17, డిసెంబర్ 2022, శనివారం

జాతకచక్రంలో షష్టమ భావ విశ్లేషణ

జాతకచక్రంలో ష్టమ భావ విశ్లేషణ

పాప గ్రహములు షష్టమ స్ధానం లో ఉన్న శత్రు బాధలు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. లగ్నం నుండి ఆరవ స్ధానం వ్యాధి, విరోధం, ఋణం, బాధ, గాయాలు, మేనమామలు, మానసిక ఆందోళన, ఋణాల బారిన పడటం, తగువులు, దురదృష్ఠం, చెడ్డపేరు, దొంగతనం, అగౌరవం, శత్రుబాధలు వంటి చెడు ఫలితాలతో పాటు విజయాలు,  పరిశీలనా సామర్ధ్యం, పోటీతత్వంతో ముందుకు వెళ్ళటం వంటి శుభ ఫలితాలను కూడా సూచిస్తుంది. అయితే ఈ భావ కారకత్వాల ద్వారా లభించే శుభ ఫలితాలు కూడా మరో విధంగా కొంత బాధను కలిగించటం గమనించాలి. విజయం పొందటం ఆనందదాయకం అయినా ఆ విజయాన్ని పొందటానికి ఎంతో శ్రమించాలి. పైగా సాధించిన విజయాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం కృషి చేయాలి. అంటే ఆరవ స్ధానం తెచ్చిపెట్టే ఈ విజయం ఎంతో శ్రమకరమైనదిగా గమనించాలి. సత్యాచార్యుల వారు లగ్నాదిగా షష్ఠాధిపతి లగ్నంలో ఉంటే వ్యక్తి అధికార సంపన్నుడు అవుతాడని అదే విధంగా రోగగ్రస్తుడు కూడా కావటం గమనించాలి అని చెప్పారు.


ఆరవ స్ధానాధిపతి ఎనిమిది, పన్నెండు స్ధానాలలో ఉంటే విపరీత రాజయోగాన్ని కలిగించినా దురలవాట్లు, అనారోగ్యం కల్పించటం గమనించాలి. షష్ఠాధిపతి లగ్న, అష్టమ, దశమ స్ధానంలో ఉంటూ ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న కురుపులు, గాయాలతో తరచుగా బాధపడతారు. షష్ఠాధిపతి షష్టంలో గాని, అష్టమంలో గాని ఉంటూ రవితో కలసి ఉన్న శిరస్సు పైన, చంద్రుడితో కలసి ఉన్న ముఖము పైన, కుజుడితో కలసి ఉన్న నుదుటిపైన, బుధుడుతో కలసి ఉన్న చెవి దగ్గర, గురువుతో కలసి ఉన్న ముక్కు పైన, శుక్రునితో కలసి ఉన్న కాళ్ళ పైన, శని లేదా రాహు లేదా కేతు గ్రహాలతో కలసి ఉన్న చంకలలో గాని కురుపులు గాయాలతో బాధపడే అవకాశాలు ఉంటాయి.


షష్ఠాధిపతి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ సంబంధమైన వ్యాధులు కలగటం, ఆ గ్రహ సంబంధ కారకత్వాలు తగ్గిపోవటం, గురువు వంటి శుభగ్రహాలు ఆరవ స్ధానంలో చేరినా ఆ స్ధానానికి అనుగుణంగా వీటి గ్రహ కారకత్వాలు ప్రభావితం కావటం జరుగుతుంది. ఆరవ స్ధానం శుభ గ్రహ స్ధానమై అందులో శుభ గ్రహాలు ఉంటే జాతకునికి దాయాదుల సహాయం లభించినప్పటికి శత్రు బాధలు ఉంటాయని కొన్ని నాడీ గ్రంధాలు తెలుపుతున్నాయి.

షష్ఠాధిపతి వివిధ స్థానములలో ఉండగా ఫలితములు

మొదటి స్థానంలో- శుభగ్రహ దృష్టి ఉన్న జాతకులు సైన్యంలో చేరటం లేదా ఉన్నతాధికారిగాను యుద్ధ మంత్రి లేదా జైళ్ళకు సంబంధించిన అధికారులు అవుతారు. ఆదరణ కోల్పోయి మేనమామతో కలసి జీవిస్తారు. శుభగ్రహ దృష్టి లేకున్న చెడు సాహవాసాలు చేసేవారుగా, దొంగతనాలు, జూదాలు ఆడుతూ ముఠా నాయకులుగా ఎదుగుతారు.


రెండవ స్థానంలో- కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు మరియు ఏదైనా విచారకరమైన సంఘటనలు జరగటం,  శత్రువుల కారణంగా ధన నష్టము, కంటి చూపు మందగించటం,  పంటి సమస్యలు, మాటకు సంబందించిన దోషాలు ఉంటాయి. శత్రుగ్రహ సంబంధం ఉంటే భార్యతో విభేదాలు, ఎడబాటు, వియోగం కలిగే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు బలహీనుడైన ఆర్ధిక ఇబ్బందులతో వివాహము కాకపోవుట, సుఖ సౌఖ్యాలు లేకపోవుట, సరైన తిండి తినలేకపోట జరుగును.

తృతీయ స్థానంలో- సోదరులతో తరచుగా విభేదాలు లేదా తరచుగా అనారోగ్యాలు ఉంటాయి. మేనమామ తో గొడవలు లేదా ఆర్ధికపరమైన వాటిలో విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి.  బలహీనుడైన కనిష్ఠ సోదరులు ఉండరు.


చతుర్థ స్థానంలో- పాడుబడ్డ లేదా పురాతన గృహంలో నివాసము, విద్యలో ఆటంకాలు కలగటం, తల్లితో వైరం, తల్లికి దూరంగా ఉంటారు. తల్లి తరపు వారు వ్యయసాయం చేసిన వారై ఉంటారు. తండ్రి తరపున వారసత్య సంపదను కోల్పోతారు. సంసార జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబం జీవితం అస్తవ్యస్తంగా ఉండటం కుటుంబ పోషణ హీనంగా ఉండటం జరుగుతాయి. పని చేసేవారితో జాగ్రత్తగా ఉండాలి.

పంచమ స్ధానంలో:- పిల్లలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. మేనమామతో అనుభందాలు ఎక్కువ. శుభగ్రహ దృష్టి ఉంటే అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి.

షష్ఠ స్థానంలో- తరచుగా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బలహీనుడైన లేదా శుభగ్రహ దృష్టి ఉన్న లగ్నాధిపతితో కలసి ఉన్న దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగే అవకాశాలు ఉంటాయి.  మేనత్త మేనమామ పిల్లలు ఎక్కువుగా ఉంటారు. మేనమామ మంచి పేరు కీర్తి కలిగి ఉంటారు.


సప్తమ స్థానంలో:-  సప్తమంలో లగ్నాధిపతి షష్ఠాధి పతితో కలసి వుండగా ఆ రాశి నపుంసక రాశైన జాతకులు నపుంసకులో లేదా లైంగిక సామర్ధ్యము లేనివారై ఉంటారు. వివాదగ్రస్తమైన స్త్రీలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేనరికం వివాహము చేసుకుంటారు. వీరి మేనమామ దూర ప్రాంతాలలో (దేశాలలో) జీవిస్తారు. వైవాహిక జీవితంలో అనుమానాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మారక స్ధానం కావటం వలన భార్యా భర్తల మధ్య వైరాగ్యం, మారక లక్షణాలు కలిగే అవకాశాలు ఉంటాయి.  రాశి నవాంశలు నపుంసక రాశులైన వీరి భార్య అనారోగ్యవంతురాలో లేదా గొడ్రాలో అగును.

అష్టమ స్థానంలో-మంచి స్థితిలో ఉన్న మధ్యాయుర్ధాయులై ఉంటారు. ఈ స్థానంలో పాడైన విశేషమైన అప్పులు, తీర్చవీలులేని అప్పులతో బాధపడతారు. చెడు వ్యామోహాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. మరియు ఇతరులను బాధపెట్టి తాము సంతోషపడతారు.


భాగ్యస్థానంలో- షష్ఠాధిపతికి ఈ స్థానము శుభ స్థానమైన వీరి తండ్రి న్యాయాధికారి అవుతారు. వీరి మేనమామ అదృష్టవంతులుగా చెప్పబడ్డారు. వీరికి తండ్రితో అభిప్రాయబేధము మరియు వైరము ఉంటుంది. జ్ఞాతుల వల్ల లాభ పడతారు. ఈ స్థానములో పాడైన దారిద్ర్యము, పాపకార్యాలు చేయడం, బంధువుల కారణంగా దురదృష్టాలు, గురువులతో సానుకూలత లేకపోవడం. మధ్యమ బలము కలిగివున్న తాపీ పనివాడో వడ్రంగి లేదా రాళ్ళు కోసేవారు అగుదురు.

దశమ స్థానంలో- చక్కగా ఉన్న, పాప బుద్ధి పాడు చేసే బుద్ధి ఉన్నను పైకి భక్తి పరునిగా ఆధ్యాత్మిక వేత్తగా కనిపించినను మానసికంగా ద్వేష భావం కలిగి ఉంటారు. షష్ఠాధిపతి బలహీనుడైన నీచ బుద్ధి, శత్రు భయం, యాచింతే బుద్ది ఉంటుంది.

ఏకాదశ స్థానంలో- శుభుడైన జ్యేష్ఠ సోదరుడు న్యాయాధికారి అవుతారు. సాధరణంగా ఉన్న జ్యేష్ఠ సోదరులు న్యాయాధికారులైనను కొంతకాలానికి ఉద్యోగ హీనులు అవుతారు. పాపియైన, దురదృష్టవంతురాలు బీదరికంతో కళత్రం ఉంటుంది. నేరారోపణ చేయబడి కష్టముల పాలౌతారు.

ద్వాదశస్థానంలో:- బలము కలిగి ఉన్న తమ వివరీత ప్రవర్తనచే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు యిబ్బందులు కలిగిస్తారు. బలహీనులైన కష్టముగా బ్రతుకుతారు.

షష్ఠస్థానమునందున్న గ్రహములు

రవి. -జాతకులు రాజకీయాలలో రాణించడమే కాకుండా కీర్తి మరియు అన్నిటా విజయము లభిస్తుంది. ఆరోగ్యం సరిగ్గా ఉండదు. రవి పాడైన ఇబ్బంది కలిగించే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. రవి బలము కలిగి ఉన్న మంచి నిర్వాహణా సామర్ధ్యము, అల్ప శత్రువులు, ధన లాభము అన్నిట విజయులై ఉంటారు. శని కారణంగా పాడైన హృద్రోగములు లేదా తరచు ఛాతి నొప్పులు ఉంటాయి. వీరిపై గురుదృష్టి ఉన్న ఈ ఫలితములు తగ్గుతాయి.

చంద్రుడు. - బాలారిష్టాలు లేదా చిన్నతనంలో తరచు అనారోగ్యములు ఉంటాయి. కుజ శనులచే చూడబడిన నివారింపబడని వ్యాధులు, శత్రు పీడలు ఎక్కువుగా ఉంటాయి. చంద్రుడు బలము కలిగివున్న సేవకావృత్తిలో రాణిస్తారు. షష్ట స్థానము స్థిరరాశైన మూత్రాశయంలో రాళ్ళ వలన, స్త్రీలకు విధేయులై ఉండడం బలహీనమైన లైంగిక సామర్ధ్యము ఉంటుంది. ఇదే ద్విస్వభావరాశులైన ఊపిరితిత్తులలో యిబ్బందులు, హోటల్ బిజినెస్ లో రాణించటమే కాకుండా కూకుంగ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి.

కుజుడు.-అధికమైన కోరికలు కలిగినవారు, రాజకీయాలలో విజయము పాలకులుగా విజయవంతులౌతారు. దగ్గర బంధువుల వల్ల యిబ్బందులు ఉంటాయి. కుజుడు పాడైన ప్రమాదములు, తమ ఉద్యోగుల వల్ల కష్ట నష్టాలు ఉంటాయి. శని కారణంగా పాడైన శస్త్ర చికిత్సా సమయంలో లేదా జంతువుల బారీన పడడం వల్ల మరణిస్తారు. రాహువు కారణంగా కుజుడు పాడైన ఆత్మహత్య చేసుకుంటారు. కేతువైన విష ప్రయోగం వల్ల మరణిస్తారు.

బుధుడు. -దెబ్బలాటకోరుగా కనిపించినను గౌరవనీయులు, విద్యకు ఆటంకములు ఎదురౌతాయి. బుధుడు పాడైన మనోవేదనలు, నరాల బలహీనత కారణంగా ప్రమాదస్థితి సంభవిస్తుంది. బుధుడు కుజ, రాహు లేదా శని రాహువుల కారణంగా పాడైన ఉద్వేగము కారణంగా పిచ్చి ఎక్కుతుంది. సేవకుల కారణంగా యిబ్బందులు ఆరోగ్యము సరిగా ఉండదు. బద్ధకము, కఠినంగా మాట్లాడడం, శత్రు భయంకరులై ఉందురు.

గురుడు. చురుకుగా లేకపోవడం, గౌరవము లేకపోవుట, క్షుద్ర విద్యలలో ఆసక్తి,శత్రువుల వలన భయము, దురదృష్టము, అజీర్ణ వ్యాధి ఉన్నను ఆరోగ్యవంతులుగానే చెప్పవచ్చును. గురుడు పాడైన అతి కోరికలు కారణంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి.

శుక్రుడు. -శత్రువులు లేనివారు. యువతుల కారణంగా పాడవ్వడం, స్త్రీల వలన లాభపడుట వంటి ఫలితాలు ఏర్పడతాయి. శుక్రుడు పాడైన కామ ప్రవృత్తిచే ఆరోగ్య భంగములు, పరస్త్రీ వ్యామోహము నీతి బాహ్యముగా ప్రవర్తించడం ఎక్కువుగా ఉంటుంది.

శని:- తంపులమారిగా ఉండడం, మొండి పట్టుదల, అతిగా భుజించడం, శత్రువులు లేనివారు, ధైర్యవంతులుగా ఉంటారు. శని పాడైన నిర్లక్ష్యము కారణంగా అనారోగ్యములు, తన క్రిందవారి వలన కష్టములు ఉంటాయి. కుజుడు కారణంగా శని పాడైన ప్రమాదకరమైన రోగములు లేదా శస్త్ర చికిత్సలు ఉంటాయి. రాహువు కారణంగా శని పాడైన హిస్టీరియాb(పిచ్చి) బారీన పడతారు. శని చక్కని స్థితిలో ఉన్న కాంట్రాక్టులు మరియు గనుల వలన లాభములు ఉంటాయి.

రాహువు. - దీర్ఘాయుర్దాయము, సంపదలు, శత్రువులు, పీడకలలు, జననాంగాలలో రోగాల పీడలు ఉంటాయి. సంక్లిష్టమైన ప్రవృత్తి కారణంగా యిబ్బందులు ఉంటాయి. ఇక్కడ చంద్రుడు లేదా శనితో రాహువు కలసిన మానసికంగా యిబ్బందులు ఉంటాయి. వీరికి అనేకమంది బంధువులు వ్యక్తిగత జీవితం కళంకాలతో నిండి ఉంటుంది.

కేతు. -ఇది కేతువుకు చక్కని స్థితని చెప్పవచ్చును. కీర్తి అధికారము ఏర్పడుతుంది. శత్రు భయము లేనివారై ఉంటారు. అయితే వీరు నైతికంగా శీలము లేనివారై ఉంటారు. వీరికి అతీంద్రియ మరియు తాంత్రిక జ్ఞానము కలిగి ఉంటారు. కుజుడు లేదా ఇతర పాపగ్రహాలతో కలసి ఉన్న మానసిక రుగ్మతలు, ఏదో అనారోగ్యం ఉంని భయపడటం.

షష్ఠాధిపతి ఇతర స్ధానాలలో ఉంటే

షష్ఠాధిపతి 6 వస్థానములో ఉంటే సాధారణంగా ఆ దశలో శుభఫలితాలే ఏర్పడతాయి.. ఇక్కడ ద్వితీయాధిపతి చేరిన ఆర్థిక విషయాలలో నష్టములు, ఉంటాయి. దశమాధిపతి చేరిన వృత్తిలో వ్యతిరేక పరిస్థితులుంటాయి. షష్ఠాధిపతి 6లోనే ఉన్నపుడు ఆర్ధిక స్థితి చక్కగానే ఉంటుందని చెప్పవచ్చును. ఇదే స్థితిలో 8, 12 స్థానాల అధిపతులు కలిసిన షష్ఠాధిపతి దశ మొత్తం యోగిస్తుంది.

షష్ఠాధిపతి సప్తమస్థానములో వున్నపుడు ఈ దశలో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. కొంత కాలం శత్రు బాధలు ఉన్నను మరికొంత కాలం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. షష్ఠాధిపతి సప్తమంలో సప్తమాధిపతితో కలసినపుడు భార్యకు అనారోగ్యము ఏర్పడుతుంది. లేదా ఈ గ్రహ అంతర్దశలలో భార్యతో బేధాభిప్రాయాలు ఏర్పడతాయి. వీరితో పాపగ్రహములు కలసివుండగా లగ్నాధిపతి బలహీనుడైన జాతకులు తీవ్రమైన అనారోగ్యములు, అందరితో బేధాభిప్రాయాలు,శత్రుబాధలు ఎక్కువుగా ఉంటాయి. స్త్రీలలో ఋణబాధలు వారికి సంబంధించిన దోషాలు ఉంటాయి. నవాంశలో షష్ఠాధిపతి 6,8,12 స్థానములలోనే ఉన్న భార్యతో వివాదాలు, షష్ఠాధిపతి నవాంశలో షష్ఠస్థానము ద్విస్వభావరాశియైన భార్యకు విడాకులు ఇచ్చి మరొక వివాహము చేసుకునే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు వీరితో కలసిన భార్యతో అభిప్రాయబేధాలు మరొక స్త్రీతో లైంగిక సంబంధాలకు దారితీస్తాయి. పై స్థితిలో ద్వితీయాధిపతి చేరిన షష్ఠాధిపతి దశ ద్వితీయాధిపతి అంతర్దశలో మారకం ఏర్పడుతుంది.

షష్ఠాధిపతి అష్టమస్థానములో బలయుతుడైన శుభగ్రహ అంతర్ధశలలో శుభఫలితాలు ఏర్పడతాయి. లగ్నాధిపతి 6లోను, షష్ఠాధిపతి 8లోను ఉన్నపుడు షష్ఠాధిపతి దశలోని లగ్నాధిపతి అంతర్దశలో నివారణకాని వ్యాధులు, ధననష్టము దారిద్ర్యము, మనోవేదనలు ఏర్పడతాయి. అయితే లగ్నాధిపతి 6, 8, 12 నవాంశలలో, శుభగ్రహ రాశులలో ఉన్నపుడు ఈ ఫలితాలు ఎక్కువుగా బాధించవు. ఏ భావాధిపతైనా షష్ఠాధిపతితో కలసి 8లో ఉన్న 6పతి దశలో కలిసిన గ్రహ అంతర్దశలలో చెడు ఫలితాలు ఏర్పడతాయి. ఉదాహరణకు దశమాధిపతి 6పతితో కలసి 8లో ఉన్నపుడు, షష్ఠాధిపతి దశ 10పతి అంతర్ధశలో వృత్తిలో వ్యతిరేకతలు, ఉద్యోగము కోల్పోవుట వంటి ఫలితాలు ఏర్పడతాయి.

షష్ఠాధిపతి నవమ స్థానములో పాపగ్రహములతో కలసిన పితృ కారకుడు (రవి) బలము కలిగి ఉన్న తండ్రికి దురదృష్టము, శత్రువుల బాధలు, మనో వేదనలు మరియు అధిక నష్టాలు ఏర్పడతాయి. తండ్రి ఆస్తులను సైతం కోల్పోవడం, అర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడం, వివాదములు తద్వార అప్పులలో పడడం జరుగుతుంది. షష్టాధిపతి 9వస్థానములో ఉండి రవితో కూడిన 6పతి దశ రవి అంతర్దశలో పితృమారకము అవుతుంది. 6పతి 9లోను, రవి 9పతి కలసి 8లో బలహీనుడైనపుడు భాగ్యాధిపతి 8పతిచే చూడబడినను కలసినను ఉదరకోశ వ్యాధుల వల్ల జాతకుని తండ్రి మరణిస్తాడు. వీరితో సప్తమాధిపతి కలసిన తండ్రి మారకము కాక తండ్రితో తీవ్రమైన బేధాభిప్రాయాలు ఏర్పడతాయి.

షష్ఠాధిపతి దశమాధిపతితో కలసి దశమస్థానములో ఉన్న వృత్తిలో దినదిన గండంగా ఉంటుంది. వీరు తీసుకునే వృత్తి సమాజవ్యతిరేకమైనదిగా ఉంటుంది. వీరు ప్రభుత్వ వ్యతిరేకతలను, అధికారులు వల్ల చికాకును నిందారోపణ ఎదుర్కోవలసి వస్తుంది. నవాంశలో దశమాధిపతి 6,8,10 స్థానములో ఉండగా శుభగ్రహములతో కలసిన, పై పాప ఫలితములు చాలామటుకు తగ్గుతాయి. పాపగ్రహములతో కలసిన పాపఫలితాలు ఎక్కువుగా ఉంటాయి.

షష్టాధిపతి లాభ స్థానములో 11 అధిపతితో కలసిన వ్యాపారములో వ్యవసాయములో లాభములు, వృత్తిలో అనుకూలత మిగిలిన విషయాలలో సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. ఇది ప్రత్యేకంగా 6పతి అంతర్దశలలో ఏర్పడతాయి. 6పతి బలము కలిగి ఉన్న మేనమామ వలన ధనలాభములు, తమ జ్యేష్ఠ సోదరులవల్ల అసంతృప్తిని ఎదుర్కొంటారు. 11పతి 6వస్థానాధిపతి కన్నా అధిక బలయుతుడైన శత్రువులపై జయము, వ్యతిరేకతలు లేనివారై ఉందురు.

షష్ఠాధిపతి ద్వాదశ స్థానములో తదధిపతితో కలసిన అనేక ఇబ్బందులు, శత్రువుల చేతిలో భంగపడుట వంటి ఫలితాలు ఏర్పడతాయి. నైతిక ప్రవర్తన ఉండదు. ఈ భావాధిపతి ఎవరితో కలసిన ఆ గ్రహకారకత్వము అనుసరించి ఫలితాలు ఏర్పడతాయి. షష్ఠాధిపతి బలయుతుడైన పై ఫలితాలు తక్కువుగా ఉంటాయి.

షష్ఠాధిపతి లగ్నములో లగ్నాధిపతితో కలసిన అనారోగ్యములు, అంగ వైకల్యము, అధికారులవల్ల ఇబ్బందులు, శత్రు పీడలు ఎక్కువుగా ఉంటాయి. వీరితో రాహువు కలసిన చోర భయము, ఆర్ధికంగా చాలా బాధలు ఏర్పడతాయి. షష్ఠాధిపతి నవాంశలో లగ్నాధిపతికి 6,8,12 స్థానములలో వున్న పై ఫలితాలు మరింత ఎక్కువుగా ఉంటాయి. 6,8 అధిపతులు లగ్నములో కలసినపుడు లేదా నవాంశ లగ్నానికి లేదా లగ్నాధిపతికి ఇరుపక్కలా ఉన్నపుడు ఏర్పడిన షష్ఠాధిపతి దశలో ఆకస్మిక దాడులు ఎదుర్కోవడం, అనారోగ్యములు, ఆర్ధిక నష్టములు ఎదుర్కోవలసి వస్తుంది. ఇటువంటి స్థితిలో బ్రతుకు మరింత భారంగా పరిణమించి మరణిస్తారు.

షష్ఠాధిపతి ద్వితీయస్థానంలో 2వస్థానాధిపతితో కలసిన కుటుంబ సుఖము కోల్పోవడం, బంధు మిత్రులు శత్రువులుగా మారడం జరుగుతుంది. అకాల భోజనము, శత్రువుల బాధలు ఎక్కువుగా ఉంటాయి. దంత వ్యాధులు, కంటికి సంబంధించిన కేన్సరు వంటి వ్యాధులు ఏర్పడతాయి. వీరితో శుభగ్రహాలు కలిగిస్తే శుభాశుభ ఫలితములు మిశ్రమంగా ఏర్పడతాయి. లగ్నాధిపతి వీరితో కలసివుండగా శుభగ్రహ వీక్షణలు లేనపుడు, షష్ఠాధిపతి దశ లగ్నాధిపతి అంతర్దశలో మారక దోషాలు ఏర్పడతాయి. పాపగ్రహముల దృష్టి ఏర్పడిన ఆ గ్రహ కారకత్వమును అనుసరించి ఫలితాలు ఏర్పడతాయి. షష్టాధిపతి తృతీయస్థానంలో తృతీయాధిపతితో కలసిన జాతకులకు సోదరులతో వివాదాలు ఉంటాయి. అంతేకాక చెవి, గొంతు, చెవుడు వంటి రోగాలు గొంతుపై కంతులు ఆత్మవిశ్వాసము లేకపోవడం, మిత్రులతో వైరం ఏర్పడుతాయి. వీరితో శుభగ్రహములు చేరిన పై పాపఫలితములు విశేషంగా తగ్గుతాయి. ఇక్కడ కుజుడు బలహీనపడిన సోదరులకు అనారోగ్యములు, మారకదోషాలు ఏర్పడుతాయి.

షష్టాధిపతి చతుర్ధంలో రాహు చంద్రులతో కలసిన చంద్ర మహాదశలో తల్లి ఆరోగ్యము సందేహాస్పదముగా ఉండును. ఈ దశ చాలాకాలం తరువాత వచ్చిన జాతకుని ఆరోగ్యము అపాయంలో పడుతుంది. ఇందున్న కుజుడు బలహీనుడైన జాతకుని చరాస్తులు శత్రువులచే వేలం వేయబడతాయి. బుధుడు బలహీనుడైన విద్యలో ఆటంకములు, పరీక్షలలలో విఘ్నములు ఏర్పడతాయి. శుక్రుడు బలహీనుడైన ప్రయాణములలో వాహనములు నుండి పడి ప్రమాదములు తెచ్చుకుందురు. చతుర్థాధిపతి బలహీనుడైన, తల్లి విధవగును. లగ్నాధిపతి చతుర్ధాధిపతి ఒకరికొకరు షష్టాష్టకస్థానములలో ఉన్న జాతకులు తన తల్లికి దూరమగుదురు. వీరిపై శుభగ్రహముల స్థితి వీక్షణలు ఈ ఫలితములను తగ్గించును.

షష్ఠాధిపతి పంచమంలో పంచమాధిపతితో కలసిన యజమానితో లేదా సంతానముతో, తండ్రితో కారకత్వములను అనుసరించి వైరములు ఉంటాయి. వీరి సంతానము తరచు అనారోగ్యముల బారిన పడుదురు. అన్నిటా వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయి. వీరి ఆలోచనలు వక్రమార్గంలో ఉంటాయి. ఈ దశాకాలంలో మార్మికవిద్యలను అభ్యసిస్తారు. షష్ఠాధిపతి పంచమస్థానంలో 5,7,7,9,11 భాగలలో ఉండగా లగ్నాధిపతి బలహీనుడైన, పైవారికి అనిష్టులై అధికారుల కోపముచే కారాగారవాసము చేయుదురు. ఇది షష్ఠాధిపతి మహాదశ లగ్నాధిపతి అంతర్దశలో ఏర్పడును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...