3, నవంబర్ 2016, గురువారం

విపరీత రాజయోగాలు



విపరీత రాజయోగాలు




ఉత్తర కాలామృతం ప్రకారం 6-8-12 అధిపతులు నైసర్గికత్వంతో సంబంధం లేకుండానే అంటే శుభులైన, పాపులైన 6-8-12 భావాలలో ఉంటే రాజయోగాన్నిస్తారు. 6-8-12 భావాధిపతులు అందరు కలసి గాని, విడివిడిగాగాను 6-8-12 రాశులలో ఎక్కడ ఉన్న విపరీత రాజయోగం పడుతుంది. వీరి కలయిక కూడా శుభమే. ఆదిపత్య విషయంలోనూ, శత్రు, మిత్ర రాశులలో ఉన్నారా అనేది చూడనక్కరలేదు. జాతకచక్రంలో విపరీత రాజయోగాన్ని పొందిన జాతకుడు 6-8-12 భావాధిపతుల దశ, అంతర్ధశలలో ఉద్యోగంలో ఉన్నతి, గొప్ప పేరు ప్రతిష్ఠలు, ప్రభుత్వంలో మంచి పలుకుబడి, సౌఖ్యాలు పొందుతాడు. 


మంత్రేశ్వరుని ఫలదీపికలోని  6-8-12 భావాల విషయంలో భావఫలితాలు ఈ క్రింది విధంగా విశేష యోగాలు ఉంటాయని తెలియజేశారు. 

హర్షయోగం
6 భావంలో 6-8-12 భావాధిపతులు ఎవరైనా ఉన్న లేక వారిలో ఎవరైనా 6 వ భావాన్ని చూసిన లేక 6 వ భావాధిపతి 6-8-12 స్ధానాలలో ఎక్కడైనా ఉన్న ఆ జాతకునికి హర్షయోగం సిద్ధిస్తుంది. హర్షయోగ జాతకుడు సుఖం, సంతోషాలు కలిగి  అదృష్టవంతుడవుతాడు. శత్రువులపైన విజయాలు పొందువాడుగాను, చెడు వ్యసనాలు, చెడు కార్యాలపైనా ఆసక్తి లేనివాడుగాను, సంఘంలో గొప్పవారుగాను, విశేష కీర్తిని ఆర్జించు వారుగాను, కీర్తివంతులకు స్నేహితులుగాను, మంచి స్నేహితులు కలిగి ఉంటారు. సత్ సంతానాన్ని పొందుతారు. ధనార్జన కలవాడుగాను ఉంటారు. 

సరళయోగం
8 భావంలో 6-8-12 భావాధిపతులు ఎవరైనా ఉన్న లేక వారిలో ఎవరైనా 8వ భావాన్ని చూసిన లేక 8 వ భావాధిపతి 6-8-12 స్ధానాలలో ఎక్కడైనా ఉన్న ఆ జాతకునికి సరళయోగం సిద్ధిస్తుంది. సరళయోగ జాతకుడు దీర్ఘాయువు కలవాడు. నిలకడైన మనస్సు కలవాడు. బుద్ధిమంతుడు, విధ్యావంతుడు, పుత్ర సంతానం కలవాడు, శత్రువులపైన విజయం పొందువాడు. మిక్కిలి ధనవంతుడు. ఏ పని చేపట్టినా విజయం సాదించుటలో పట్టుదల కలవాడు, మంచి పేరు ప్రఖ్యాతలు, ప్రతిష్ఠలు కలవాడు అవుతాడు. 

విమలయోగం 
12 భావంలో 6-8-12 భావాధిపతులు ఎవరైనా ఉన్న లేక వారిలో ఎవరైనా 12 వ భావాన్ని చూసిన లేక 12 వ భావాధిపతి 6-8-12 స్ధానాలలో ఎక్కడైనా ఉన్న ఆ జాతకునికి విమలయోగం సిద్ధిస్తుంది. విమలయోగ జాతకుడు ధనార్జన కలవాడగును. ధనం వృధాగా ఖర్చు చేయనివాడగును. తనని నమ్ముకున్నవారిని ఆదరించేవాడగును. సుఖవంతుడగును. స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనువాడగును, గౌరవమైన వృత్తికలవాడగును. సంఘంలో గొప్పవాడగును. 

మతాంతరంలో సత్యాచార్యుని ప్రకారం 6-8-12 భావాల విషయంలో భావఫలితాలు ఈ క్రింది విధంగా ఉంటాయని తెలియజేశారు. 

6 భావం శతృభావం కాబట్టి ఆ భావంలో శుభగ్రహాలు ఉంటే శత్రువులపైనా విజయం, పాపగ్రహాలు ఉంటే శత్రువృద్ధి అనగా విరోధులు ఎక్కువగా ఉంటారు. 

8 భావం మృత్యుభావం కాబట్టి అందులో శుభగ్రహాలు ఉంటే ఆయువృద్ధి కలుగుతుంది. పాపగ్రహాలు ఉంటే మృత్యుహాని, తీవ్రరోగం, అపాయాలు కలుగుతాయి. ఆయుష్కారకుడైన శని అష్టమ భావంలో ఉంటే ఆయువును వృద్ధి చేస్తాడు. జాతకుడు దీర్ఘాయువు కలవాడవుతాడు. “కారకోభావనాశాయ” సూత్రం ఇక్కడ వర్తించదు. 

12 భావం వ్యయభావం కాబట్టి అందు శుభగ్రహాలు ఉంటే వృధా ఖర్చులు తగ్గుట జరుగుతుంది. వ్యాపార విషయంలో నష్టాలు తగ్గుట జరుగుతుంది. పాప గ్రహాలు ఉంటే అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండుట, వ్యాపార విషయంలో మిక్కిలి నష్టాలు కలుగుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...