17, డిసెంబర్ 2016, శనివారం

నీలము స్టోన్ (Blue Sapphire)

నీలము స్టోన్

నీలము రత్నానికి ఇండ్రం, అశ్మఫారం, తృణమణి, మాసారం, సుసారం, గల్వర్కం, భోదకం అనిపేర్లు గలవు. స్పటికామ్ల జనిత లోహ జాతికి చెందినవి. ఇది శనిగ్రహానికి ప్రతీక. శని పురాణాల ప్రకారం సూర్యుడు ఛాయాదేవిల సంతానంగా చెబుతారు. ఒకసారి సూర్యుని మిగతా సంతానానికి శనిపై కోపం వచ్చి గొడవకు దిగటం. ఆ గొడవలో శనిని కొట్టటం, శని కాళ్ళకు దెబ్బ తగలటం జరుగుతుంది. దానితో శని శాశ్వతంగా కుంటుతు, నిధానంగా శ్రమపడుతూ నడుస్తూ ఉంటాడు. అందుకే శనిని మందడు, మందగమనుడు అంటారు.


ఒక్క ఎరుపురంగు తప్ప మిగిలిన రంగులన్నీ సఫైర్‌గా భావిస్తారు. తల వెంట్రుకల వంటి నల్లటి రంగు కల వాటిని ఇంద్రనీలం అని, భూమి మీద పెట్టినప్పుడు ఆ ప్రాంతమంతా నీలంగా కనపడే వాటిని మహానీలం అని, విష్ణు కాంత పుష్పాల వలె ప్రకాశించేవాటిని నీలమణి అని అంటారు. మయూర నీలం నెమలి కంఠం రంగు నీలంలో ఉంటుంది. ఇంద్రనీలం ధరించిన ఇంద్ర భోగాలు, మహానీలం ధరించిన మహాశక్తి, దరిద్రం తొలగిపోవును. నీలమణి ధరించిన కష్టాలు, నష్టాలు నశించి సుఖశాంతులు పొందగలరు.

నీలం పగిలినచో త్రాస దోషం వలన కలహాలు, కళా విహీనంగా ఉండి భిన్నదోషం వలన బంధువులతో విరోదం, నీలం లోపల పగిలి ఉన్నట్లయుతే పటలదోషం వలన కష్టనష్టాలు, నీలం లోపల ఇసుక కనపడిన ‘పాషాణ గర్భదోషం’ వలన సంతాన నష్టం, నీలమణి లోపల మెత్తని మన్ను ఉన్న‘మృద్గర్భ’అనే దోషం వలన ప్రాణ భయం, ఆపదలు, నీలం పైన రక్తపు చుక్కలు ఉన్న రక్త బిందువు దోషం వలన మరణం కలుగును. కళాహీనంగా ఉండి మలినదోషం, సహజ నీల కాంతులను వెదజల్లక వేరు కాంతులతో ఉన్న ‘విచ్ఛాయ దోషం’ ఉన్న కష్టములు కలుగును. నల్లటి మచ్చలు ఉన్న కరంజి దోషం వలన కలహాలు, తెల్లగా కళావిహీనంగా ఉన్న ‘కుక్షి దోషం’ వలన బాధలు కలుగును.

నీలం ఆవుపాలలో ఉంచి చూసిన ఆ పాలు నీలవర్ణంగా కనపడును. వీటిని‘క్షీరాగ్రాహి’ నీలం అంటారు. ఇది చాలా ప్రశస్తమైన జాతి నీలం. పచ్చగడ్డి పరకలు, ఊక, గసగసాల పొట్టు నీలంపై ఉంచి ఊదిన అవి ఎగిరిపోక నీలమును అంటిపెట్టుకొని ఉన్న ఆనీలం ‘తృణగ్రాహి’ నీలం అంటారు. కాంతులతో ప్రకాశించు నీలం ధరించిన సకల సంపదలు పొందగలరు. వజ్రం తరువాత కఠినమైనది నీలం. సానపెట్టుటకు నీలం సాధ్యం కాదు. నీలం లోపల భాగంలో ఇంద్రధనస్సు వంటి కాంతులు కలగి నీలిరంగులో కనపడిన అది ఇంద్రనీలం.      
     
నీలములు బర్మా, కాశ్మీర్, శ్రీలంక, ఆస్ట్రేలియా, కాంబోడియా దేశాలలో లభ్యమగును. ఈ రత్నములలో విద్యుచ్చక్తి వంటి శక్తి కలిగి ఉండి శనిగ్రహం నుండి లభించు శక్తిని గ్రహించి మన శరీరంలో ప్రవేశింపజేయగలవు. పుష్యరాగ నీలం, కెంపు నీలం, సిలోన్ నీలం, కాశ్మీర్ నీలం, మయూరి నీలం, కాకి నీలం ఇలా అనేరకాలు కలవు. నీలం ధరించుట వలన శరీరంలోకి శక్తి ప్రవేశించి తేజస్సు, నూతనోత్సాహం కలుగును.

ఆయుర్వేదశాస్త్రం ప్రకారం నీలం స్టోన్ గాడిద మూత్రంలో నానబెట్టి ఒకరోజు అంతయు ఎండలో ఉంచిన తరువాత వేడి నీళ్ళతో కడిగి శుద్ధి చేసి పాలకూర రసములో మూడు రోజులు ఉంచి శుద్ధి చేసిన భస్మం సేవించిన  నరముల దుర్భలత్వం, పక్షవాత రోగాలు, మానసిక రోగాలు, పైత్య వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, పిత్తం, పైత్యవ్యాధులను తగ్గించగలదు. ఎలుక కాటు వలన వచ్చే జ్వరాలు, కుష్ఠు రోగములను పోగొట్టును.

నీలం ధరించుట వలన కలుగు ప్రయోజనములు:- సంఘంలో గౌరవ మర్యాదలను కలుగజేస్తాయి. అపమృత్యు దోషాలను హరిస్తాయి. ఆకస్మిక ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది. కష్టనష్టాలు, శత్రువులు తొలగిపోవును. నీలం ధరించిన దృష్టి దోషాలు తొలగిపోవును. వేదాంతంపై ఆసక్తి కలుగును. మనస్సు ప్రశాంతంగా ఉండి స్ధిర చిత్తం కలిగి భగవంతునిపై ఏకాగ్రత పెరుగును.

జాతకంలో లగ్నానికి శని 6,8,12 స్ధానములలో ఉన్న, పుష్యమి, అనురాధా, ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళు, నీచస్ధానమైన మేషరాశిలో ఉన్న, శుభగ్రహ దృష్టి లేని శని మహాదశ, అంతర్దశలలో కష్టనష్టములు బాధలు అనుభవించు వారు, గోచారంలో ఎల్నాటిశని, అర్ధాష్టమశని, అష్టమశని ఉన్నప్పుడు జీవితంలో అనేక కష్టాలు కలగును. నీలం పొదగిన ఉంగరం ధరించిన శని భాధలు తొలగి సుఖ శాంతులు పొందగలరు.

గోచారరీత్యా శని చంద్రరాశికి 12,1,2 స్ధానాలలో ఏడున్నర సంవత్సరాలు ఉన్న ఎల్నాటిశని అంటారు. అష్టమంలో ఉంటే అష్టమశని అని, చతుర్ధంలో ఉంటే అర్ధాష్టమశని అని, సప్తమ, దశమంలో ఉంటే కంటకశని అని అంటారు. వీటివలన జీవనోపాయం, బందికాన, నీచవిద్య, వ్యసనాలు, అతి త్రాగుడు, కీళ్ళనొప్పులు, కామెర్లు, ధననష్టం, ధీర్ఘకాలిక వ్యాధులకు మందులు పనిచేయక ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి.

శ్రమకారకుడైన శని కక్ష్యా క్రమంలో మొదట ఉంటాడు కావున సూర్యోదయానికి ఒక గంట ముందు వాకింగ్ గాని, దేవాలయ ప్రదక్షణలు గాని, మేడిటేషన్ గాని చేసిన శని తృప్తి పడతాడు. నీలం దరించేటప్పుడు “ఓం శమగ్నిదగ్ని బిస్కరశ్చన్నస్తపతు సూర్యవంశం వాతో వాత్వరపా అపస్రిదః” అనే శని మంత్రాన్ని జపిస్తూ 3 క్యారెట్స్ కలిగిన నీలం
స్టోన్  మద్య వేలుకు శనివారం రోజు శని హోరలో కిలో పావు నల్ల నువ్వులు దానం చేసి ధరించవలెను. శని శ్రమ కారకుడుకావున శని వేలు అయిన మద్యవేలుకి ధరించటం ఉత్తమం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...