13, ఏప్రిల్ 2017, గురువారం

వాస్తురీత్యా వంటశాల నిర్మాణం



వాస్తురీత్యా వంటశాల నిర్మాణం 

ఆహారం పుష్టికరంగా శుచిగా ఉండాలి. ఆహారాన్ని దోషరహితంగా తయారు చేయటంలో వంటశాలలకు అధికమైన ప్రాధాన్యత ఉంది. వంటశాల తగినంత వెలుతురు, గాలి ప్రసరించునట్లుగా నిర్మించవలెను. వండిన ఆహార పదార్ధాలకు దృష్టి దోషం తగలకుండా వంటశాల ఇంటికి వెనుకవైపు (పృష్ట భాగం)  పెరడులో నిర్మించాలి. ఇంటిలోని వారు, స్త్రీలు వంట పనులు నిర్వర్తించటానికి వంటశాల గృహం లోపలి భాగంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. 

ఏ దిక్కున సింహాద్వారం ఉన్న గృహానికైనా ఆగ్నేయంలో వంటశాల ఉండాలనే మాట శాస్త్ర విరుద్ధం. వాస్తు పురుషుని ఊపిరితిత్తులకు చెందిన భాగమైన సింహాద్వారము ముందు గల ఖాళీ స్ధలములో ఆగ్నేయ కోణంలో వంటశాలలు నిర్మించుట శాస్త్ర విరుద్ధాలు. 

శ్లో:- యమదిశి భోజన శాల సోమే ధన సంచాయా వాసమ్
ఆగ్నౌ ధాన్యాగారం ఖే వక్తీర్వ్యం జనాని తత్రైవ
ఆరాధన గృహ మిశేకూపం తత్రోదితం స్నానమ్
యాస్మిన్ యదుక్త ముచితం అన్యా విహి తత్ర సంప్ర యోజ్యాని   

దక్షిణంలో భోజన శాల, ఆగ్నేయంలో ధాన్యశాల, తూర్పు ఆగ్నేయాల మధ్యలో అంతరిక్ష పదంలో వంటశాల, ఈశాన్యంలో పూజాగృహం, స్నాన గృహం, నుయ్యి నిర్మించాలి.


శ్లో:- ఉత్తరేశాన పర్జన్యే సర్వేషాం పచనాలయం
యాంయేచ నైఋతే వాపి సర్వేషాం భోజనాలయం  

దీనిని బట్టి కూడా ఈశాన్య పర్జన్య స్ధానాలలో వంటశాల ఉండవచ్చని తెలియుచున్నది.

గృహ ముఖద్వారాన్ని బట్టి యే యే స్ధానాలలో వంటశాలలు నిర్మించాలో మయుడు, విశ్వకర్మ విశేష విధితో శాసించారు. విశ్వకర్మ ప్రకారం తూర్పు, దక్షిణ, ఉత్తర దిశల్లో ముఖద్వారాలు కలిగిన ఇండ్లకు వంటశాలలు క్రింది విధంగా నిర్మించుకోవాలి.

తూర్పు సింహా ద్వారం గల ఇంటికి వంటశాల నిర్మాణం

తూర్పు సింహాద్వారం కలిగిన గృహానికి పడమర దిశలో మానుషభాగం ఉంటుంది. అందువల్ల ఇంటికి పడమర వసారాలోని నైఋతి వాయువ్య కోణాలలోని గదులకు వంట గదులుగా ఉపయోగించుకోవచ్చును. లేదా పశ్చిమంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నైఋతి, వాయువ్యకోణాలలో వంటశాలలు నిర్మించుకోవచ్చును.

దక్షిణ సింహా ద్వారం గల ఇంటికి వంటశాల నిర్మాణం

దక్షిణ సింహాద్వారం కలిగిన గృహానికి ఉత్తర దిశలో మానుష భాగం ఉంటుంది. అందువల్ల ఉత్తరదిశలో వరండా భాగంలో వాయువ్యంలోని గదిలో వంట చేయవచ్చు. లేదా ఖాళీ స్ధాలంలో వాయువ్య కోణంలో వంటశాల విడిగా కట్టుకోవచ్చు.

పడమర  సింహా ద్వారం గల ఇంటికి వంటశాల నిర్మాణం

పడమర సింహాద్వారం కలిగిన ఇంటికి తూర్పుదిశలో మానుష భాగం ఉంటుంది. అందువల్ల తూర్పున వసారాలోని ఇంటికి ఆగ్నేయ మూలలోని గదిలో వంట చేయాలి. లేదా ఖాళీ స్ధలంలో ఆగ్నేయ మూలలో వంటసాల విడిగా నిర్మించుకోవచ్చును.

ఉత్తర సింహా ద్వారం గల ఇంటికి వంటశాల నిర్మాణం

ఉత్తర సింహాద్వారం గల గృహానికి దక్షిణ దిశలో మానుష భాగం ఉంటుంది. అందువల్ల దక్షణ వసారాలోని ఇంటికి ఆగ్నేయ మూల గదిలోగాని, నైఋతి మూల గదిలో గాని వంట చేయాలి. లేదా ఖాళీ స్ధలం ఉంటే  ఆగ్నేయంలో గాని, నైతి దిశలో గాని వంట శాలలు నిర్మించవచ్చును.

శ్లో:- అంతరిక్షే బవేచ్చుల్లీ సత్యా కేశ్యాదులూ ఖలమ్
శాన్యం పచన స్ధానం సర్వేషాం దేహినాం శుభం

మయమతం ప్రకారం ఆగ్నేయ భాగంలోని అంతరిక్ష పాదంలో వంటశాల ఆ వంటశాలకు ఉత్తరంలో రుబ్బురోలు అమరిక చేయాలి. లేదా సమస్తమైన వారికి ఈశాన్యంలో వంటశాల శుభప్రదమైనది అనే విశేష విధిని తెలియజేశాడు.  

ఈశాన్యమున వంటశాల నిర్మాణం మయబ్రహ్మ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఈశాన్య దిక్కుకు అధిపతి రుద్రుడు. ఆరుద్రా నక్షత్ర మండలానికి అధిపతి రుద్రుడు. ఆరుద్రా నక్షత్రం మహా అగ్నిగోళం. రుద్రుని మూడవ నేత్రంగా భావించి ఆరాధింపబడు ఆరుద్రా నక్షత్రమునకు ధిదైవత అగు రుద్రుడే ఈశాన్య దిక్కుకు అధిపతి. సమస్త ప్రజలకు అగ్ని ఆరాధ్య దైవం. 

అగ్ని ప్రతిష్ఠ, నిత్యారాధన చేయువారికి ఈశాన్యం శుభప్రదం. ఈశాన్యము నందు వంటశాల ఏర్పరుచుట ఆగ్నేయం కంటే శ్రేష్ఠమని మయుని అభిప్రాయం. గృహములో ఈశాన్యమున నుయ్యి, పూజామందిరం ఉండును. పూర్వం నుండి చేసిన వంటకాలు గృహగత పరమేశునకు నివేదన చేయు ఆచారం కలదు. అందువలన ఈశాన్య దిశ యందు వంటశాల ఈశ్వరుని నివేదనకు అనుకూలంగా ఉండును.      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...