుడు నేత్ర వ్యాధి కలిగి ఉంటాడు. కంటి చూపులో ప్రాబ్లం ఉంటుంది. కుటుంబ భాదలు ఉంటాయి.

3. కేతువు  తృతీయ స్థానమున ఉన్న జాతకుడు లలితా కళల యందు రాణింపు, జనసహకారం కలిగి ఉంటారు.

4. కేతువు చతుర్ధ స్థానమున ఉన్న జాతకుడు బందు విరోధి అవుతాడు. తల్లికి కష్టాలు ఉంటాయి. విద్యల అందు ఆటంకం కలిగిస్తాడు. ఆస్తి నష్టం, చోర భయం ఉంటుంది. స్ధాన చలనం కలిగి ఉంటారు.

5. కేతువు పంచమస్థానములో ఉన్న జాతకుడు వక్ర బుద్ధి కలిగి ఉంటారు. సంతాన నష్టం కలిగిస్తాడు. క్షుద్ర దేవతోపాసన కలిగి ఉంటాడు.

6. కేతువు  షష్టమస్థానమున ఉన్న జాతకుడు పుత్ర లాభం కలిగి ఉంటాడు. శత్రువులపైనా పోటీతత్వం ఉంటుంది. సంచార వృత్తిలో అనుకూలత కలిగి ఉంటారు.

7. కేతువు సప్తమ స్థానమున ఉన్న జాతకుడు వివాహా బాగస్వామితో గొడవలు కలిగి ఉంటారు. సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి.

8. కేతువు అష్టమ స్థానమున ఉన్న జాతకుడు రోగ భయం కలిగి ఉంటాడు. ఆకస్మిక కష్ట నష్టాలు ఎదుర్కొంటారు.

9. కేతువు  నవమ స్థానమున ఉన్న జాతకుడు తండ్రి నష్టం, అతి భక్తి కలిగి ఉంటారు. గురు విరోధి, బందు విరోధి, ప్రజా విరోధిగా ఉంటాడు.

10. కేతువు దశమస్థానమున ఉన్న జాతకుడు అపకీర్తి కలిగి ఉంటాడు. మనో వ్యాధి ఉంటుంది. వృత్తిలో స్ధిరత్వం ఉండదు.

11. కేతువు ఏకాదశమున ఉన్న జాతకుడు ధనసంపద సౌఖ్యమును, ఉద్యోగం, గౌరవాలు కలిగి ఉంటారు. దాన దర్మాలు చేస్తారు.

12. కేతువు వ్యయంలో ఉన్న జాతకుడు మూడ భక్తి కలిగి ఉంటాడు. ఆర్ధిక నష్టం కలిగి ఉంటాడు. దేశాంతర నివాసం కలిగి ఉంటాడు.

గోచార కేతువు  ఫలితములు

1 . స్థానము :- కేతువు చంద్రుడు ఉన్న స్థానములో ఉన్నప్పుడు లెక ప్రవేశించినప్పుడు వ్యాధులు, రొగములు పీడించును. అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి ఉన్నందు వలన మానసిక వ్యాకులత కలుగును. శారీరక అలసట కలిగి ఉంటారు.

2. కేతువు చంద్రుడికి ద్వితీయ స్థానములో ప్రవేశించినప్పుడు అవవసర ధన వ్యయమును కలిగించి వ్యక్తిని ఆర్ధిక ఇబ్బందులకు గురి చేస్తాడు. కుటుంబము, సహసంబంధులతో కలతలు కలిగించును. కుటుంబ సభ్యుల మధ్య వివాదములు తలెత్తుతాయి. ఈ కాలము వ్యక్తిని మధ్యము వంటి మత్తు పదార్ధములకు బానిసను చేస్తుంది కనుక జాగ్రత్త వహించుట మంచిది.

3. కేతువు తృతీయ స్థాన ప్రవేసము శుభఫలితాలను ఇస్తుంది. ఇతరులతో చేరి చతురతను ఉపయోగించి కార్యములు చక్కబెట్టుటకు ప్రయత్నము చేస్తారు. ఏ కార్యము చేసినా గుప్తముగా చేసి దానిని పూర్తి చేసిన తరువాతనే బహిర్గతము చేస్తారు.

4. కేతువు చతుర్ధ స్థాన ప్రవేశము అనేక సమస్యలను కష్టములను కలిగించును. తల్లికి కష్టములను కలిగించును. అడుగడునా కష్టములు, సమస్యలు ఎదురౌతూ అగౌరవము, అవమానము కలుగుతాయాన్న భయము సదా వెన్నంటి ఉంటుంది. భూమి, వాహనము సంబంధించిన సమస్యలు ఎదురౌతాయి.

5. కేతువు పంచమస్థాన ప్రవేశము కష్టములు, దుఃఖము కలిగించును. మతిభ్రమను కలిగించును. త్వరగా ధనికుడు కావాలన్న పగటికలలు కంటూ ధనము కావలన్న లాలసలో ఉన్న ధనమును కోల్పోవడము జరుగుతుంది.

6. కేతువు షష్టమ స్థాన ప్రవేశము అంతగా హాని కలిగించక పోయినా ఆరోగ్యము మీద ప్రభావము చూపెట్టవచ్చు కనుక భోజన పానీయాలను తీసుకునే విషయములో శ్రద్ధ వహించ వలసి ఉంది. ఉదర సంభంధిత సమస్యలు పీడిస్తాయి. ఈ సమయములో ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది ఆకస్మిక ధనలాభము వస్తుంది.

7. కేతువు సప్తమభావ ప్రవేశము దాంపత్య జీవితము బాధించును. భార్యాభర్తల మధ్య కలతలు పెరిగి దూరము కలగ వచ్చు. కళత్రానికి కష్టములు కలుగుతాయి. ఆరోగ్యకారనముగా దుఃఖిస్తారు. సహజమైన బుద్ధి కూడా సరిగా పని చెయ్యదు.

8. కేతువు అష్టమ స్థాన ప్రవేశము ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పలువిధ రోగములు వస్తాయి. మూత్ర సంబంధిత వ్యాదులతో బాధపడవచ్చు. ఆర్ధికమైన సమస్యలను ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు ఆర్ధిక నష్టము సంభవము.

9. కేతువు నవమ స్థాన ప్రవేశము తలపెట్టిన కార్యమౌలన్నింటా రాహువు ఆటంకములను కలిగించవచ్చు. పనులు పూర్తికానున్న తరుణములో పనులు ఆగవచ్చు. అనవసర ఖర్చుల వలన ఆర్ధికపరమైన చిక్కులు తలెత్తవచ్చు.

10. కేతువు దశమ స్థాన ప్రవేశము ఉద్యోగ బదిలీలకు కారణము ఔతుంది. అప్పటి వరకూ చేస్తున్న పనిని వదిలి వెరొక పని చేయవలసి ఉంటుంది. ఆర్ధికపరమైన నష్టముకలగవచ్చు. అనవసర శృమ ఫలితముగా అలసట కలగవచ్చు.

11. కేతువు ఏకాదశ స్థాన ప్రవేశము శుభఫలితాలను ఇస్తుంది. ఈ సమయములో గౌరవము, కీర్తి, ప్రతిష్ఠ కలగ వచ్చు. పాత దారులలో ఆదాయముతో కొత్త దారులలో కూడా ఆదాయము రావచ్చు. ఆర్ధికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. కార్యసఫలత కలుగుతుంది.

12. కేతువు ద్వాదశ స్థాన ప్రవేశము అనవసర ఖర్చులను కలగ చేస్తుంది. ఫలించని పగటి కలలను కలిగిస్తాయి. గాలిమేడలు కట్టడం ఊహాగానాల వలన ప్రయోజనము శూన్యము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...