12, డిసెంబర్ 2017, మంగళవారం

వివాహ ముహూర్తాల విషయంలో తెలుసుకోవాల్సిన అంశాలు

వివాహ ముహూర్తాల విషయంలో తెలుసుకోవాల్సిన అంశాలు

వివాహ విషయమై ఆడపిల్లకు మూడు నవకములలోని జన్మతార గ్రాహ్యమే. అలాగే మగ పిల్లవాని విషయమై ప్రథమ నవకంలోని జన్మతార నిషేధం. కానీ, రెండు మూడు నవకములలోని జన్మతారలు గ్రాహ్యమే. ఇదే రీతిగా పెండ్లి చూపులు, నిశ్చితార్థము విషయములలో కూడా ప్రవర్తించాలి.

నిశ్చితార్థం: వధూవరులకు వివాహం చేయుటకు అన్ని విధములుగా సమ్మతమయిన యెడల వెంటనే వధూవరుల తల్లిదండ్రులు తాంబూలములు మార్పు చేసుకోవడం ఆచారం. అదే రీతిగా వధువుకు వరుని తల్లిదండ్రులు పసుపు, కుంకుమ, గంధం, పళ్లు, పూలు వంటి శుభ ద్రవ్యములు ఇచ్చి ‘తథాస్తు’ అనుకోవడం సంప్రదాయం. అందుకే పిల్లను చూచుటకు, మాటలాడుకొనుటకు కూడా మంచి కాలం చూచు సంప్రదాయం. ఇక నిశ్చితార్థం రాత్రులందు నిషేధము వున్నది. కారణం నిశ్చితార్థం రోజు వధువుతో సహా వధువు యొక్క తల్లిదండ్రులు విఘ్నేశ్వరుని పూజ చేసి కార్యక్రమం నిర్వహించాలి. మరి అటువంటి సందర్భంలో పగలు భోజనం చేసి రాత్రి కాలంలో గణపతి పూజ చేయరాదు. నిశ్చితార్థం రోజు ఉపవసించు ఆచారమూ లేదు. అందువలన ప్రాతఃకాలమే శ్రేయస్కరం. నిశ్చితార్థం అంటే అర్థం ఆ వధూవరులకు ఇరువురికీ వివాహం చేయుటకు ఉభయుల తల్లిదండ్రులూ అంగీకారము తెలుపుట. ఈ ముహూర్తంతో బంధం ప్రారంభమవుతుంది. అందువలన నిశ్చితార్థమునకు శాస్ర్తియంగా బలమయిన ముహూర్తం అవసరం. ఒకవేళ మీరు రాత్రి కాలంలోనే వేడుకగా చేసుకోవాలి అంటే పగలు శాస్త్రోక్తంగా కార్యక్రమం పూర్తి చేసుకొని రాత్రి కాలంలో వేడుక చేసుకోండి. ముహూర్త బలం వివాహ ముహూర్తంతో సమానంగా వుండాలి.


 1. పెండ్లిచూపులు ఒకవేళ తప్పనిసరిగా మూఢమి వంటి రోజులలో జరపవలసి వస్తే... ప్రథమతః వధూవరులను ఇరువురినీ దేవాలయంలో కలుసుకునేలాగ చేసి అనంతరం ఇంటిలో చూపించండి. పెండ్లిచూపుల విషయంలో దేవాలయం సర్వదోషహరణ చేస్తుంది అని పెద్దల వాదన. ఒకే గోత్రీకులకు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యులలో వివాహం చేయు ఆచారము లేదు. శాస్తమ్రు అంగీకరించదు. గోత్రమునకు సంబంధించి ఋషులు కొందరు వుంటారు కచ్చితంగా. ఋషులు కూడా కలవకూడదు అని శాస్త్ర వచనం. ఋషి గణం ఒకటే అయితే వారు అందరూ సోదరవర్గంలో వారు అని అర్థం.

2.ఆడపిల్లను దత్తత ఇచ్చి (వేరే గోత్రం వారికి) అప్పుడు వివాహం చేయుట అని కొందరు తప్పుడు శాస్తమ్రులు చెబుతున్నారు. ఆడపిల్లకు ఒకసారే గోత్రం మార్పు జరుగుతుంది. అది ప్రథమతః వివాహంలో మాత్రమే. ఇక్కడ మరొక ధర్మసూక్ష్మ ప్రస్తావన చేద్దాం. ఒకవేళ మగపిల్లవాడిని శాస్త్ర ప్రకారం వేరే గోత్రం వారికి దత్తత ఇచ్చాము అనుకోండి. అప్పుడు ఆ పిల్లవాడికి జనక స్థానం, దత్తత స్థానం గోత్రీకులతో ఇరువురితోనూ కూడా వివాహం చేయరాదు. అలాంటప్పుడు ఆడపిల్ల విషయంలో ఒకవేళ మనం ఆధునిక స్వభావాలతో దత్తత ఇచ్చినా జనక స్థాన గోత్రం వారూ ఎలాగూ పనికిరారు అని ధర్మశాస్త్ర వచనం. కాబట్టి ఆడపిల్లను దత్తత ఇద్దాం అనే ఆధునిక ఆలోచనలు తప్పు.

3.వరుడి వయసు కంటే వధువు చిన్న వయస్కురాలయి ఉండాలి. దీని విషయంగా నేడు సమాజంలో చాలా చర్చలు జరుగుతున్నాయి కానీ శాస్త్రం, ధర్మం పాటింపవలసిన అవసరం మనది. చర్చలు అనవసరం.

4.వివాహమునకు తారాబలం చూసే విషయంలో ప్రత్యేక తార విశేషం అనే నానుడి వున్నది.

5.స్వాతీ నక్షత్రంలో వివాహం చేస్తే ఆ వధువు మరల పుట్టింటికి వెళ్లాలి అని చూడదు. అత్తగారింట సుఖంగా ఉంటుంది అని కృష్ణ యజుర్వేద వాక్యము. ఇది జ్యోతిష గ్రంథాలలో లేదు. కేవలం వంశపారంపర్య విద్యగా అభ్యాసం చేసిన వారికి మాత్రమే ఈ రహస్యం తెలుస్తుంది.

6.ఉపనయ నార్హత వున్నవారి విషయంలో రాత్రి సూర్యాస్తమయాత్ ఒక గంటన్నరలోపు చేయు వివాహం విశేషం. కారణం ఏమిటి అంటే ‘స్థాతీపాకం’ అనే కార్యం వివాహం దీక్షలో ప్రధానమయినది. అది సూర్యాస్తమయాత్ పరం మూడు గంటల వ్యవధిలోనే చేయాలి. ఒకవేళ మూడు గంటల వ్యవధి తరువాత ముహూర్తం చేశాము అనుకోండి. వివాహంలో వైదీక సంప్రదాయం కచ్చితంగా జరగదు. వివాహం ముహూర్తం ఎంత ప్రాధాన్యమో, కార్యక్రమం వేద విహితంగా చేయడానికి కూడా అంతే ప్రాధాన్యం కదా! అందుకే రాత్రి వివాహం కంటే పగలు వివాహం చేయుట ద్వారా శాస్ర్తియత బాగా జరుగుతుంది అని పెద్దల వాదన. రెండు రోజుల వివాహం, మరియు అయిదు రోజుల వివాహం వారికి రాత్రి వివాహం విశేషమే. ఉపనయనార్హత లేనివారికి స్థాతీవాకం ఉండదు.

7.వరుని తండ్రి, పితామహ, కాలం చేసిన సందర్భంలో సంవత్సరం దాటేవరకు వివాహం చేయరాదు. వధువు విషయంలో వివాహం చేయుట సంప్రదాయం వున్నది.

8.వధువు, వరుడు ఇరువురి విషయంలో వారి తాత, మామ్మ, అమ్మమ్మ, మాతామహుడు, తల్లిదండ్రీ అబ్దీకముల రోజులలో వివాహం చేయరాదు.

 9.ఒకవేళ అమ్మమ్మ, మాతామహుడు కాలంచేస్తే వారి మృతాశౌచ కార్యములు 12 రోజులు పూర్తయ్యేవరకు వివాహం చేయరాదు. ఈ అంశాలు అన్నీ శోధించుకొని ముహూర్తం నిర్ణయింపజేయాలి.

వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం.అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల రోజులలో వివాహము శ్రేయస్కరమే.

అష్టమ శుద్ధి, లగ్నంలో పాపగ్రహములు లగ్నాత్ సప్తమంలో పాపగ్రహములు లేకుండా వివాహ సుముహూర్తము చేయవలెను. ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రాలు వివాహమునకు గ్రాహ్యము కాదు అని కొందరి వాదన వున్నది. అది కూడా గ్రంథాధారమే కానీ వాటిల్లో కొందరు మహర్షులు శ్రేష్ఠము అని చెప్పిన కారణంగా అందరూ ఆచరిస్తున్నారు. చిత్తా నక్షత్రం గ్రాహ్యం కాదని వాదన.

లగ్నాత్ కేంద్రములు అనే 1,4,7,10 స్థానములలో శుభ గ్రహములు వుండడం దృష్ట్యా వివాహ లగ్నమునకు బలం ఎక్కువ అని చెప్పాలి. లగ్నాత్ 1,4,5,7,9,10 స్థానములలో శుభగ్రహ సంచారం విశేష లాభ ఫలితాలు ఇస్తుంది. అవకాశం వున్నంతవరకు 1,7 స్థానములలో పాపగ్రహములు లేకుండానే నిర్ణయం చేయాలి. శుక్ర గ్రహమునకు పాపగ్రహం సంబంధం లేకుండాను అలాగే చంద్రగ్రహం వున్న నక్షత్రంలో పాపగ్రహం లేకుండాను చేసుకోవాలి. కారణం కళత్ర కారకుడు శుక్రుడు. అలాగే మనఃకారకుడు చంద్రుడు. అలాగే వీలయినంతవరకు గురు బలం అధికంగా వున్న ముహూర్తం నిర్ణయించాలి.

వధూ ప్రవేశము: ‘వివాహ మారభ్య వధూ ప్రవేశో యుగ్మేదినో షోడశ వాసరాంతే’ వివాహం అయినది. ప్రభృతి 16 రోజులలోపు ఎప్పుడయిననూ సరి దినముల యందు నూతన వధువు గృహ ప్రవేశము చేయవచ్చును. అత్తవారి ఇంట ‘వధూ ప్రవేశో నదివా ప్రశస్తిః’ అని కూడా చెప్పారు. సూర్యోదయాత్ పూర్వం సూర్యాస్తమయాత్ పరం మాత్రమే విశేషము.

అప్పగింతలు అనే కార్యక్రమం వేడుక + ఆచారము. అంతేకానీ శాస్త్రం కాదు. ఇది శుక్రవారం పనికిరాదని పనికి వస్తుంది అని చెప్పే మాటలు కుటుంబ ఆచారమునకు ముడిపడినవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...