1, జూన్ 2016, బుధవారం

షడ్బలములు


షడ్బలములు

బలం కలిగి ఉండడం అనే విషయంలో ‘బలవాన్ షడ్బల యుక్తస్సన్’ అని చెప్పారు. స్థానంలో షడ్బలయుక్తుడయి ఉండడం ప్రధానం అని చెప్పారు. జాతక చక్రంలో గ్రహాలు షడ్బలములలో ఏదో ఒక బలమును కలిగి ఉండాలి. అప్పుడే ఆ గ్రహం బలం కలిగి ఉంటుంది. జాతకంలో యోగ కారక గ్రహాలు షడ్బలములలో ఏదో ఒక బలము ఖచ్చితంగా కలిగి ఉండాలి.

షడ్బలములు అంటే ఆరు రకములు. స్థానబలం, దిగ్బలం, దృగ్బలం, కాలబలం, చేష్టాబలం, నైసర్గిక బలం అనేవి. షడ్బలములు జాతకపరిశీలనలో ఆయుర్ధాయం, గ్రహ, భావ బలముల, బలహీనతల విషయంలో ఉపయోగపడతాయి. ఉదా:- జాతక చక్రంలో లగ్నం బలంగా ఉంటే లగ్నం నుండి ఫలితాలు బాగుంటాయి. చంద్రలగ్నం బలంగా ఉంటే చంద్రలగ్నం నుండి ఫలితాలు బాగుంటాయి. సూర్య లగ్నం బలంగా ఉంటే సూర్య లగ్నం నుండి ఫలితాలు బాగుంటాయి. అదే విధంగా దశ అంతర్ధశలలోను సూర్యుడి మహాదశలో చంద్ర అంతర్ధశ జరుగుతున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ గ్రహ ఫలితాలు వస్తాయి.

స్ధానబలం గ్రహానికి ఉంటే ఉన్న ప్రదేశంలో రాణిస్తాడు.

దిగ్భలం గ్రహానికి ఉంటే సమస్య పరిష్కారం తొందరగా అవుతుంది.

చేష్టా బలం గ్రహానికి ఉంటే జాతకుడు చేసే ప్రతి పని మేలు చేస్తుంది. అతని చేష్టలు (పనులు) ఇతరులు మెచ్చుకుంటారు.

కాలబలం గ్రహానికి ఉంటే సమయం వృధా కాకుండా ఉంటుంది.

దృగ్భలం గ్రహానికి ఉంటే ఇతరుల దృష్టిలో మంచివాడవుతాడు. నరదృష్టి ఉండదు.
నైసర్గిక బలం గ్రహానికి ఉంటే ప్రత్యేకమైన ఫలితాలు ఏమి ఉండవు.

1.స్ధానబలం:- జాతకచక్రంలో ఏ గ్రహమైన ఉచ్చ, మూలత్రికోణం, స్వస్ధాన, మిత్ర స్ధానాలలో ఉన్నప్పుడు స్ధాన బలం కలిగి ఉంటుంది.

2.దిగ్భలము:- లగ్నం తూర్పును, దశమం దక్షిణాన్ని, సప్తమం పడమర, చతుర్ధం ఉత్తర దిక్కులను తెలియజేస్తాయి. గురువు, బుధులు లగ్నములో (తూర్పు) ఉన్నప్పుడు , రవి, కుజులు దశమంలో (దక్షిణం) ఉన్నప్పుడు, శని సప్తమంలో (పడమర) ఉన్నప్పుడు, శుక్ర, చంద్రులు చతుర్ధంలో (ఉత్తరం) లో ఉన్నప్పుడు బలం కలిగి దిగ్భలం కలిగి ఉంటారు. వ్యతిరేక దిశలలో ఉంటే దిగ్బలాన్ని కోల్పోతారు. ఉదా:- సూర్యుడు దశమంలో ఉంటే దిగ్భలం కలిగి ఉంటుంది. అదే చతుర్ధంలో ఉంటే దిగ్భాలాన్ని కోల్పోయి నిర్భలము పొందును.

3. చేష్టాబలం:- రవి, చంద్రులు ఉత్తరాయణంలో ప్రయాణిస్తున్నప్పుడు, కుజ, గురు, బుధ, శుక్ర, శనులు వక్రము పొంది ఉన్నప్పుడు బలాన్ని కలిగి ఉంటారు. శుభగ్రహాలు శుక్ల పక్షం నందు, పాపగ్రహాలు బహుళ పక్షము నందు బలవంతులు.

4. కాలబలం:- చంద్ర, కుజ, శనులు రాత్రి సమయములందు, రవి, గురు, శుక్రులు పగటి సమయమందు, బుధుడు అన్నీ సమయములందు బలము కలిగి ఉంటాడు. పాపగ్రహములు కృష్ణపక్షమునందు, శుభగ్రహములు శుక్లపక్షమునందు బలము కలిగి ఉంటారు. ఆయా గ్రహాలకు సంబందించిన వారము, మాసములలోనూ బలము కలిగి ఉంటారు.

5. దృగ్భలం:- గ్రహములు శుభ గ్రహములచే చూడబడుతున్నప్పుడు శుభగ్రహముల దృష్టి దృగ్భలాన్ని, పాపగ్రహముల దృష్టి వ్యతిరేఖ ఫలితాలను కలిగిస్తాయి.

6. నైసర్గిక బలం:- రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ మరియు శనులు వరసగా బలం కలిగి ఉంటారు. శని కంటే కుజుడు, కుజుని కంటే బుధుడు, బుధుని కంటే గురువు, గురువు కంటే శుక్రుడు, శుక్రుని కంటే చంద్రుడు, చంద్రుని కంటే రవి బలవంతులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...