రాహు కేతువులకు మధ్యకల 180 డిగ్రీలలో తక్కిన గ్రహాలన్నీ ఉండటాన్ని కాలసర్పయోగం అనటం జరుగుతుంది. వాస్తవానికి ఈ కాలసర్పయోగం ఎక్కడ వర్తిస్తుంది. లోకంలో ఏ రకమైన ప్రచారముంది అనే అంశాలను పరిశీలించాలి. ముందు రాహువు, చివర కేతువు, తక్కిన గ్రహాలన్నీ మధ్యలో ఉండిపోవటాన్ని కాలసర్పయోగం అంటారు.
“ధ్వజే పరోవర్తిని పృష్టసంస్ధే విధుంతుదే మధ్యగతా గ్రహేంద్రా తారాభిధా కాలసర్వ సశ్యావానీపాల వినాశహేతుః”
దీనిని బట్టి కాలసర్పయోగం మహారాజుకు, పంటలకు క్షేమం కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. దీనిని బట్టి కాలసర్పయోగం ఖచ్చితంగా దేశానికి సంబందించిన విషయంగా తెలుస్తుంది.
రాహువు ముఖ స్వరూపుడు, కేతువు పృచ్ఛ స్వరూపుడని భావన చేయటం వలన రాహు ముఖానికి ఎదురుగా ఉంటే సవ్య కాల సర్పయోగం అని, కేతువు నుండి రాహువు మధ్య ఉంటే అపసవ్య కాలసర్పయోగం అని భావన చేయటం కనిపిస్తుంది. ఈ విషయాలను క్రోడీకరిస్తే ఈ కాలసర్పయోగమనేది దేశానికి సంబందించినదే తప్ప వ్యక్తులకు సంబందించినది కాదు. గ్రహాలన్నీ ఒక భాగములో ఉండటం వలన రెండవభాగం గ్రహాలు లేకుండా ఉండటం వలన గ్రహారహిత భావం కంటే గ్రహ సహిత భావం బలిష్టమైనది కావటం వలన కొన్ని వర్గాలవారు మాత్రమే బలపడి, మరికొన్ని వర్గములవారు బలహీనపడినందువల్ల దేశం మొత్తం మీద అస్తవ్యస్త పరిస్ధితులు ఎదురవటం అనే దానిని అర్ధం చేసుకోవచ్చును.
వ్యక్తిగత జాతకాల యోగాలను పరిశీలించే ప్రాచీన ప్రాణిక గ్రంధాలు వేటిలోనూ కూడ ఈ కాలసర్పయోగం పేర్కొనబడలేదు. కాబట్టి ఇది వ్యక్తిగత జాతకాలకు సంబందించినది కాదని అర్ధం చేసుకోవచ్చును. గ్రహాలన్నీ ఒకవైపు ఉండటం వలన కొన్ని భావాలు బలపడటం, కొన్ని భావాలు బలహీనపడటం, వ్యక్తి బలహీనపడిన భావాలకు సంబందించిన రంగాలలో కృషి చేసి ఎదురుదెబ్బలు తిని ఆ రంగాన్ని వదలి దేనిలో రాణిస్తాడో ఆ ఒక్క రంగంలోనే ముందుకు వెళ్ళిపోతుంటాడు. కాబట్టి వ్యక్తికి ఇబ్బందిలేదు. అదే దేశానికి సంబందించినప్పుడు మాత్రం ఆయా వృత్తులలో కల వర్గాల వారందరూ ఆ వృత్తులను వదలి కొత్త వృత్తులలోకి మారటం అనేటువంటిది సామాన్యంగా సంభవం కాదు కాబట్టి ఆ ప్రభావం దేశ విషయాలలో కనిపిస్తుంది.
వాస్తవానికి రాహువు కానీ కేతువు కానీ ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి నాధుని ఫలితాన్ని, ఏ గ్రహంతో కలసి ఉన్నారో ఆ గ్రహ ఫలితాన్ని ఇస్తారు అనే వచనాలు మనకు శాస్త్రంలో చాలాచోట్ల కనిపిస్తాయి. అంటే స్వతంత్రంగా అవి ఫలితాన్ని ఇవ్వటం తక్కువ. రెండు గ్రహాలు కలసి ఉన్నప్పుడు కూడా 12 డిగ్రీలలోపు ఉన్నప్పుడు ఒక గ్రహం ప్రభావం ఇంకొక గ్రహంపై పడుతుంది తప్ప అంతకంటే దూరంగా ఉన్నప్పుడు పడదు. రాహువు నుండి కేతువు వరకు గల 180 డిగ్రీలలో ఎక్కడున్నా ఆ రాహుకేతువుల ప్రభావం తక్కిన వాటిపై పడుతుంది అనటం హేతుబద్దంగా లేదు.
రాహుకేతువులు చాయా గ్రహాలు కావటం వలన, తక్కిన గ్రహాలు కాంతిగ్రహాలు కావటం వలన కాంతి ప్రభావం నీడపై పడటం సంభవమే. నీడ ప్రభావం కాంతిపై పడటం సంభవం కాదు కాబట్టి రాహుకేతువుల వలన తక్కిన గ్రహాలన్నీ పాడైపోతారు అనే భావన అశాస్త్రీయంగా, హేతుబద్దం కానిదిగా స్పష్టమవుతుంది.
కాంతిగ్రహాలలో గొప్పవాడైన సూర్యునకు కూడ 12 డిగ్రీలకు అవతల గల గ్రహం అస్తంగత్వం అవటం లేదు. సూర్యుడే 12 డిగ్రీల వరకు ప్రభావం చూపిస్తుంటే ఈ చాయా గ్రహాలు 180 డిగ్రీల వరకు ప్రభావం చూపిస్తారనటం ఎంత అసంబద్ధంగా ఉందో మనకు స్పష్టమవుతుంది. దీనిని బట్టి దేశ గోచారంలో కూడా రాహుకేతువుల వలన ఇలా జరగటం లేదు. మొత్తం గ్రహాలన్నీ ఒకే వైపుకి వెళ్ళిపోవటం వలన మాత్రమే ఈ ప్రభావం కలుగుతుంది అనే విషయాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి