12, అక్టోబర్ 2021, మంగళవారం

విద్యా బోధన – గ్రహాల పరిశీలన


విద్యా బోధన – గ్రహాల పరిశీలన

విద్యాబోధన అనేటటువంటిది పూర్వజన్మ సుకృతంగా చెప్పవచ్చు. బోర్డు స్కూలు ఉపాధ్యాయులు, కాలేజి లెక్చరర్సు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల స్థాయిలలో బోధించే వారి సామర్థ్యం ఈ క్రింది గ్రహస్థితులు చూపిస్తుంటాయి.

విద్యా భోదనకు సంబందించి రాశి చక్రము, నవాంశ చక్రము, దశాంశ చక్రములు పరిశీలనా పరిధిలో తీసికొనవచ్చును.

3, 5, 6, 7, 11 రాశులు అనగా మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశులు జ్ఞానవంతమైన రాశులు కలవి. ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండే రాశులు.

వాయుతత్త్వరాశులు మేధాతనాన్ని చూపుతాయి.

వృశ్చిక రాశి రహస్య జ్ఞానాన్ని, కుంభలగ్నము  వేదాంత రాశి గాను, ఉపాధ్యాయులను, ఆర్థిక లావాదేవీలు సూచించే రాశిగాను గుర్తించవచ్చు.

గ్రహాలు, గ్రహ కలయికలు: రవి చంద్ర  బుధులు కలిసి జాతకుని ఉన్నతికి కారణమౌతాయి. అమావాస్య చంద్రుడు దోషి. కాని బుధుని కలయికవల్ల శుభుడు కాడు, అశుభుడు కాడు.

రవి + బుధుల కలయిక అత్యున్నత మేధాతనాన్ని చూపును.

కుజ + బుధ + గురు + శుక్రులు కలిసి క్రొత్తవి కనుగొనడాన్ని సూచిస్తాయి. బుధుడు మేధాతనాన్ని శాస్త్ర విజ్ఞానాన్ని ప్రభావితం చేస్తాడు. కుజుడు తర్కాన్ని ప్రేరేపిస్తారు.

ఉపాధ్యాయులు గురు గ్రహంచే సూచించబడతారు. గురు + శుక్రులు కలిసి జాతకుని పండితునిగా చేయును.

ఏ గ్రహం అయినా ఒకటి కంటే ఎక్కువ స్వవర్గలను పొందినట్లయితే అది గొప్ప శుభాన్ని, విశేషమైనటుంవంటి ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. ఒక గ్రహం పర్వతాంశను పొందిన జాతకుడు సంపద పరుడు అగును.

మిథునం 15వ డిగ్రీ, సింహంలో 7, 15, 18, 20 లు తులలో 2 మరియు 20లు కుంభంలో 2 మరియు 9 డిగ్రీలు (నిరయనంలో) చాలా శక్తివంతమైనవి.

ఈ పై డిగ్రీలు ఎవరి జాతకంలో అయినా లగ్నంగా ఏర్పడిననూ, రవి చంద్ర బుధులుగాని పై డిగ్రీలలో ఉన్ననూ జాతకుడు మేధావిగా ఒక తళుకు మెరుపు మెరుస్తాడు. ఊహించని విధంగా నూతన సృష్టిలు కల్గి ఉంటారు. ఈ సూచించిన 4 రాశులలోనూ 3 రాశులు వాయుతత్త్వరాశులు, కుంభ రాశిలో 2 కూడా పరిశోధనకు తోడ్పడును. పరిశోధనా మేధస్సును కల్గి ఉండును. ఈ డిగ్రీలో రవి ఉన్న నూతన ఆవిష్కరణకర్త లేక నూతనంగా కనుగొనడము చేస్తాడు.

విద్యాబోధన గురుని ఆధీనము. ప్రొఫెసర్ల జాతకాలలో కారకుని దృష్టితో చూసి, జాతకుడు దేనిలోనైనా మాస్టరీ చేసిన వారి జాతకాలలో గురుడు 2,5,9,10 భావాలలో ఉండుట గమనించవచ్చు. విద్యాబోధన 9,10 భావాల ఆధీనంలో ఉంటుంది. ద్వితీయ గురుడు మంచి వాగ్దాటి (ప్రసంగీకుడుగా) ఉండును. వారు నైపుణ్యం కల్గి వృత్తిలో జయం పొందును. పంచమంలో గురువు ఉంటే పండితులే కాని,  నైపుణ్యకొరత,  బోధనలో వెనుకంజ లక్షణాలు కల్గి ఉండును.

ప్రధానోపాధ్యాయులుగాని, విద్యా సంస్థల అధిపతులు జాతకాలలో గురుబలం కనపడదు. వారి జాతకాలలో రవి కుజుల బలం పొంది ఉంటుంది. కనీసం రవి బలం పొందితే ఆజ్ఞలు జారీచేసే సామర్థ్యం కల్గి ఉంటారు.

విద్యాసంస్థలు నడపడానికి పంచమాధిపతిగాని గురుని బలం గాని సరిపోవు. రవి లేక కుజుని బలం కావాలి. లేదా కనీసం శని అయినా 1, 3, 10 స్థానాల్లో ఉంటే సామర్థ్యం కల్గుతుంది. రవి కుజ గురులు 9 ఇంట బాగా యోగించుదురు. కాని 9 ఇంట శనివల్ల తన పేరు ప్రఖ్యాతులు కోల్పోవును.

బుధ + గురులు కలిసి కోణాలలో ఉంటే ఉపాధ్యాయులకు చాలామంచి గ్రహ కలయికగా చెప్పవచ్చు. గురుడు + దశమభావం ఉపాధ్యాయ వృత్తికి ముఖ్య కారకులు.

గురుడు దశమంతో గాని, దశమాధిపతితో గాని, సంబంధంవల్ల చట్టము పైనను న్యాయనిబంధనల పైననూ, ఉపాధ్యాయ వృత్తి పైననూ, ఆర్థిక లావాదేవీల పైననూ, మతము పైననూ, జ్యోతిషము పైననూ, ప్రత్యేక ఆకర్షణ చూపించును.

గురుడు సప్తమ భావంపై దృష్టి ఒక మంచి విద్యాబోధనా వృత్తిని సూచించును. బలమైన చతుర్థాధిపతి చతుర్థం నుండి దశమాన్ని చూచుటవల్ల గురుడు దశమాధిపతిని చూచుట, చతుర్ధాధిపతిని చూచుటచే చతుర్ధభావం, విద్యాబోధకులను, విద్యావేత్తలను సూచించును.

విదేశాలలో ఉన్నత విద్యకు 4, 7, 9 భావాలు బలం పొందేవి. వాటి అధిపతులు పాపదృష్టులు లేక శుభ స్థితి కల్గి ఉన్న ఆ యోగం కల్గును.

కుజ బుధులు కలిసి దశమంతో సంబంధం కల్గిన అనగా స్థితి గాని దృష్టి గాని పొందిన జాతకుడు పరిశోధనా సంస్థలలో పనిచేయును అని  చెబుతున్నాయి.

కుజుడు 9వ ఇంట గురుడు లగ్నంలో ఉన్న మేధావులు అయిన పరిశోధనా ఆవిష్కర్తలు ఏర్పడును. 2, 4, 5 భావాల బలం మరియు వారి అధిపతుల బలం అలాగే కారకులు బుధ, గురు బలం ఉన్నత విద్యార్హతలు అయిన పిహెచ్.డి మొదలైన పరిశోధనావేత్తలను సూచించును. అవి కలసి గాని మంచి స్థితి పొంది ఉండుట గాని జర్గును. బుధుడు 12లో ఉండి గురుని దృష్టి పొందిన పరిశోధనను చూపించును.

రాహువు పరిశోధనాగ్రహం శాస్త్ర రహస్యాలను సాంకేతిక రహస్యాలను హద్దులను సూచిస్తుంది. కేంద్రాలలో రాహువు నైపుణ్య, విజ్ఞాన శాస్త్రజ్ఞునిగా జాతకాలలో చూడవచ్చు.

పంచమం నుండి మేధాతనాన్ని నూతన పరిశోధనలు పరిశీలించవచ్చు. చతుర్థం పంచమ బావాలు బలం పొందిన జాతకుడు పండితుడు, బహు భాషలు తెలిసినవాడు అగును.

మాంది లేక గుళిక ఏకాదశంలో ఉంటే అనేక భాషలు తెలిసినవాడు అగును.

బుధుడు భాషాకారకుడు. రాశిలో గాని, నవాంశలో గాని శుభుల దృష్టి పొంది చరరాశులలో ఉన్న అనేక భాషలలో ప్రావీణ్యం కల్గును.

అన్ని విదేశ భాషలు 9వ భావం సూచించును. 9వ భావాధిపతి సంబంధంతో ఉండును. అదే సమయంలో చతుర్ధంలోను చతుర్ధాధితి మాతృభాషా సంబంధం కల్గి ఉండును.

3వ భావాధిపతి (రచన) శుభస్థితి 10, 11, 2, 9, 1 లేక వాటి అధిపతుల సంబంధం. నోబుల్ ప్రైజ్ జాతకాలలో కనపడుతుంది. బుధుడు కూడా ఈయోగానికి కారకుడు. 9, 10, 11, 2 లేక వాటి అధిపతుల సంబంధం మేధావిగా ఈ యోగాన్ని ఇచ్చును.

విజ్ఞాన శాస్త్ర సంబంధ విషయాలు విజయం పొందుటకు రవి, కుజ, లేక యోగ కారక గ్రహ బుధ గ్రహ కలయిక మరియు దశమభావం లేక దశమాధిపతి సంబంధం ప్రాధాన్యం వహిస్తాయి.

మీనం గాని మిథునం గాని లగ్నంగా ఉదయించునపుడు దశమాధిపతి గురుడు సప్తమంలో ఉండిన జాతకుడు విద్యా సంస్థలలో పనిచేయును.

మేధావులైన ప్రొఫెసర్ల జాతకాలలో యురేనస్ 3, 6, 7, 9,10,11 రాశులలోగాని 3, 5, 9, 11 భావాలలో గాని ఉండును. విద్యా సంస్థలలో మిగతా అధికారుల విషయంలో లగ్నం చరరాశి అయి ఉంటుంది. రవి దృశ్యభాగంలోను షష్ఠభావం బలంగా ఉండును.

 సంస్కృత జ్ఞాన కారకుడు గురుడు శుభస్థితి కల్గి 2, 5 లేక పంచమ భావంలో ఉన్న సంస్కృత పాండిత్యం కల్గును. బలమైన గురుడు 2 లేక 4 భావాలలో ఉన్ననూ ద్వితీయాధిపతి నవాంశ స్థిత రాశ్యాధిపతి కేంద్రాలలో ఉండి శుభదృష్టి కూడా ఈ యోగానికి సహకరించును. రవి నవాంశ స్థిత రాశ్యాధిపతి వైశేషికాంశ పొందిన ఇదే ఫలితం పొందును. 9-10 భావాధిపతులు ఉచ్చస్థితి పొందిననూ లేక వర్గోత్తమం పొందిననూ, మరియు కోణస్థితి పొందిననూ లేక ఏకాదశంలో ఉండిననూ జాతకుడు పరిశోధనా కార్యకలాపాలను, నూతన ఆవిష్కరణలో జయం పొందును.

పంచమాధిపతి 9వ భావం 9వ భావాధిపతి, అష్టమం, అష్టమాధిపతి, సింహరాశి మరియు రవి, ధనుస్సు రాశి మరియు గురుడు, వృశ్చికం మరియు కుజుడు మరియు రాహు కేతువులు అంతర్గత సంబంధాలు ఒక పద్ధతిలో ఏర్పడిన జాతకుడు నైపుణ్యం గల శాస్త్రజ్ఞుడు అగును.

జ్యోతిషశాస్త్రములో ఫలానా వృత్తికి ఫలానా గ్రహస్థితి అని పూర్వ గ్రంథాలో లేదు. అవి దేశ కాలమాన పరిస్థితులను అన్వయించుకుని జ్యోతిష సూత్రాలు అన్వయించి నూతనంగా తెలుపవలసినదే.

ముఖ్యంగా గమనించవలసింది 3, 5, 6, 7, 8, 11 రాశులు అనగా మిథున సింహ కన్య తుల వృశ్చిక కుంభ రాశులు ముఖ్యంగా వాయుతత్త్వ రాశులు. మేధావంతులను సూచించును.

ఉపాధ్యాయుల జాతకాలలో గురుడు 2, 5, 9 లేక 10 భావాలలో సామాన్యంగా స్థితి పొందును. గురునికి లగ్న దశమాలు అనుకూల స్థానాలు. 2, 3 స్థానాలు మధ్యమ స్థానాలుగా చెప్పవచ్చు. గురు దృష్టులు 5-9, గమనించిన లగ్నంలో ఉంటే 5-9 స్థానాలను చూచును. దశమంలో ఉంటే ద్వితీయాన్ని చతుర్థాన్ని చూచును. ద్వితీయంలో ఉంటే దశమాన్ని చూచును. ఇలా ఆ భావాలు ప్రతిఫలిస్తాయి. కనుక గురుడు 1-10లలో ఉంటే విద్యాబోధనకు బలమైన కారకుడు కాగలడు.

ఉపాధ్యాయులకు ప్రధాన కారకులు గురుడు, దశమభావం. లగ్న గతుడైన సప్తమభావంపై దృష్టుల వల్ల ఒక మంచి ఉపాధ్యాయ వృత్తిగా ఏర్పడును. బుధ+గురులు కలిసి కోణాలలో ఉన్న ఉపాధ్యాయులను సూచించును. లగ్నగతుడైన ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఉండును.

చివరగా బుధుడు లగ్నంలోనూ లేక 12లోను గురుని కలయికగాని దృష్టిగాని ఉండిన ఉపాధ్యాయ వృత్తికి అలాగే వరిశోధనకు అనుకూల స్థితి విద్యాబోధనకు సహకరించును.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...