24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

పంచ మహా పురుష యోగాలు


 పంచ మహా పురుష యోగాలు

రుచక భద్రక హంసక మాలవాః సశశకాః పంచచ కీర్తితాః

స్వభావనోచ్చ గతేషు చతుష్టయే క్షితి సుతాదిషు తాన్ క్రమతా వాదేత్

రుచక మహా పురుష యోగం కుజగ్రహం ద్వారా, భద్రక మహా పురుష యోగం బుధ గ్రహం ద్వారా, హంస మహా పురుష యోగం గురుగ్రహం ద్వారా, మాలవ్య మహా పురుష యోగం శుక్రగ్రహం ద్వారా, శశక మహా పురుష యోగం శనిగ్రహం ద్వారా ఏర్పడతాయి.

రవి చంద్రులు కాక మిగిలిన గ్రహాలైన కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాల వల్ల పంచ మహా పురుష యోగాలు ఏర్పడతాయి. పంచ మహా పురుష యోగాలు ఏర్పడటానికి కొన్ని ముఖ్య సూత్రాలు అవసరమవుతాయి.

కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలు లగ్నానికి గాని, చంద్రునికి గాని కేంద్రాలలో ఉండాలి. ఆ కేంద్ర స్ధానాలు స్వక్షేత్రం గాని, ఉచ్చ గాని అయి ఉండాలి.

జాతక పారిజాతంలో వైధ్యానాధ దీక్షితులు ఆ కేంద్ర స్ధానాలు మూల త్రికోణ స్ధానాలు కూడా కావాలని సూచించారు.

సారావళిలో, హోరాసారంలో, బృహజ్జాకంలో కేంద్రాలు డ్బల సంపన్నాలై ఉండాలని తెలియజేశారు. మరియు రవి చంద్రులకు ఈ పంచ మహా పురుష యోగాలతో సంబందం లేకపోయిన జాతకంలో రవి చంద్ర గ్రహాలు బలంగా ఉంటే ఈ పంచ మహా పురుష యోగాలు ఇంకా మంచి ఫలితాలు ఇస్తాయి అని తెలియజేయటం జరిగింది.

పంచ మహా పురుష యోగాలను లగ్నం నుండి గాని, చంద్రుని నుండి గాని చూడవచ్చు. ఈ యోగాలు రాజయోగ ప్రదాలు. ఉన్నతోద్యోగప్రదాలు. పంచ మహా పురుష యోగాలలో ఒక యోగం కలిగితే అదృష్టశాలి, రెండు కలిగితే రాజా కుమారుడు, మూడు యోగాలు కలిగితే రాజు, నాలుగు యోగాలు కలిగితే చక్రవర్తి, ఐదు యోగాలు కలిగితే నృపేంద్రులు అవుతారు.    

రుచక మహాపురుష యోగం

రుచక మహాపురుష యోగం చర, స్ధిర రాశుల్లో జన్మించిన వారికి మాత్రమే ఈ యోగం పడుతుంది.

మేష రాశి:- కుజుడికి మేష రాశి స్వక్షేత్రం కావటం, దశమ స్ధానమైన మకర రాశి ఉచ్చ క్షేత్రం కావటం వలన కుజుడు ఈ రాశులలో ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది.

వృషభ రాశి:- సప్తమంలో స్వక్షేత్రమైన దశమ స్ధానమైన వృశ్చిక రాశిలో కుజుడు ఉంటే ఈ యోగం సిద్ధిస్తుంది. ఈ రాశిలో కుజుడు విశాఖ నక్షత్రంలో ఉంటే ఇంకా మంచిది.

కర్కాటక రాశి;- మకర రాశి సప్తమ స్ధానంలో ఉచ్చ కావటం, మేష రాశి దశమ స్ధానమై స్వక్షేత్రం కావటం వలన ఈ యోగం కలుగుతుంది. అశ్వనీ నక్షత్రంలో కుజుడు ఉంటే యోగాన్ని ఇస్తాడు. భరణి నక్షత్రంలో ఉంటే యోగ ఫలితాన్ని పొందలేరు. కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో ఉంటే మంచి ధనాభివృద్ధి ఉంటుంది.

సింహారాశి:- వృశ్చిక రాశి చతుర్ధ స్ధానంలో స్వక్షేత్రం కావటం వలన కుజుడు ఈ రాశిలో ఉంటే ఈ రుచక మహా పురుష యోగం ఏర్పడుతుంది.  కుజుడు సింహానికి చతుర్ధ, నవమాధిపతిగా అత్యంత యోగ కారకుడు, ఈ రాశిలో కుజుడు అనూరాధ, జ్యేష్ఠ నక్షత్రాలలో ఉంటే సామాన్య ఫలం, విశాఖ నక్షత్రంలో ఉత్తమ ఫలితం కలుగుతుంది.

తులారాశి:- మకరరాశి దశమ స్ధానంలో ఉచ్చ క్షేత్రం కావటం, సప్తమ స్ధానమైన స్వక్షేత్రంలో కుజుడు ఉంటే రుచక మహా పురుష యోగం కలుగుతుంది. కృత్తిక, శ్రవణా నక్షత్రాలలో కుజుడు ఉంటే విశేష యోగం కలుగుతుంది.

వృశ్చిక రాశి:- కుజుడికి స్వక్షేత్రం కావటం వలన ఈ రుచక మహా పురుష యోగం ఉంటుంది. కానీ కుజుడు ఈ రాశిలో ఉంటే సాధారణ యోగం కలుగుతుంది.

మకరాశి:-లగ్నమైన మకర రాశిలో గాని, చతుర్ధమైన మేష రాశిలో గాని కుజుడు ఉంటే ఈ రుచక మహా పురుష యోగం కలుగుతుంది.

కుంభరాశి:- దశమ స్ధానమైన వృశ్చికంలో కుజుడు ఉంటే ఈ రుచక మహా పురుష యోగం కలుగుతుంది.

రుచక మహా పురుష యోగం ఫలితాలు

జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానము లలో కుజుడు స్వక్షేత్రము న గానీ, ఉచ్చ స్థానము లో గానీ ఉన్నప్పుడు రుచక మహా పురుష యోగం ఏర్పడును. ఇటువంటి యోగములో పుట్టిన వారు ఉన్నత పదవులను పొందెదరు. అధికారులు అగుదురు, సైన్యాధ్యకులు గా సైన్యమునకు ఆధిపత్యము వహింతురు. విద్యుత్తు రంగములో పెను మార్పులను తీసుకురాగలరు. రక్షణ శాఖల యందు, ఇంజనీరింగు శాఖల లోను, ఉన్నత అధికారమును పొందుతారు. పెద్ద, పెద్ద వైద్యులు గా పేరు పొందుటయే కాక శస్త్ర చికిత్స నిపుణులు గా పేరు గాంచెదరు.

రుచక మహా పురుష యోగం ఏర్పడిన జాతకులు పొడవైన ముఖం కలిగి ఉంటారు. శత్రువులపై విజయం సాదించే ధైర్యవంతులు, మంచి ధనాదాయం కలిగి ఉంటారు. బలమైన నాయకత్వం కలవారు, ఇతరులు గర్వింపబడేవారుగా పేరు తెచ్చుకుంటారు. ప్రతి పనిలో నాయకత్వ బాద్యతలు స్వీకరిస్తారు. ప్రతి పనిలో విజయం సాదించాలనే పట్టుదల కలవారుగా ఉంటారు.

మానసాగరి ప్రకారం ఈ రుచక మహాపురుష యోగజాతకులు దీర్ఘాయుష్మంతులు, సౌందర్యవంతులు, అధిక రక్త బలం కలిగి ఉంటారు.సాహస వంతులు, కార్యసిద్ధి కలవారు, నల్లని కేశ సంపద కలిగి ఉంటారు. మంత్రోపాసకులు, ఉత్తమమైన కీర్తిమంతులు, పూజా కార్యక్రమాలలో చురుకుగా ఉంటారు. ముఖం మీద గాని తల మీద గాని దెబ్బ తగిలిన చిహ్నాలు కలవారు అవుతారు.        

భద్ర మహా పురుష యోగం

భద్ర మహా పురుష యోగం ద్వి స్వభావ రాసుల వారికి మాత్రమే ఏర్పడుతుంది.

మిధున రాశి:- మిధునరాశిలో బుధుడు ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది. కన్యారాశి చతుర్ధం స్ధానం కావటం వలన బుధుడు ఈ స్ధానంలో ఉంటే భద్ర మహా పురుష యోగం ఏర్పడుతుంది.

కన్యారాశి:- కన్యారాశిలో బుధుడు ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది. దశమ స్ధానమైన మిధునంలో బుధుడు ఉన్నా భద్ర మహా పురుష యోగం ఏర్పడుతుంది.    

ధనస్సు రాశి:- సప్తమమైన మిధున రాశి లో బుధుడు ఉన్నా ఈ యోగం ఏర్పడుతుంది. దశమమైన కన్యా రాశిలో బుధుడు ఉన్నా భద్ర మహా పురుష యోగం ఏర్పడుతుంది.    

మీనరాశి :- చతుర్ధ స్ధానమైన మిధున రాశిలో బుధుడు ఉన్నా ఈ యోగం ఏర్పడుతుంది. సప్తమమైన కన్యారాశిలో బుధుడు ఉన్నా భద్ర మహా పురుష యోగం ఏర్పడుతుంది.    

భద్ర మహా పురుష యోగ ఫలితాలు

జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానములలో బుధుడు స్వక్షేత్రమున గానీ, ఉచ్చ స్థానములో గానీ ఉన్నప్పుడు భద్ర మహా పురుష యోగము ఏర్పడును. ఇట్టి యోగమున జన్మించిన మానవులు గణిత శాస్త్రము నందు మేధావులు, ఆర్ధిక శాస్త్ర నిపుణులు అగుదురు. వీరు బ్యాంకుల యందును, ఆర్ధిక సంస్థలలోనూ ఉన్నత పదవులు అలంకరింతురు. పండితులుగా రాణింతురు. పూజ్యత, ధన సమృద్ధి కలిగినవారు. మంచి ప్రతిభ కలిగి ఉంటారు. భుజ సామర్ధ్యం కలవారు. మంచి నడవడిక కలగి ఉంటారు. చక్కని వాక్ శుద్ధి కలవారు అవుతారు. మంచి విద్యావంతులుగా పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. చక్కని విచక్షణ కలిగి ఉంటారు. విషయ పరిజ్ఞానం కలిగి ఉంటారు.

మానస సాగరి ప్రకారం శారీరక ద్రుడత్వం కలవారు అవుతారు. విశాల వంతమైన హృదయం కలవారు అవుతారు. 80 సంవత్సరాలు ఆయుర్ధాయం కలిగి ఉంటారు.

ఫలధీపిక ప్రకారం భద్ర మహా పురుష యోగ జాతకులు దీర్ఘాయుష్మంతులు కలిగి ఉంటారు. కుశలమైన బుద్ధి కలిగి ఉంటారు. స్వచ్చమైన మనస్సు కలిగి ఉంటారు. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. ఇతరుల నుండి ప్రశంసలు పొండటమే కాకుండా గొరవాలను పొందుతారు. దారాళంగా చక్కగా మాట్లాడే వారుగా పేరు తెచ్చుకుంటారు. మంచి ధనాభిదృద్ధి కలిగి ఉంటారు.

హంస మహా పురుష యోగం

హంస మహా పురుష యోగం గురుగ్రహం వల్ల ఏర్పడుతుంది. చర, ద్విస్వభావ రాశులకు మాత్రమే హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది.

మేష రాశి :- చతుర్ధ స్ధానమైన గురువు కర్కాటకం లో ఉచ్చ స్ధానంలో ఉన్నప్పుడు ఈ హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది. ఈ రాశిలో గురువు పునర్వసు నక్షత్రంలో ఉంటే ఇంకా మంచిది.

మిధునరాశి :- సప్తమ స్ధానమైన ధనస్సు రాశిలో గురువు ఉన్నప్పుడు ఈ హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది. దశమ స్ధానమైన మీన రాశిలో స్వక్షేత్రంలో ఉన్న హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది.  సప్తమ స్ధానంలో గురువు ఉండటం వలన లగ్నం పై గురు దృష్టి ఉండటం వలన చాలా దోషాలు తగ్గుతాయి. గురువు ఉన్న స్ధితి కన్నా దృష్టి మంచిది.

కర్కాటక రాశి :- లగ్నంలో గురువు ఉచ్చ స్ధానంలో ఉండటం వలన ఈ హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది. గురువు ఈ రాశిలో పునర్వసు, పుష్యమి నక్షత్రాలలో ఉంటే ఇంకా మంచిది. గురువు ఈ స్ధానంలో ఉండటం వలన సర్వ సౌఖ్యాలు కలుగుతాయి కానీ సంతాన యోగం ఉండదని కొంతమంది అభిప్రాయం.

కన్యారాశి:- ధనస్సు రాశి చతుర్ధ స్ధానం కావటం వలన గురువు ఈ స్ధానంలో ఉన్నప్పుడు ఈ హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది. సప్తమ స్ధానమైన మీనంలో స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది.చతుర్ధంలో ఉన్నప్పుడూ ఉన్నత విద్యా, సప్తమ స్ధానంలో ఉంటే సంసార సుఖం కలుగుతాయి.

తులా రాశి:- దశమ స్ధానమైన కర్కాటకంలో గురువు ఉచ్చ స్ధానంలో ఉండటం వలన హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది.

ధనస్సు రాశి:- లగ్న స్ధానమైన ధనస్సు రాశిలో స్వక్షేత్రంలో గురువు ఉన్నప్పుడు ఈ హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది. స్వక్షేత్ర స్ధానమైన మీన రాశిలో గురువు ఉండటం వలన ఈ హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది. గురువు ఉత్తరాషాడ, పూర్వాభాద్ర నక్షత్రాలలో ఉంటే ఇంకా మంచి ఫలితాలను ఇస్తాడు.

మకరరాశి:- సప్తమ స్ధానమైన కర్కాటకంలో గురువు ఉచ్చ స్ధానంలో ఉండటం వలన  హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది.

మీన రాశి:- లగ్న స్ధానమైన మీన రాశిలో గురువు స్వక్షేత్రంలో కావటం వలన ఈ హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది. దశమ స్ధానమైన ధనస్సు రాశి గురువుకి స్వక్షేత్రం కావటం వలన ఈ హంస మహా పురుష యోగం ఏర్పడుతుంది.

హంస మహా పురుష యోగ ఫలితాలు

జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానములలో గురుగ్రహం స్వక్షేత్రమున గానీ, ఉచ్చ స్థానములో గానీ ఉన్నప్పుడు హంస మహా పురుష యోగము ఏర్పడును. ఇలాంటి యోగమున పుట్టిన మానవులు, దయా గుణము కలవారు, ధర్మ స్వభావము కలవారు, పండితులు, పరోపకారము చేయువారు. రాబోయే తరాల వారికి కలుగు మేలును గురించి నూతన విషయములను కనిపెట్టువారు, దైవత్వము కలవారు, గొప్ప అధికారము కలిగి ఉన్నత స్థానములను పొందుదురు.

హంస మహా పురుష యోగం గురు గ్రహం వల్ల ఏర్పడుతుంది. హంస మహా పురుష యోగ జాతకులు మంచి సుగుణాలు కలిగి ఉంటారు. మంచి ధార్మిక స్వభావం కలిగి ఉంటారు. దయా గుణం కలిగి ఉంటారు. మంచి విద్యావేత్తలుగా పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. వాక్ ఫటిమ కలిగి ఉంటారు. సర్వ సౌఖ్యాలు పొందుతారు. మంచి శరీర ఆకృతి కలిగి ఉంటారు. ధార్మిక స్వభావం కలిగి ఉంటారు. ధైవ భక్తి కలిగి ఉంటారు.

మాళవ్య మహా పురుష యోగం

మాళవ్య మహా పురుష యోగం శుక్రగ్రహం వలన ఏర్పడుతుంది. ఈ మాళవ్య మహా పురుష యోగం చర, స్ధిర రాసుల వారికి మాత్రమే ఏర్పడే యోగం.

మేషరాశి:- సప్తమాధిపతి శుక్రుడు సప్తమమైన తులా రాశిలో వుంటే ఈ మాళవ్య మహా పురుష యోగం ఏర్పడుతుంది.

వృషభ రాశి:- లగ్నస్ధానమైన వృషభ రాశిలో శుక్రుడుంటే ఈ మాళవ్య మహా పురుష యోగం ఏర్పడుతుంది. వృషభరాశికి శుక్రుడు షష్ఠాధిపత్యం వల్ల ఈ మాళవ్య మహా పురుష యోగం సాధారణమైన ఫలితాలను ఇస్తుంది.

 కర్కాటక రాశి:-  చతుర్ధస్ధానమైన తులారాశిలో శుక్రుడుంటే ఈ మాళవ్య మహా పురుష యోగం కలుగుతుంది.

సింహ రాశి:-  దశమస్ధానమైన వృషభ రాశిలో శుక్రుడుంటే ఈ మాళవ్య మహా పురుష యోగం ఏర్పడుతుంది. సింహా రాశి వారికి దశమ స్ధానంలో శుక్రుడు ఉంటే స్వశక్తివల్ల పైకి వస్తారు.

 తులారాశి:-  లగ్నస్ధానంలో శుక్రుడుంటే ఈ మాళవ్య మహా పురుష యోగం ఏర్పడుతుంది. శుక్రుడికి వృషభరాశి అష్టమాధిపత్యం వల్ల ఈ మాళవ్య మహా పురుష యోగం సాధారణమైన ఫలితాలను ఇస్తుంది.

 వృశ్చిక రాశి:-  సప్తమస్ధానమైన వృషభ రాశిలో శుక్రుడుంటే ఈ మాళవ్య మహా పురుష యోగం ఏర్పడుతుంది.

మకర రాశి :- దశమస్ధానమైన తులా రాశిలో శుక్రుడుంటే ఈ మాళవ్య మహా పురుష యోగం కలుగుతుంది. దశమంలో శుభగ్రహానికి కేంద్రాధిపత్యదోషం ఏర్పడినా, శుక్రునికది మూలత్రికోణం కావడం వల్ల దోషఫలితం తగ్గి వృత్తిలో ఎదగడం, గౌరవమర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలు పొందడం జరుగుతుంది.

కుంభ రాశి :- చతుర్థస్థానమైన వృషభ రాశిలో శుక్రుడుంటే ఈ మాళవ్య మహా పురుష యోగం ఏర్పడుతుంది. ఈ యోగ జాతకులు పరిపుష్టి గల దేహం కలవారు, వాహనాలు కలవారు, ధనవంతులు, భార్యా సంతానం కలవారు, అదృష్టశాలి, అభివృద్ధి కలవారు, సుఖాసన పరులు, ప్రసన్నమైన పంచేంద్రియాలు కలవారౌతారు.

 మాళవ్య మహా పురుష యోగా ఫలితాలు

జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానములలో శుక్రుడు స్వక్షేత్రమున గానీ, ఉచ్చ స్థానములో గానీ ఉన్నప్పుడు మాలవ్య మహా పురుష యోగము ఏర్పడును. ఈ యోగములో పుట్టిన వారు కళా రంగమును అభివృద్ది చేయువారు, గొప్ప కళాకారులుగా పేరు సంపాదింతురు. మంచి గృహ యోగము కలిగి సర్వ సుఖములు అనుభవింతురు. భోగములు అనుభవించు వారు ఆభరణ ప్రేమికులు, మృదు స్వభావి. సంగీత, సాహిత్య రంగములలో, నటనా రంగములలో విశేష గుర్తింపు పొందెదరు.

సారావళి ప్రకారం దీర్ఘాయుష్మంతులు, సంసార జీవితం బాగుంటుంది. మంచి ధనాదాయం కలవారవుతారు. వాహనయోగం, గృహ యోగం కలవారు అవుతారు. స్థూలమైన అధరాలు కలవారు, సమశరీరాకృతి కలవారు, ఆజానుబాహులు, 70 ఏళ్ళు జీవించేవారవుతారు.

శశక మహాపురుష యోగం

శశక మహా పురుష యోగం శని గ్రహం వల్ల ఏర్పడుతుంది. శశక మహా పురుష యోగం చర, స్థిర రాశులవారికి మాత్రమే ఏర్పడే యోగం.

మేష రాశి :- సప్తమస్ధానమైన తులరాశిలో ఉచ్చస్ధానంలో శనిగ్రహం ఉన్నా, దశమస్ధానమైన మకరరాశిలో స్వక్షేత్రంలో శనిగ్రహం ఉన్నా ఈ శశక మహా పురుష యోగం ఏర్పడుతుంది.

 వృషభ రాశి : -దశమ స్ధానమైన కుంభరాశిలో శనిగ్రహం ఉంటే ఈ శశక మహా పురుష యోగం ఏర్పడుతుంది. వృషభ రాశికి దశమ స్ధానమైన కుంభరాశిలో శనిగ్రహం ఉంటే రాజకీయంగా రాణించే అవకాశాలు ఉంటాయి.

 కర్కాటకరాశి : -శని తులరాశిలో చతుర్థంస్ధానంలో ఉన్నా, మకరరాశిలో సప్తమంస్ధానంలో ఉన్నా ఈ శశక మహా పురుష యోగం కలుగుతుంది. శనిగ్రహం విశాఖ నక్షత్రంలో ఉంటే ఫలితాలు మామూలుగా ఉంటాయి.

 సింహ రాశి :- సప్తమస్ధానమైన కుంభ రాశిలో శనిగ్రహం ఉంటే ఈ శశక మహా పురుష యోగాన్ని కలిగిస్తాడు.

తులా రాశి :- లగ్న స్ధానంలోనూ, చతుర్థస్ధానమైన మకర రాశిలోనూ శనిగ్రహం ఉంటే ఈ శశక మహా పురుష యోగం ఏర్పడుతుంది.

వృశ్చిక రాశి : చతుర్థస్ధానమైన కుంభంరాశిలో శనిగ్రహం ఉంటే ఈ శశక మహా పురుష యోగం పడుతుంది. శనిగ్రహం ఈ  రాశిలో ఉన్నప్పుడు సాధారణమైన యోగఫలితాలనే పొందుతాడు.

 మకర రాశి:- లగ్నస్ధానమైన మకర రాశిలో గాని, దశమస్ధానమైన తులా రాశి లో ఉచ్చలో గాని శనిగ్రహం ఉంటే ఈ శశక మహా పురుష యోగం ఏర్పడుతుంది.

 కుంభ రాశి:-  లగ్న స్ధానంలో శనిగ్రహం ఉన్నప్పుడే ఈ శశక మహా పురుష యోగం ఏర్పడుతుంది. ఈ శశక మహా పురుష యోగం పరిపూర్ణంగా అనుభవంలోకి రావడానికి శనికి గురు లేదా శుక్రుల సంబంధం ఉండాల్సి ఉంటుంది.

శశక మహా పురుష యోగ ఫలితాలు

జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానములలో శనిగ్రహం స్వక్షేత్రమున గానీ, ఉచ్చ స్థానము లో గానీ ఉన్నప్పుడు శశక మహా పురుష యోగము ఏర్పడును. ఇటువంటి యోగమున జన్మించిన మానవులు సాధారణ కుటుంబములో జన్మించిన వారైనా జీవితములో అత్యునత స్థాయిని పొందగలరు. వీరు స్వయంశక్తితో ఉన్నత శిఖరములను అధిరోహించెదరు. ఇట్టి వారు రాజకీయము లందు రాణింతురు. ఈ యోగ ప్రభావముచే ఉహించని విధంగా ఉన్నత పదవీ యోగము కలుగును. వీరు విశేష ధనమును పొంది భోగ భాగ్యములను అనుభవింతురు. పెద్ద పెద్ద పరిశ్రమలను స్థాపించి వ్యాపార వేత్తలుగానూ, విశేష కీర్తిని సంపాదిస్తారు.

శశక మహా పురుష  యోగ జాతకులు సర్వజనానురక్తులు, సేవాపరాయణులు, బలశాలి, గ్రామపెద్ద లేదా రాజు అయినప్పటికీ కొంత చెడు ప్రవర్తన, పరధనభోగం, సుఖపడేవారు అవుతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...