26, మే 2016, గురువారం

వాస్తు వేధ దోషాలు

వాస్తు వేధ దోషాలు

వేధలు అంటే కనిపించకుండా బాధించే వాస్తు దోషాలు. వేధల్లో కొన్ని సహజమైన ప్రకృతి సంబంధమైనవి. మరికొన్ని సామాజిక మైనవి.

కుడ్య వేధ: ఇల్లు కడుతూ ఉన్నప్పుడు తూర్పు ఉత్తరం ప్రహరీ గోడలు కాని ఇతరమైన గోడలు కాని పడమర, దక్షిణ దిశలకన్నా ఎత్తుగా ఉండకూడదు. అంటే పడమర దక్షిణ దిశల గోడలు ఎత్తుగా ఉండాలి.

తారతమ్య వేధ: ఇంట్లో ఎప్పుడూ దక్షిణ పడమరల వైపు పెద్దవారు నివసించాలి. తూర్పు ఉత్తరముల వైపు చిన్నవారు వుండాలి. అలా కాకుండా వ్యత్యస్తంగా అయినప్పుడు తారతమ్య వేధా దోషం కలుగుతుంది.



నత వేధ: ఇంటి ఆవరణలో తూర్పు ఉత్తర భాగములు ఎత్తుగాను, పశ్చిమ దక్షిణములు పల్లముగాను ఉండుట వలన నత వేధా దోషం కలుగుతుంది. దాని వలన చోర బాధలు, ఆకస్మిక ప్రమాదాలు సంభవిస్తాయి.

కాంతి హీన వేధ: ఇంటిలోకి మొదటి, నాలుగు జాములో సూర్యరశ్మి సోకాలి. లేకపోతే కాంతి హీన వేధ దోషం కారణంగా భూత బాధలు పీడిస్తాయి.

క్షౌద్ర వేధ: ఇంట్లో ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ దిశల్లో పుట్టలు (చీమల పుట్టలు-పాముపుట్టలు) అదేపనిగా తేనె పట్టులు పెడుతూ ఉండడం మంచిది కాదు. అలా జరిగిన సందర్భాలలో కొన్ని నిర్మాణాలు అకస్మాత్తుగా భూమిలో కృంగిపోయిన సందర్భాలున్నాయి. దానినే క్షౌద్ర వేధ అంటారు.

పశు వేధ: ఇంటి ఆవరణలో ముందు భాగంలో పశువులు, గొర్రెలు, మేకలు వంటివి ఉండకూడదు. ఇంటి పశ్చిమ, దక్షిణ భాగాలలో ఉండాలి. గోవులైతే ఉత్తర ఈశాన్య భాగాలు శ్రేష్టం. గోవుయొక్క గిట్టల ధూళి వలన ఎన్నో దోషాలు పరిహారమవుతాయి. గోవు గురించి వేద విజ్ఞానం కాని హిందూ మత విశ్వాసం కాని, కేవలం విశ్వాసం కాదు-అది కేవలం విజ్ఞాన ప్రధానమూ మానవ శ్రేయస్సుకూ సంబంధించిన సత్సంప్రదాయం.

కోణ దృగ్వేధ: ఇంటి స్థలంలో ఒక మూలగా ఇల్లు కట్టకూడదు. ఒకవేళ తప్పనిసరి ఐన పక్షంలో దానికి ప్రత్యేక ప్రహరీ నిర్మాణం చేయాలి. అలాగే ఇతరుల ఇంటి మూల ఇంటి గృహ ద్వారాన్ని ఛేదించకూడదు. ఇంటి యొక్క మూలల వెంబడి ద్వారాలు ఉంచడం కూడా కోణ వేధగానే బాధిస్తుంది. ఈ కోణ వేధనే కొన్ని ప్రాంతాలలో ‘కొంజెర’ దోషం అని గ్రామీణ పద్ధతిలో పిలుస్తారు.

శైలవేధ: ఇంటికెదురుగా సింహ ద్వారానికెదురుగా కొండలు, గుట్టలూ ఉండకూడదు. ముఖ్యంగా తూర్పు ఉత్తర దిశలలో కొండలు, గుట్టలూ అసలు ఉండకూడదు. ఇంటి గోడల చివర్లలో కోట గోడల ఆకారంలో ఆర్చిలు కాని , కమాన్లు కానీ ఉండకూడదు. ఇల్లు నిర్మించే స్థలం కోణాకృతిలో ఉండకూడదు.

సత్రవేధ: ఇంటికి ఎదురుగా గాని సమీపంలో కాని రెండువందల గజాలలోపు సన్యాసాశ్రమాలు, అనాధాశ్రమాలు, ఆలయాలు ఉండకూడదు.

శల్యవేధ: శల్యములు అంటే ఎముకలు. ఇల్లు కట్టే స్థలం ముందుగా ఒక మనిషి నిలువు తవ్వి ఎముకలు, బొగ్గులు, ఊక వంటి నిషిద్ధ పదార్థాలు లేకుండా చూసుకోవాలి. ఇల్లు కట్టే స్థలంలో గర్భంలో గండశిల వంటివి ఉండకూడదు. అవి ఇంటిని కదిలిస్తాయి. హాని కలిగిస్తాయి.

కుల్యములు, అంటే కాలువలు, తటాకము అంటే చెరువులు, ప్రవాహాలు, ఇవి ముఖ్యంగా నైరుతి, వాయవ్యాలుగా కాని, ఈశాన్యము నుండి ఆగ్నేయముల వైపు కాని, దక్షిణ పడమరలుగా గాని ప్రవహించకుండా చూసుకోవాలి.

ఇంట్లో నీరు కూడా ఈశాన్యం వైపు పారేలా ఏర్పరుచుకోవాలి. ఇతరుల ఇంటి నీరు మన ఇంటి ఆవరణలోకి రాకుండా చూసుకోవాలి.ఈ వాస్తు నియమాలు చదివినప్పుడు, చెబుతున్నప్పుడు కఠినంగానే వినిపిస్తాయి. కాని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ఇబ్బందులు రాకుండా కాపాడతాయి.

స్తంభహీన వేధ:-స్తంభహీన వేధని ‘శంఖపాల వేధ’ అని కూడా అంటారు. స్తంభములు (పిల్లర్లు) లేకుండా గృహ నిర్మాణము చేయకూడదు. స్తంభము అంటే స్థిరంగా నిలబడి యుండునది అని అర్థం. స్తంభములు వాస్తురీత్యా సరియైన సంఖ్యలో సరియైన పద్ధతిలో ఏర్పాటుచేస్తే ఆ ఇల్లు కూడా స్థిరంగా సుస్థిరంగా ఉంటుంది. స్తంభములు లేకుండా ఇల్లు నిర్మించరాదు. దానినే స్తంభహీన వేధ - శంఖపాల వేధ అంటారు. ఆ స్తంభాలు, సున్నాలేని సరిసంఖ్యలో ఉంటే చాలా క్షేమం. షోడశ సంఖ్యలో ఉంటే అంటే పదహారు సంఖ్యలో ఉంటే అత్యంత ఉత్తమం.

వికట వేధ: వికటము - అంటే వంకర. గృహము యొక్క సింహ ద్వారము విషయంలో చెప్పబడింది. ‘వికటే సంతాన వేధ స్యాత్’ వికట వేధ వలన సంతానమునకు హాని. సింహద్వార ప్రమాణం వంకరగా ఉన్నా - కొలతలు (ఆయము - మిగతా ద్వారముల సమన్వయ ప్రమాణముతో) హెచ్చుతగ్గులు మిట్ట పల్లాలు - సంకరమైన కలప - నిషేధితమైన కలప (తుమ్మ మొదలైనవి)తో చేయబడినా రెండు ద్వారముగా లేక ఒకే ద్వారము కలిగి ఉన్నా మరొకరి ఇంటిలోది కొని తెచ్చిపెట్టినా.. రూపహీనంగా ఉన్నా ఆ ఇల్లు వికట వేధ కలిగిన ఇల్లుగా చెప్పవచ్చు. అందుకే వికట వేధ లేకుండా సింహ ద్వార నిర్మాణం చేయించాలి.

వృక్ష ఛాయ వేధ ;-వృక్ష ఛాయ కూడా వేధగానే పరిణమిస్తుంది. దిన సమయంలో గాని రాత్రి సమయంలో గాని రెండు మూడు ఝాముల వేళల్లో కాండము గల చెట్టుయొక్క నీడలు ఇంట్లో కాని ఇంటి మీద కాని పడకూడదు.

తూర్పున మర్రి, ఆగ్నేయంలో వేప, జామ దక్షిణంలో తెల్ల జిల్లేడు, అల్ల నేరేడు, పనస - నైరుతిలో శమీ వృక్షం - పడమర రావి చెట్టు ఉసిరిక చెట్లు - వాయవ్యంలో మేడి ఉత్తరంలో వెలగ - పనస. ఈశాన్యంలో మారేడు చెట్లు ఉంటే రక్షగా ఉంటాయి.

అగ్నివేధ: ఇంటిలో ఆవరణలోగాని ఇంటి సమీపంలో గాని చెత్త లాంటివి తగులబెట్టవలసి వస్తే అది ఇంటికి ఆగ్నేయ భాగంలో వచ్చేట్టు చూడాలి. ఆగ్నేయ భాగంలోకాక మరే దిశలోనైనా నిప్పు వెలగటం వల్ల ఆ ఇంటికి అగ్ని వేధా దోషం కలుగుతుంది. దాని వలన భార్యాపుత్రులకు హాని కలిగే అవకాశం ఉంది.

దహన వేధ: ఏదైనా ప్రమాదవశాత్తు ఇంటికి సంబంధించిన తలుపులు కాని కిటికీలు కాని పాక్షికంగా కాని పూర్తిగా కాని అగ్నిప్రమాదానికి గురైతే వాటిని వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేసుకోవాలి. సగం కాలినవే కదా అని ఉపేక్షించరాదు.దాని వలన దహన వేధా దోషం తగులుతుంది. అలాగే ఇంట్లో పగిలిన అద్దాలు రెండు రూపాలుగా కనిపించే అద్దాలు, విరిగిన తలుపులు కలిగిన కిటికీలు ఉండరాదు. తలుపులు కాని, కిటికీలు కాని అదే పనిగా కిర్రుమనే శబ్దాలు కాని కీచుమనే శబ్దాలు కాని సృష్టించకూడదు. కోడు, కాళ్లు విరిగిన కుర్చీలు, బల్లలు వాడుకలో ఉంచకూడదు. వాటి వలన వేధా దోషమే కాకుండా, ప్రమాద బాధలు కూడా కలుగుతాయి. సహజంగా పేదవారు అక్కడా ఇక్కడా దొరికిన కలపతో గుడిసెలు, ఇళ్లు ఏర్పరచుకుంటారు. అందులో కాలిన వస్తువులు ఉండకూడదు. నట్టింట్లో బొగ్గులు ఉంచకూడదు. తాత్కాలికంగానైనా పోయకూడదు.

చతుష్కోణ వేధ: సహజంగా ఇల్లు కట్టే సమయంలో సమ చతురస్రంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్మిస్తారు. ఆ సంబంధంగా నాలుగు భిన్న కోణాలు ఏర్పడతాయి. దాని వలన చతుష్కోణములుగా మూలలను వేధిస్తాయి. అది మంచిది కాదు.

రక్త వర్ణ వేధ: ఇంటికి వేసే రంగుల విషయంలో, ఫ్లోరింగ్ విషయంలో రక్త వర్ణం గల రంగును వాడకూడదు.

వాయు వేధ: ఇంటికి దక్షిణ, పడమర దిశలలో తప్పకుండా కిటికీలు ఉండాలి. దక్షిణ దిశ నుండి మలయ పర్వతం గాలులు, పడమటి వైపు నుండి పడమటి కనుమలల గాలులు వైద్య శాస్తర్రీత్యా చాలా ఆరోగ్యకరమైనవి.మలయ పర్వతాలే నల్లమల కొండలు. అక్కడ నుండి వచ్చే గాలులకే మలయానిలం అని పేరు. అందుకే దక్షిణ, పడమరలకు, ఇంటికి కిటికీలు ఉండాలని మన వాస్తు శాస్త్రం నిర్దేశించింది.

స్మశాన వేధ: ఇంటికి దగ్గరలో స్మశానం ఉండటం మంచిది కాదు. శవ దహనం చేసిన పొగను ప్రేత ధూమమంటారు. అది పారటం ఇంటిపైన కాని వ్యక్తిపైన కాని మంచిది కాదు.
గృహానికి ఆగ్నేయ, నైరుతి దిశలందు తూర్పు పడమరలలోనూ గోతులూ విపరీతమైన పల్లపు ప్రదేశమూ ఉండకూడదు.

ఉచ్చిష్ట వేధ: గృహావరణలో తూర్పు, ఉత్తర దిశలలో పెంటకుప్పలూ - ఉమ్ములూ, పేడకుప్పలూ, చెత్తకుప్పలూ ఉండకూడదు. ఈశాన్య దిశగా ఎప్పుడూ ఉమ్మివేయటం కానీ, మల మూత్ర విసర్జనలు కాని పనికి రావు. ఈ నియమం ఇంటికి మాత్రమే కాదు. బయటకు కూడా వర్తిస్తుంది. అలాగే సూర్యుడికి ఎదురుగా మల మూత్రాదులు చేయకూడదు. సూర్యుడు ఉన్న దిశ నుండి వ్యతిరేక దిశలో ఆగ్నేయ నైరుతి భాగాలను ఉపయోగించాలి.

భిన్నదేహళీవేధ: ‘దేహళి’ అంటే ‘కడప’ ద్వారం దాటడానికి వేసే ‘నడిమి పడిని’ కడప అంటారు. కడప పట్టణానికి ఆ పేరు రావడానికి అది తిరుపతి వెంకటేశ్వరస్వామి యొక్క దేవుని కడప కావటమే. ఈ గడపను తొక్కుతూ ఇంట్లోకి కాని, దేవాలయంలోకి కాని వెళ్లకూడదు. దాటుతూ వెళ్లాలి. ఈ కడపను ద్వార ప్రమాణానికి అనుప్రమాణ రీతిలో నిర్మించాలి. అలా కాకుండా నిర్మిస్తే అది దేహళీ భిన్న వేధగా ఇంట్లో నివసించే వారికి అనేక రకములైన ఇబ్బందులకు గురి చేస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...