ప్రయాణం
నిమిత్తంగా వెళ్లేవారికి వారశూల అనేది ఒక నియమం ఏర్పరిచారు. రోజూ ప్రయాణం
చేయువారు కూడా ఈ నియమం పాటిస్తే సుఖపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విషయంగా
తిరిగే వారికి పట్టింపులేదు. ఒకవేళ ఉద్యోగరీత్యా తిరిగే వారికి వారశూల
నియమం పాటిస్తే విశేష కార్యలాభం వుంటుంది.
సోమ శనివారములు తూర్పు ప్రయాణం నిషిద్ధం.
గురువారం దక్షిణం ప్రయాణం నిషిద్ధం.
ఆది, శుక్ర వారములు పడమర దిశా ప్రయాణం నిషేధం.
బుధ, మంగళ వారములు ఉత్తర దిశా ప్రయాణం నిషేధం. దీనికే వారశూల అని పేరు.
ఆయావారములలో ఆ దిక్కులకు ప్రయాణం నిషేధం కావున వారశూల అంటారు. అయితే ఒకవేళ అత్యవసరంగా వారశూల వున్న దిశకు ప్రయాణం చేయాలి ఎలా? రాత్రి కాలము వార దోషములు ఉండవు అని శాస్త్రం. దానికి బలమైన కారణం ఉంది. ఆగ్నేయ దిక్కుకు సోమ గురువారములు, నైరుతి దిశకు ఆది శుక్ర వారములు, ఈశాన్య దిక్కుకు బుధవారం, వాయవ్య దిశకు మంగళవారం వారశూల ప్రయాణం కూడదు.
రాత్రి కాలమే కాక ఇంకా విశేష పాఠం ద్వావింశతిర్గురౌచైవ ద్వాదశేందుజ భౌమయోః-పంచాదశభృగౌభానౌ మందేద్యోశ్చాష్ట నాడికాః గురువారం 22 ఘడియలు సూర్యోదయంనుండి 3 గంట.48 ని.లు వరకు వారశూల, బుధ, మంగళవారములు సూర్యోదయంనుండి 12 ఘడియలు 4 గంట.49ని.లు. ఆది, శుక్ర వారములు సూర్యోదయంనుండి 15 ఘడియలు అనగా ఆరుగంటలు. శనివారం సూర్యోదయం మొదలు ఎనిమిది ఘడియలు 3 గం.12 నిమిషముల వ్యవధి మాత్రమే వారశూల దోషము ఉంటుంది. మిగిలిన సమయంలో ప్రయాణం వారశూల వున్న దిశకు కూడా చేయవచ్చు. అందువలన రాత్రి కాలమునకు వార శూల లేదు అని చెప్పిన కారణము.
మన ఇంట ప్రారంభం అయిన తరువాత తొమ్మిదవ రోజు తిరుగు ప్రయాణం చేయరాదు. అలాగే తొమ్మిదవ రోజు ఇంటిలోకి ప్రవేశింపరాదు. అలాగే నవమి తిథి రోజున ప్రయాణం చేయరాదు అని శాస్త్ర వచనం. విశేష కార్యక్రమములు మరియు వధువు ప్రయాణం, చిన్నపిల్లల ప్రయాణం, గర్భిణీ ప్రయాణం విషయాలమీద మంచి ముహుర్తం చూసుకుని ప్రయాణం చేయవలెను.
ప్రయాణమునకు యోగ్యమైన నక్షత్రములు ‘మృగాశ్వినో పుష్యపునర్వసొచ హస్తానురాధా శ్రవణాచ మూలా, ధనిష్ట రేవత్యభిలే ప్రయాణే ఫలం లభేచ్ఛేఘ్రునివర్తనంచ’ మృగశిర, అశ్వినీ, పుష్యమీ, పునర్వసు, హస్త, అనూరాధ, శ్రవణం, మూల, ధనిష్ట, రేవతీ విశేష నక్షత్రములు వీటిలో ప్రయాణం చేసినవారు త్వరగా కార్యం పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి వస్తారు. ఇవి కాకుండా రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శతభిషం ఇవి సాధారణ నక్షత్రములు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి