2, జూన్ 2017, శుక్రవారం

యోగిని దశా ఫలితాలు - దోష పరిహారాలు

యోగిని దశా ఫలితాలు

శ్లో:- మంగళా పింగళం ధాన్యా భ్రామరీ భద్రికా తధా |
     ఉల్కా సిద్ధా సంకటా చ ఏతాసాం నామవత్ఫలమ్  ||
యోగిని దశాపద్ధతి యందలి యోగినీలు 1)మంగళ 2)పింగళ 3)ధాన్య 4)భ్రామరీ 5)భద్రిక 6)ఉల్క 7)సిద్ధ 8)సంకట ఆయా యోగినీల పేర్లకు సూచకంగా శుభాశుభ ఫలములు కలుగును. ఇందు మంగళ, ధాన్య, భద్రికా, సిద్ధ ఇవి శుభ దశాలుగాను మిగిలినవి అశుభ దశాలుగాను గుర్తించవలెను.

యోగినీ దశలకు అధిపతులు
శ్లో:- చంద్రః సూర్యో వాక్పతిర్భూమి పుత్ర శ్చాంద్రిర్మందో భార్గవః సైంహికీయ |
ఏతేనాధా మంగలాద్రిప్రదిష్టాః సౌమ్యా సౌమ్యా నామానిష్టాః ఖలానామ్ ||
చంద్ర,, రవి, కుజ, బుధ, శని, శుక్ర, రాహువులు క్రమముగా మంగళ నుండి సంకటవరకు దశలకు అధిపతులు అగుదురు. ఇందు శుభ యోగినులకు శుభ గ్రహములు, పాప యోగినులకు పాపగ్రహములు చెప్పబడి తదనుగుణ ఫలితములు కలుగును.


యోగినీ దశా సంవత్సరాలు
శ్లో:-  ఏకం ద్వౌ గుణవేద బాణరససప్తాష్టాంక సంఖ్యాః క్రమాత్
స్వీయ స్వీయ దశా విపాకసమయే జ్ఞేయం శుభం వా శోభమ్
షటత్రింశై విభజేద్ధిణీకృత మధైక ద్విత్రివేధ పుషట్
సప్తాశ్టఘ్నదశా భలే యురీతి తా ఏవం దశాంతర్ధశాః
మగళాదీ ఎనిమిది యోగినీలకు క్రమముగా 1, 2, 3, 4, 5, 6, 7, 8  సంవత్సరములు దశా సంవత్సరములు అగును. తమతమ దశలలో ఈ యోగినీలు తమ గుణానుసారం శుభ అశుభ ఫలితాలను ఇవ్వగలవు. ఈ విధంగా 36 సంవత్సరములకు మొత్తం దశా చక్రం పూర్తి అగును. 

యోగినీ దశా కాలమందు యోగినీ దశకు అధిపతి ఐన గ్రహం అస్తంగత్వం చెందినను, శత్రు క్షేత్రమున ఉన్నను, నీచయందు ఉన్నను, వర్ష కుండలి యందు షష్టమ స్ధానం నందు గ్రహము ఉన్నను ఆ దశాకాలము అశుభ ఫలితాలను ఇచ్చును. స్వక్షేత్ర, ఉచ్చ, మిత్ర, మూల త్రికోణముల యందు ఉన్న గ్రహములు అనేక విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చును. 
   
మంగళ దశా ఫలం:- శ్లో:- మంగళా మంగళా ప్రోక్తాయశో విద్యార్ధదాయిని |
                              సువస్త్రాభరణం లాభం వివాహం రాజపూజనం ||
         మంగళ దశ ఒక సంవత్సర కాలం ఉంటుంది. మంగళ దశకు అధిపతి చంద్రుడు. జాతకుడు ఈ మంగళ దశ యందు ఇతరులకు అపాకారం చేయకుండా ధర్మ ప్రవృత్తి కలిగి ఉంటాడు.  భగవంతుడిపైన భక్తి కలిగి ఉండి యజ్ఞయాగాదులు, వ్రతాలు, పూజలు చేస్తాడు. అన్నీ రకాల సౌఖ్యాలను పొందుతాడు. స్వధన సంపాదన కలిగి ఉంటాడు. వాహన సౌఖ్యాలు పొందుతాడు. కుటుంబం నందు శుభకార్యాలు జరుగుటకు మంచి సమయం. కొత్త వస్త్రాభరణాలు ధరిస్తారు. సంసార సౌఖ్యతను పొందుతారు. జ్ఞానాభివృద్ధిని కలిగి ఉంటారు. దశకు అధిపతియైన చంద్రుడు నీచలో ఉన్నను లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్నను మానసిక వేదనకు గురవుతారు. తల్లికి అనారోగ్యం. ధన సంపాదన మరియు వ్యాపార విషయాలలో ఒడిదుడుకులు అనుభవిస్తారు. జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తులకు సంబడించిన సమస్యలు ఎదుర్కొనవచ్చును. చంద్ర గ్రహ దోష నివారణకు 7 సోమవారాలు పొంగళి శివాలయంలో నైవేద్యం సమర్పించాలి. 

పింగళ దశా ఫలం:- శ్లో:- పింగళాతనుతే వ్యాధిం నిధన క్లేశ దాయినీ |
                             చోరానలహృతం విత్తం చాతుష్పాజ్జీవనాశనీ ||
  పింగళ దశా కాలం రెండు సంవత్సరాలు. పింగళ దశకు అధిపతి రవి. పింగళ మహా దశయందు హృదయ సంబంధ రోగాలు, మరణ తుల్య కష్టాలు, మానసిక ప్రశాంతత లేకపోవటం. రక్త సంబంధ రోగాలు, తరచుగా జ్వరాలు, జలుబు, నీచ స్త్రీల సాంగత్యం, చోరభయం, పశునాశనం, సంతానమునకు కష్టాలు, ధన వ్యయం. పింగళ దశకు అధిపతియైన రవి నీచలో ఉన్న, శత్రు క్షేత్రాలలో ఉన్న, లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న తరచుగా అనారోగ్యాలు రావటం, తలనొప్పి, కంటిదోషాలు, జుట్టు ఊడిపోయి బట్టతల రావటం, కోపాలను, పగలను మనసులో దాచుకోవటం. సమస్యలు పరిష్కారం కాకపోవటం వాటి సమస్యలు ఉంటాయి. దోష నివారణకు ఆదిత్య హృదయ పారాయణం చేయటం, రాగి పాత్రలో నీరు తాగటం, రాగులు, సజ్జలతో చేసినవి స్వీకరించటం. శివాలయంలో అభిషేకం చేపించటం చెయ్యాలి.  

ధాన్య దశా ఫలం:- శ్లో:- ధాన్యాధశ సుహృద్బంధు స్త్రీలాభంవా |
                            వేధజ్యోతిష్య విద్యాప్తి పుణ్య కార్యాది కారిణీ ||
ధాన్య దశాకాలం మూడు సంవత్సరములు. ధాన్య దశాకాలానికి అధిపతి గురువు. ధాన్య దశా కాలమందు ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. సుఖాలను పొందుతారు. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ధనం కూడా బెడతారు. శత్రువులపైనా విజయం సాధిస్తారు. వేధాలు, జ్యోతిష్య విద్యాలపైన పట్టు సాధిస్తారు. పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేస్తారు. గురువుల, పండితుల దర్శన, సేవా భాగ్యం కలుగుతుంది. ధాన్య దశకు అధిపతి ఐన గురువు నీచలో ఉన్న, శత్రు క్షేత్రంలో ఉన్న, లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న నమ్మినవారు మోసం చేసే అవకాశాలు ఉంటాయి. మనిషి బరువు పెరగటం, ధైరాయిడ్ సమస్యలు, షుగర్ వంటి సమస్యలు ఎదుర్కొనవచ్చును. దనాభివృద్ధి ఉండదు. సంతాన దోషం ఏర్పడుతుంది. దోష నివారణకు దత్తాత్రేయ పారాయణం చేయటం, ఆవులకు ఆహారం పెట్టటం, పెద్దలకు, గురువులకు పండితులకు సేవచేసుకోవటం ద్వారా దోష నివారణ జరుగుతుంది.  శెనగ గుగ్గిళ్ళు ప్రసాదంగా పంచటం చెయ్యాలి.

భ్రామరీ దశా ఫలం :- శ్లో :- భ్రామరీ జన్మ భూమిఘ్నో సర్వ సౌఖ్య వినాశినీ |
                                రాజనిగ్రహ దేహతి మనర్ధక్లేశకారిణీ ||
భ్రామరీ దశా కాలం నాలుగు సంవత్సరాలు. భ్రామరీ దశకు అధిపతి కుజుడు. గుట్టలు, వనాల యందు సంచారం చేస్తూ ఉంటారు. సౌఖ్యాలు పొందలేరు. అధికారుల వత్తిడి, అవమానాలు పొందుతారు. ఎంత పెద్ద ఉన్నత స్ధితిలో ఉన్నను పదవి, ఉద్యోగం పోయి పతనం పొందుతాడు. చోర భయం కలిగి ఉంటాడు. మనో వైకల్యం పొందుతాడు.  వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు కలుగును.  భ్రామరీ దశకు అధిపతి ఐన కుజుడు నీచలో ఉన్న, శత్రు క్షేత్రంలో ఉన్న, లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న తరచుగా గొడవలు, ప్రమాదాలు కలగటం, ప్రతి పనిలోనూ ఆటంకాలు కలగటం. రక్త సంబంద  అనారోగ్యాలు కలుగును. భార్యా భర్తల మధ్య ఎడబాటు కలగటం. కోపం కలగటం జరుగును. దోష నివారణకు సుబ్రమణ్యేశ్వర ఆరాధన చేయటం, మంగళవారం ఉపవాసం ఉండటం. మత్తు, మగువ, మందు, మాంసం మొదలగు వాటికి దూరంగా ఉండటం చెయ్యాలి. కందులు నానబెట్టి ఆవుకి పెట్టటం చెయ్యాలి.

భద్రికా దశా ఫలం:- శ్లో:- భద్రికా సుఖ సంపత్తి ర్విద్యాలాభప్రదాయినీ |
                             స్త్రీ పుత్ర భ్రాతృసౌఖ్యాధి బహు సంతోషదాయినీ ||
భద్రికా దశా కాలం ఐదు సంవత్సరాలు. భద్రికా దశకు అధిపతి బుధుడు. భద్రికా మహా దశా కాలం నందు జనసహకారం కలిగి ఉంటాడు. బ్రాహ్మణుల, పండితుల పరిచయాలు ఏర్పడి వారి ఆధరాభిమానాలు పొందుతారు. ప్రభుత్వం ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగును. సుఖ సౌఖ్యాలు పొందుతారు.వ్యాపారాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, స్త్రీ సౌఖ్యత కలుగుతాయి. భద్రికా దశకు అధిపతి ఐన బుధుడు నీచలో ఉన్న, శత్రు క్షేత్రంలో ఉన్న, లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న ఆలోచనా విధానం సరిగా లేక ప్రతి చిన్న విషయాలను కూడా అంచనా వేయలేకపోవటం, విద్యా, వ్యాపార విషయాలలో ఇబ్బందులు. చర్మ వ్యాదులు, ఆహారం సరిగా జీర్ణం కాకపోవటం వంటి సమస్యలు కలుగును. దోష నివారణకు విష్ణు సహస్త్ర పారాయణం చేయటం. రోజు చెట్లకు నీరు పోయటం, పచ్చ పేసర్లు మొలకలు వచ్చినవి తినటం, ఆకుకూరలు ఎక్కువగా తినటం చెయ్యాలి.

ఉల్కా దశా ఫలం :- శ్లో:- ఉల్కా రాజ్య ధనారోగ్యహారిణీ దుఃఖాకారిణీ |
                              స్ధానాభ్రం శరుణ వ్యాధి తస్కరోపద్రవప్రదా ||
ఉల్కా దశా కాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది. ఉల్కా దశకు అధిపతి శని. ఉల్కా మహాదశ కాలంలో అనారోగ్య సమస్యలు, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమస్యలు, వృధాగా ధనం ఖర్చు కావటం, వాహన ప్రమాదాలు, ప్రభుత్వ అధికారుల నుండి కష్టాలు, సేవకుల నుండి ఇబ్బందులు, సంతాన విషయంలో ఆందోళన, ముఖ సౌందర్య లోపం, చెవి, కన్ను, దంతాలు, ఉదర, నరాల జబ్బులు భాదించును.  ఉల్కా దశకు అధిపతి ఐన శని నీచలో ఉన్న, శత్రు క్షేత్రంలో ఉన్న, లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న దీర్ఘ కాల అనారోగ్యాలు కలుగును. పనులు ఆలస్యం అగును. సేవకులు ఇబ్బందులు పెట్టును. అవసరమైన వాటికంటే అనవసరమైన వాటికి ధనాన్ని ఖర్చు పెడతారు. బద్ధకం, ఒళ్ళు నొప్పులతో బాధపడతారు. దోష నివారణకు ప్రతిరోజూ ఉదయం శరీరానికి శ్రమ కలిగే విధంగా శ్రమ చేయటం. హనుమాన్ ఆలయంలో ప్రదక్షణలు చేయటం, శనివారం ఉపవాసం ఉండటం చెయ్యాలి.

సిద్ధా దశా ఫలం:- శ్లో:- సిద్ధాసాధాయతే కార్యం నృప పూజ్యప్రకాశికా|
                           వాహనాంబరపశ్యాది స్త్రీసౌఖ్య సుతదాయినీ||
సిద్ధా దశా కాలం ఏడు సంవత్సరాలు ఉంటుంది. సిద్ధా దశకు అధిపతి శుక్రుడు. సిద్ధా మహాదశ కాలంలో  కార్య సిద్ధి కలుగుతుంది. భోగాలు అనుభవిస్తారు.కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. ధనాభివృద్ధి, విద్యాభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగం, సంతాన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. వాహనప్రాప్తి కలుగుతుంది. స్త్రీ సౌఖ్యత కలుగుతుంది. వస్త్రాభరణాలు పొందుతారు. శుభకార్యాలు జరుగును. సిద్ధ దశకు అధిపతి ఐన శుక్రుడు  నీచలో ఉన్న, శత్రు క్షేత్రంలో ఉన్న, లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న వివాహం తొందరగా కాకపోవటం, వైవాహిక జీవితంలో సమస్యలు, వాహనాలు ఇబ్బందులు, సంతాన సమస్యలు కలుగును. దోష నివారణకు లలితా సహస్త్ర పారాయణ చేయటం, కుంకుమార్చన చేపించటం, తోబుట్టువును సంతోష పెట్టటం వంటి వాటిని చేయటం వలన దోషాన్ని నివారించుకోవచ్చును. 

సంకటా దశా ఫలం :- శ్లో:-సంకటా సంకటంధత్తే ధన ధాన్య పశు క్షయం |
                              సుసంకటామంత రేణకస్యాపిని ధనం భవేత్  ||
సంకట దశా కాలం ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది. సంకట దశకు అధిపతి రాహు, కేతువులు. సంకట మహాదశా కాలంలో ధన నాశనం, పంట నాశనం, స్దిరాస్తులు కోల్పోవటం, దగ్గర వ్యక్తులను కోల్పోవటం, అగ్ని, చోర భయం, సంతాన, జీవిత భాగస్వామితో వైరాలు, శత్రు భయాలు, మితృ విరోధాలు కలుగును. సంకట మహాదశలో సంకట అంతర్ధశ నడుస్తున్నప్పుడు మృత్యు భయాలు కలుగుతాయి.  సంకట దశకు అధిపతి ఐన రాహువు నీచలో ఉన్న, శత్రు క్షేత్రంలో ఉన్న, లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న మోసపోవటం, ఆకర్షణకు లోనుకావటం, నరదృష్టి ఎక్కువగా ఉండటం, అనవసరమైన అపోహలతో గొడవలు పెట్టుకోవటం. లేనిది ఉన్నట్టు ఊహించుకోవటం వాటి సమస్యలు ఎదుర్కొంటారు. చెడు వ్యసనాలకు లోనుకావటం. దోష నివారణకు దుర్గా సప్తస్లోకి పారాయణ చేయటం, అమ్మవారికి చీర సమర్పించటం, మినుములతో చేసిన ఆహార పదార్ధాలు తినటం, పంచటం. రాహు కాలంలో దీపాలు పెట్టటం చెయ్యాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...