30, ఆగస్టు 2016, మంగళవారం

పగడం (Coral)

కుజగ్రహదోష నివారణకు పగడం
              పగడానికి ప్రవాళం, విద్రుమం, అంగారకమణి, కుజప్రియా, రక్తాంగం, అబ్ధి, పల్లవ, రక్తముక్తి, లతామణి, మూంగా అని పిలుస్తారు. ప్రశస్తమైన పగడాలు అల్జీరియా, టునీషియా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్ దేశాలయందు లభ్యమగును. ఇటాలియన్ పగడం ‘Polyp’ అనే సముద్రపు జంతువు యొక్క ఎరుపు వర్ణము గల అస్ధి పంజరం. దీనిని ప్రవాళ స్పటికం అంటారు. జీవశాస్త్రంలో దాని పేరు Coraligenfous Leopyhytes. పగడమునకు అధిపతి కుజుడు. పగడం కుజునికి ప్రీతి పాత్రమయినది.


పగడం సముద్రంలో ‘జెల్లీ’ అనే ఒక పురుగు వలన లభించును. ఆ పురుగు యొక్క ‘పురీషం’గట్టిపడి పగడం తయారగును. సముద్రపు తీరములకు దగ్గరగా సంచరించు ఈ పురుగులు స్రవించే పదార్ధం మరియు సముద్రం నీటిలో గల కాల్షియం కార్బొనేట్ తో చర్య పొంది ఒక రకమైన కర్బన పదార్ధం తయారై అది సముద్రంలోని కొన్ని చెట్లకు అంటుకొని పగడపు దీవులుగా రూపాంతరం చెందుతాయి. చిన్నవిగా ఉండి రాళ్ళపై, ఇసుక దిబ్బలపై తిరుగుచుండును. ఈ పురుగుల శరీరంపై జిగురు వంటి పదార్ధం పూటవలె వచ్చి గుంపులు గుంపులుగా ఉండును. ఈ పురుగులపై ఉండే స్రవములు పగడంగా తయారై సముద్రపు పోటులకు ఒడ్డుకు వస్తాయి. పగడపు దీవులుగా పేర్కొనే దట్టమైన అడవులు గల సముద్రంలో 20 అడుగుల నుండి 1000 అడుగుల లోతులో లభ్యమయ్యే పురుగుల గుంపులు కనీసం 2,3 మైళ్ళ దూరం వరకు వ్యాపిస్తాయి. ఇవి శత్రువుల నుండి రక్షించుకొనుటకు తీగ వంటి నరాన్ని కలిగి ఉంటాయి. దీన్ని సముద్రగుర్రం తాకిన విపరీతమైన బలం వస్తుంది. పగడములు ఎక్కువుగా శ్రీలంక సముద్ర దీవుల యందు విస్తారంగా లభిస్తాయి.

పగడములో జఠరదోషం ఉన్న బుడిపెలు ఉన్న వాటిని ధరించిన కుటుంబంలో అశాంతి, మనస్పర్దలు, కలహాలు, దరిద్రం కలగటమే కాకుండా ప్రాణాపాయం సంబవించే అవకాశం ఉన్నది. ఆవుపేడ వంటి మరకలున్న కోమల దోషమున్న పగడాలు ధరించినవారికి పని యందు ఆసక్తి లేకపోవుట, కలహాలు, అశాంతి, అపజయాలు, మిత్రువులే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. మురికి తేరినట్లుగా మలిన దోషమున్న పగడాలు ధరించిన వారికి కష్టాలు, అనేక ఇబ్బందులు, ఇతరుల సహాయాలకై అర్ధించటం, అనారోగ్యాలు, అనుకున్న పనులు జరగక ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువ.

కుందేలు రక్తం వలె ఎర్రగా ఉన్న, మంకెను పువ్వు వలె సింధూర రంగు ఉన్న, దాసాని పువ్వువలె ముదురు ఎరుపుగా ఉన్న, మోదుగ, పొదిరి పుష్పాలవలె రంగు కలిగిన పగడాలు ప్రశస్తమైనవి.

       పగడం ధరించుట వలన ప్రయోజనాలు:- పగడమునకు అధిపతి కుజుడు.  దైర్యసాహాసాలు, నూతనోత్సాహం కలుగును. పోలీసు శాఖలోను, మిలటరీలలో పని చేయువారు ధరించిన ఉద్యోగములో అకస్మాత్తుగా ఉన్నత పదవులు అదిరోహించేదరు. పిల్లలకు తాయెత్తులు కట్టిన వీరికి దుష్టశక్తుల నుండి రక్షణ కలుగుతుంది. కొన్ని దేశాలలో పగడాన్ని పిల్లలకు బహుమతిగా ఇస్తారు. కుటుంబంలో ఐకమత్యం, ధనం కలుగుతాయి. స్త్రీ సౌభాగ్యం కొరకు మంగళసూత్రంలో తప్పనిసరిగా పగడం ధరించాలి. కర్మాగారాలలో పనిచేసేవారు, వాహనాలపై తరచూ ప్రయాణించేవారు, ప్రమాదాలకు దారితీయు యంత్రముల దగ్గర పనిచేసే వారు తప్పనిసరిగా  పగడం ధరించాలి. పగడాలలో త్రికోణాకృతి పగడం శ్రేష్టమైనది. కుజదోషం ఉన్నవారు, సోదర కలహాలు ఉన్నవారు, కోర్టు సమస్యలు ఉన్నవారు, అప్పుల బాధల నివారణకు,   తరచూ   అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, రిపేర్స్
జరుగుతున్నప్పుడు పగడం ధరించటం ఉత్తమం. 

ఆయుర్వేదశాస్త్రం ప్రకారం పగడాన్ని నిమ్మపండు రసంలో ఒక రోజు నానబెట్టి వేడి నీళ్ళతో కడిగి జిల్లేడు పాలలో మూడు రోజులు ఉంచి భస్మం చేసిన దానిని సేవించిన గుండెకు సంబంధిచిన వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, చెవి సమస్యలు, మూలశంకు, కుష్ఠువ్యాధులు, పచ్చకామెర్లు, నేత్రదోషాలు, సంభోగసమస్యలు, ఎర్రరక్తకణాల సమస్యలు, నయం అవుతాయి.

జాతకంలో కుజుడు లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉండి గాని, నీచ స్ధానమైన కర్కాటకరాశిలో ఉన్న, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో జన్మించిన వారు పగడం ధరించటం మంచిది. శత్రురాశిలో ఉన్న కుజదశ వచ్చినప్పుడు భూ, గృహ సంబంద, సోదర సంబంద, అప్పుల బాధలు, కోర్టు సమస్యలు, జీవితంలో చిక్కులు వస్తాయి. వివాహం జరుగుటకు సమస్యలు ఉన్నవారు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు, సంభోగశక్తిని వృద్ధి చేయుటకు పగడం ధరించాలి. పగడం ధరించేటప్పుడు “ఓం వీర ద్వజాయ విద్మహే విష్ణు హస్తాయా దీమహే తన్నో జామ ప్రచోదయాత్” అనే కుజ మంత్రం జపిస్తూ మంగళవారం రోజు కుజహోరలో  3 క్యారెట్స్ నుండి 5 క్యారెట్స్ వరకు బరువు కలిగిన పగడాన్నిఉంగరపు వేలుకు గాని, జాతకంలో కుజునిపైన గురు దృష్టి లేకున్న చూపుడు వేలుకి గాని కందులు దానం చేస్తూ ధరించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...