గృహారంభ, గృహాప్రవేశ శుభ ముహూర్త నిర్ణయం
గృహారంభం
గృహారంభానికి చైత్ర వైశాఖాలు, శ్రావణ, కార్తీకాలు, మాఘ, పాల్గుణ మాసాలు శుభప్రదాలు. గురు శుక్రమౌఢ్యాలలో గృహారంభం పనికి రాదు. సూర్యుడు కృత్తికా నక్షత్రంలో నున్నప్పుడు కర్తరి గృహారంభం పనికిరాదు. భరణి 3,4 పాదాల్లోను రోహిణి మొదటి పాదంలోను సూర్యుడున్నప్పుడు గృహారంభం పనికిరాదు. మార్గశీర్ష మాసంలో గృహారంభం చేయవచ్చునని కాలామృతకారుని అభిప్రాయం.
తిథులు : విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి గృహారంభానికి శుభతిథులు. శుక్ల పక్షంలో ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమలు కూడ గృహారంభానికి యుక్తమయినవే అని కొందరిమతం.
నక్షత్రాలు: :అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, ఉత్తర, హస్త, చిత్త, అనూరాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు గృహారంభానికి శుభప్రదాలు. పుష్యమీ నక్షత్రం, స్వాతి నక్షత్రం కూడ కొందరిమతంలో పనికివచ్చేవే.
వారాలు : బుధ గురు
శుక్రవారాలు శ్రేష్ఠం. సోమవారం కూడ పనికి వస్తుందని కొందరు, “ఆదిత్య భౌమవర్జంతుసర్వే వారా శ్శుభప్రదాః”
అని నిర్ణయసింధు.
లగ్నాలు : వృషభం,
మిథునం, కన్య, ధనుస్సు,
కుంభం, మీనలగ్నాలు గృహప్రారంభానికి శుభప్రదాలు. వృశ్చికం,
సింహం కూడ పనికి వచ్చేవే అని కొందరి
మతం. చతుర్థశుద్ధి, అష్ఠమశుద్ధి
చూడాలి.
గృహప్రవేశం
“అకవాటమనాచ్ఛన్నం, అదత్తబలి భోజనం, గృహం నప్రవిశేద్ధీమాన్ ఆపదామా కరోహితత్" అనే స్మృతివచనం తలుపులు ఏర్పాటు చేసిం తర్వాత భూతబలి, భోజనాదులతో గృహప్రవేశం చేయాలని చెప్పుచున్నది. " కృత్వాగ్రతో ద్విజవరానథ పూర్ణకుంభం దధ్యక్షతామ్రదళ పుష్పఫలోపశోభం, దత్వా హిరణ్య వసనాని తథా ద్విజేభ్యోమాంగల్యశాంతి నిలయం స్వగృహం విశేచ్చ" అనే శాస్త్రవచనం. పూర్ణకుంభం, పెరుగు, అక్షతలు , మామిడాకులు, పూలు, పళ్లు, మొదలైన శోభన ద్రవ్యాలతో బ్రాహ్మణులను ముందుగా ఉంచుకొని గృహప్రవేశం చేయాలని చెప్పుతున్నది. “శుక్లాంబరః స్వభవనంప్రవిశేత్"అనే వాక్యం తెల్లని వస్త్రాలు ధరించి గృహప్రవేశం చేయవలెనని చెప్పుతున్నది.
అథ ప్రవేశో నవమందిరస్య' సౌమ్యాయనే జీవసితౌబలాడ్యౌ సితేచపక్షే శుభవాసరేచ వాస్త్వర్చనం భూతబలించకుర్యాత్" అనే ముహూర్త దర్పణ వచనం ఉత్తరాయణంలో గురు శుక్ర బలం చూచుకొని శుక్లపక్షంలో శుభవారం నాడు వాస్తు పూజను భూతబలిని నిర్వహించి గృహప్రవేశం చేయాలని చెప్పుతున్నది.
మాసాలు : “మాఘ ఫాల్గుణ వైశాఖ జ్యేష్ఠమాసాశ్శుభప్రదాః సహ
ఊర్జౌతు విజ్ఞేయో మధ్యమౌతు ప్రవేశనే”
మాఘ, ఫాల్గుణ, వైశాఖ, జ్యేష్ఠమాసాలు
గృహ ప్రవేశానికుత్తమాలు. కార్తీక మార్గశీర్షాలు మధ్యమాలు, శ్రావణం కూడ పనికి వస్తుందని కొందరి మతం.
వారములు : సోమ బుధ గురు శుక్రవారాలలో గృహప్రవేశం శుభకరం. శనివారం గృహప్రవేశం చేస్తే ఆ ఇల్లు స్థిరంగానే యుంటుంది కాని ఆయింటికి చోరభయం ఉంటుంది. (కింతు చోరభయమత్రవిద్యతే).
తిథులు : విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథులు గృహప్రవేశానికి శుభప్రదాలు.
నక్షత్రాలు : రోహిణి, మృగశిర, ఉత్తర, చిత్త, అనూరాధ, ఉత్తరాషాఢ, ధనిష్ఠ శతభిషం, ఉత్తరాభాద్రా రేవతి నక్షత్రాలు గృహప్రవేశానికి శుభప్రదాలు. చిత్త పనికి రాదని కొందరు పుష్యమి కూడ పనికి వస్తుందని కొందరి అభిప్రాయం. అశ్విని పుష్యమి కూడ పనికి వస్తుందని కొందరు చెప్పగా, పుష్యమి, పునర్వసు, అశ్విని శ్రవణ నక్షత్రాల్లో గృహప్రవేశం చేస్తే ఆయిల్లు పరుల పాలవుతుందని ముహూర్త దర్పణకారుని అభిప్రాయం.
వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభం, మీనం లగ్నాలు శుభకరాలు. సింహం, వృశ్చికం కూడపనికి వస్తాయని తుల పనికి రాదని కొందరి మతం. చతుర్థశుద్ధి, అష్ఠమ శుద్ధిచూడాలి. యజమాని జన్మ రాశినుండి 1, 3, 4, 6, 10, 11 లగ్నాలు శుభప్రదాలని కాలామృతం. లగ్నంలో పాపగ్రహాలుండరాదు. పాపగ్రహ దృష్టి కూడ పనికి రాదు. 6, 8, 12, స్థానాల్లో చంద్రుడుండరాదు. 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు, కేంద్ర త్రికోణాల్లో శుభగ్రహాలుండడం గృహప్రవేశానికి శుభప్రదం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి