గ్రహమైత్రీ విశ్లేషణ - గ్రహరాజ్యం
జ్యోతిష శాస్త్రంలో గ్రహానికి, గ్రహానికి మధ్య విరోధం, మైత్రి, ఉదాసీనత అనే సంజ్ఞలు ఉన్నాయి. ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. అవి నైసర్గిక మైత్రి, తాత్కాలిక మైత్రి. నైసర్గిక మైత్రి అంటే స్వభావ సంబంధమైన మైత్రి. నైసర్గిక మైత్రిని పరిశీలించే ముందు గ్రహాల స్వభావాన్ని పరిశీలిద్దాం.
రవి: న్యాయ రక్షుడైన ప్రభువు. ఇతని స్వరాశి అయిన సింహ లగ్న జనితులు ధర్మం విషయంలో స్వపరబేధం లేకుండా ప్రవర్తిస్తారు.
చంద్రుడు: సున్నిత స్వభావం గల రాజు. వీరిలో కొన్ని దుర్లక్షణాలు కూడా ఉంటాయి. ఇతరులు చెప్పింది వినడం, నిశ్చయాత్మకత లేకుండడం, చంచల స్వభావం కలిగి ఉండడం మొదలైనవి వీరి లక్షణాలు.
కుజుడు: న్యాయబద్ధుడైన సేనాని. ఇతని పట్టుదల మూర్ఖపు పట్టుదలగా భాసిస్తుంది. సేనానాయకునికి ఆలోచన కంటే పట్టుదల అధికంగా ఉంటుంది.
బుధుడు: సమయానుకూలంగా నడిచే వ్యవహార కుశలుడైన, లౌక్యంగల (న్యాయ ప్రాముఖ్యం లేని) వ్యాపారస్తుడు.
గురుడు: న్యాయబద్ధుడై, గౌరవ ప్రాధాన్యం గల గురువు లేదా న్యాయాధీశుడు, న్యాయవాది లేక మంత్రి.
శుక్రుడు: న్యాయబద్ధత కంటే వ్యవహారంలో విజయం సాధించడం ముఖ్యమనే పట్టుదల గల మంత్రి లేదా వ్యవహారంలో విజయం సాధించే కుశలతగల న్యాయవాది.
శని: సేవకుడు, ఇతని స్వభావంలో చిన్నచిన్న మోసాలు, దోషాలు కావు. మోసగించకపోతే బ్రతుకే నడవదని అనుకుంటాడు. బద్ధకస్తుడు. చురుకుదనం లేనివాడు, పనిదొంగ. బాధ్యతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు.
ఈ స్వభావాలన్నీ గ్రహమండలాలవని కాదు, ఆ గ్రహమండల కాంతులు ఏ జాతకంలో బలం, ప్రాముఖ్యత కలిగి ఉంటాయో... ఆ జాతకునివి అని గ్రహించాలి. ఇప్పుడు ఈ గ్రహాల మైత్రిని పరిశీలిద్దాం.
రవి...
చంద్ర, కుజ, గురులు - మిత్రులు.
శని, శుక్రుడు - శత్రువులు.
బుధుడు - సమానమైనవాడు.
రవిని న్యాయబద్ధుడైన రాజుగా గుర్తించాం. రాజు సాటి రాజు ఎలాంటివాడైనా మైత్రి తప్పదు. చంద్రుడు దుర్మార్గుడైన రాజు కాదు. సున్నిత స్వభావం గలవాడు మాత్రమే. కాగా అతనితో మైత్రి ఉంది. ప్రభువుకు, సేనానాయకుడికి మైత్రి తప్పదు. కార్యసాధనకు అవసరమైన పట్టుదల, న్యాయబద్ధత కుజునిలో ఉన్నాయి. కాబట్టి అతనితో మైత్రి తప్పనిసరి.
గురుడు న్యాయబద్ధుడైన మంత్రి కాబట్టి ఆలోచనా కుశలత అధికంగా ఉంటుంది. కావున గౌరవానికి ప్రాముఖ్యం ఇస్తూ... స్వార్ధానికి ప్రాధాన్యమీయడు. అందువల్ల గురుడు రవికి మిత్రుడు. సాధారణంగా ఇలాంటి ప్రవర్తన గలవారు ప్రభువుల ఆదరణకు పాత్రులవుతారు.
శని మోసగించే స్వభావం గలవాడు. రవి న్యాయరక్షకుడైన ప్రభువు కాబట్టి ఏ కొద్ది మోసానై్ననా సహించలేడు. ఇతడు సూర్యుని కుమారుడని ప్రసిద్ధి. న్యాయరక్షకుడైన తండ్రి కుమారుని మోసాన్ని కూడా సహించలేడు. మేధావులు మాత్రం చిన్నవారి చిన్న చిన్న దోషాలను ఉపేక్షిస్తారు. గురువుకు శని సమానమైనవాడు.
శుక్రుడు స్వార్ధయుక్తుడైన మంత్రి, న్యాయానికి ప్రాముఖ్యం లేనందువల్ల ఇతడు రవికి విరోధి అయినాడు.
బుధుడు వ్యాపారస్తుడు. వ్యాపారస్తునిలో స్వార్ధం ఉంటుంది. కాని, వ్యాపారస్తుని మూలంగా రాజ్యానికి ధనలాభం కూడా ఉంటుంది. కావున ప్రభువు ఇతనితో విరోధం పెట్టుకోడు. అలా అని స్నేహం చేయలేడు. ఇతనిలోని స్వార్ధం స్నేహాన్ని చూసినప్పుడు ప్రకోపిస్తాయి. కాని, గురుడు, బుధుడిని విరోధిగానే చూస్తాడు. మేధావులు ఎక్కువమంది ప్రజలకు అపకారం కలిగించేవాని మోసాన్ని సహించలేరు.
శని మోసగాడైనా... అతని మోసం స్వల్పం. అది బహిర్వ్యక్తమ య్యేటటువంటిది. బుధుని మోసం బహిర్వ్యక్తం కానటువంటిది. అందువల్ల రాజు (రవి) కు అతనిపై విరోధభావన లేదు. మేధావి అయిన గురునికి ఈ విషయం తెలుసు. బుధుని మోసం బహిర్వ్యక్తం కానందువల్లనే... అధిక ఇబ్బంది ఉన్నదని గుర్తించిన మేధావి (గురుడు) అతన్ని ఉపేక్షించలేడు.
ఇది గ్రహరాజ్యం. ఇలా పాలన సాగినచో మన రాజ్యం కూడా రామరాజ్యం కాగలదు. ఇది ఆదర్శవంతమైన రాజ్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి