16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవ జీవితముపై శుక్ర గ్రహ ప్రభావ విశ్లేషణ

జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవ జీవితముపై శుక్ర గ్రహ ప్రభావ విశ్లేషణ

మానవ జీవితముపై శుక్ర గ్రహ ప్రభావము కీలకమైనది.ఎవరైనా జీవితములో సుఖపడాలని కోరుకుంటారు. కనీస అవసరాలైన తిండి, వస్త్రములు ఉండడానికి ఓఇల్లు, వంటివి శుక్రగ్రహ అనుకూల బలం జాతకములో ఉండాలి. కనీస అవసరాలనుండి రాజయోగ సమానమైన జీవన శై లికి అలాంటి జీవితాన్ని అనుభవించడానికి బహువిథాలుగా సుఖపడడానికి శుక్రగ్రహ బలమే కారణము. రాజభోగాలు అనుభవించడానికి అవసరమైన థనము, హోదా, ఇతరత్రా అన్నిస్థితులూ జాతకునికి ఉండవచ్చు.ఉండడం వేరు.అనుభవించడం వేరు.అన్నీ ఉన్నవాళ్ళు సౌఖ్యాన్నిఅనుభవిస్తున్నారా?.అంటే లేదు. కోటీశ్వరులై ఉండి చద్దికూడు తిని చాపమీద పడుకునే వాళ్ళున్నారు. ఉండి కూడా అనుభవించలేని స్థితి. పిసినారితనం శుక్ర గ్రహ వ్యతిరేక ప్రభావం వల్లనే ఏర్పడుతుంది. వాళ్ళు తినరు ఇంకొకళ్ళకు పెట్టరు. రాజభవనము లాంటి భవంతి ఉండి లైట్లన్నీ ఆర్పివేసి చిన్న బల్బుతో కాలక్షేపము చేస్తారు. ప్రొద్దున వండిన అన్నాన్ని కాస్త వేడిచేసి తిని రాత్రిపూట భోజనము అయిందనిపిస్తారు.

శుక్రగ్రహము ఇచ్చే ఫలితములలో స్పష్టముగా గ్రహించవలసినది తనకున్న గొప్పస్థితిని జాతకుడు లేక జాతకురాలు అనుభవిస్తున్నారా? లేదా ? అనునది ప్రపరిశీలించవలసిన విషయము. రాజభోగాలు, సౌఖ్యాలు పొందేమార్గాలు, విలాస వంతమైన జీవితము, రాజకీయ అథికార దర్పం, వివిథ సుందరాంగులతోచేరి సుఖించుట, సింగపూర్ లో కాఫీతాగి మలేషియాలోమథ్యాహ్నము భోజనము చేసి మరో దేశములో రాత్రికి భోజనము చేసి విశ్రమించుట ఇలాంటి జీవితము విలాస వంతమైనదని నేటి సమాజము భావిస్తుంది. శుక్రగ్రహ అనుకూల ప్రభావము వలన ఇలాంటి జీవితము లభిస్తుంది.

ఏ.సి కార్లు, ఏ.సి భవంతులు, చక్కటి ఆరోగ్యం, పంచభక్ష్య పరమాన్నముతో భోజనము, రక రకములైన పండ్లరసములను సేవించుట, ఖరీదైన వివిథ రకముల పరిమళములను, సుగంథాలను వెదజల్లే సెంట్లు, విశాలమైన తోట, ఇంటి ప్రాంగణములోనే ఈత కొలనులు, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన వ్యయామాలు, అడుగడుగునా సౌఖ్యవంతమైన జీవితము, అత్యంత విలాసవంతమైన ఆథునిక సామగ్రి, వెలకట్టలేని ఆభరణాలు, ప్రియమైన సంగీతం వినుట యందు ఆసక్తుడై మైమర చిపోవుట, ఆజ్ఞలను యథాతథముగా అమలు చేయడానికి తద్వారా దేశవిదేశాలలోని ఉపయుక్త మైన అరుదైన నానావిథ వస్తు వాహనాలతో, ఇంకనూ అవసరమైన వాటిని కొనగల థనము, ఎదురు లేని తిరుగులేని అవాంతరములేని ప్రయాణాలు, భోగవంతమైన జీవితము, భాగ్యవంతుడిగానే కాక కోట్లాది మంది ప్రజల ఆరాథ్యదైవమై నిత్యసంతోషిగా వెలుగొందడానికి కారకుడు శుక్రగ్రహమే.
ఇప్పుడు తెలియచేసిన ఫలితాలు జాతకునికి లేక జాతకురాలికి ఇతర గ్రహములవల్ల కూడా సంభ వించవచ్చు.కానీ వాటిని ఆస్వాదించి,
అనుభవించడానికి కావలిసినది అనుకూలమైన శుక్ర గ్రహ ప్రభావమే ముఖ్యమైనది.

మానవజీవితములో సుఖానికి, సౌభాగ్యానికి, విలాస వైభోగాలకు, సంసార జీవితానికి, దా పత్య సౌఖ్యానికి, భార్యాభర్తల అన్యోన్యతకు శుక్రుడే ప్రథానమైన నిర్ణయాత్మక గ్రహము. సుఖపడడానికి శుక్రుడే కారణము. ఎంత కష్టపడినా సుఖపడలేక పోవడము కూడా శుక్రగ్రహకారకత్వమే. శుక్రుడు జాతకంలో బాగాలేనప్పటి స్థితిలో ఈ రకమైన అసౌకర్యానికి దారితీస్తుంది. విలువైన,విలాస వంతమైన వస్త్రాలు థరించి, వివిథ భాషల్లో పరిజ్ఞానము కలిగి, విలువైన ఆభరణాలు థరించి రక రకాల వాహనాల్లో తిరిగే వైభవము శుక్ర గ్రహ అనుకూలత వల్లే జరుగుతుంది.నాటకాల్లో నేర్పు కలిగి, చక్కని కంఠస్వరము కలిగి టీవి, సినిమా, నాటక రంగములలో అందరినీ మెప్పించగల సామర్థ్యము, రాణించడానికి, కీర్తిప్రతిష్టలకు కూడా శుక్రుడే కారకుడు. నాటక రంగములో,టీ.వీ రంగములో, చలన చిత్ర రంగములో ప్రఖ్యాతి గాంచడానికి శుక్రగ్రహమే కారణము. శుక్రగ్రహ అనుకూల ఫలితాలే ముఖ్య కారణము.

శుక్ర గ్రహము అనుకూలస్థితి వలన సామాన్య మానవుడు భోగపురుషుడు అగుచున్నాడు. గోచీగుడ్డకు గతిలేని వాళ్ళు వెలకట్టలేని వస్త్రాలను థరించుచున్నారు. కట్టినబట్ట కట్టకుండా విలాసముగా జీవిస్తున్నారు. ఏదైనా వివాహమో, వేడుకకో అయితే తెలిసినవాళ్ళను అడిగి ఆ పూటకు మంచిచీర, ఆభరణాలు అరువు తెచ్చుకుని థరించి ఆ కార్యక్రమమును వెళ్ళబుచ్చుకున్నవారు, లక్షలు విలువ చేసే ఆభరణాలు, వేలాది రూపాయలు ఖరీదుచేసే చీరలను ప్రతిరోజూ థరిస్తున్నారు. ఇదంతా శుక్ర గ్రహ అనుకూల ప్రభావమే. నడమంత్రపు సిరికి కూడా ఈ గ్రహ అనుకూల స్థితే కారణము.

ప్రేమ సాఫల్యానికి, స్త్రీ జన ఆకర్షణకు ముఖ్య గ్రహము శుక్రుడే. పరస్త్రీ వ్యామోహానికి, రహస్యమైన స్త్రీ సంబంథాలకు ,ద్వితీయ వివాహానికి, విడాకులకు శుక్రుడే కారకుడు. జీవితములో అదృ ష్టము స్త్రీవల్ల గానీ, ప్రత్యక్షముగా కానీ, పరోక్షముగా కానీ సంభవించడానికి శుక్ర గ్రహ అనుగ్రహమే కారణము. వివాహానంతరము వైవాహిక జీవితం సుఖప్రదముగా ఉంచడానికి ,అపూర్వ సౌందర్య వంతులతో పొందు, ఖరీదైన మద్యం సేవించుట, దీర్ఘకాల రాజకీయ అథికారప్రాప్తి, సుగంథ పరిమళాలు వ్యాపించే ప్రదేశాలలో జీవించుట, ఖరీదైన భవంతులలో నివసించడానికి కారణం శుక్రుడే. నలగని బట్ట, సెంట్లువాడే అలవాటు, భోగాలు అనుభవించుట శుక్రగ్రహ ఫలితాలే, కూతురు పట్ల విశేష మైన ప్రేమ, దాంపత్యములో తప్పుచేసి భార్యను ఒప్పించి సంసారాన్ని నిలబెట్టుకోవడము కూడా ఈ గ్రహము ఇచ్చే ఫలితాలే.

మానవుడు విలాసవంతమైన జీవితం గడపడానికి, స్త్రీ,వివాహ సౌఖ్యానికి, సుఖనిద్రకు, ఖరీదైన విలాసవస్తువుల సేకరణ, అథునాతనమైన భవంతి, బహు వాహనములు, ఎండ వేడిమి తెలియకుండా దశాబ్దాల జీవితము గడుపుట, నూతన వస్త్రములు, నవ నాగరికతకు, తగినట్లుగా వేష భాషలు, సౌందర్య ఆరాథన, ఇలాంటివన్నీ శుక్రగ్రహ ఆథీనములో ఉండును. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ ఐహిక సుఖకారకుడు శుక్రుడు. జాతక చక్రములో శుక్రుడు తానున్న స్థితిననుసరించి తన మిత్ర గ్రహములైన శని, బుథ, రాహువుల ననుసరించి తన ప్రభావాన్ని తన యోగాన్ని జాతకునకు ఇస్తాడు. పురుష జాతకములో భార్యను సూ చించును.

శుక్రగ్రహ జాతకులు తమ జీవితమందు స్త్రీలకు అత్యంత ప్రాథాన్యతనిచ్చెదరు. వీరి జీవితములో యోగ, అవయోగములు ప్రథానమైన సంఘటనలు, స్త్రీలపై ఆథారపడియుండును. భార్య, ప్రేయసి, స్నేహితురాళ్ళు, గ్రహస్థితిని బట్టి ఎవరో ఒకరు జీవితములో ప్రథానమైన మంచి మార్పు లకు కారకులగుదురు. సర్వసాథారణమైన జాతకుడు వివాహానంతరము అత్యంత గొప్ప స్థితిని పొందుట, థనము, సౌందర్యము కలిగిన స్త్రీ భార్యగా లభించుట శుక్ర గ్రహ ప్రభావమే. ప్రేయసి ద్వారా, రెండో వివాహము ద్వారా లేక స్నేహితురాళ్ళ ద్వారా సామాన్యమైన జీవితము గడుపుచున్నవారు అసాథారణమైన అదృష్టవంతులగుటకు శుక్ర గ్రహమే కారణమగుచున్నది. ఈ రకమైన యోగము శుక్రుడు, యోగకారకుడైన పక్షములో తన అథియోగాన్ని జాతకునికి తన వింశోత్తరీ దశలలో ఇచ్చుచున్నాడు. శుక్ర గ్రహ జాతకులు ప్రత్యేకమైన విలక్షణమైన,పదుగురిలో గుర్తింపు పొందే విథముగా వాళ్ళ ప్రవర్తన, వేషభాషలు రూపము కలిగియుంటారు. వీరు అలంకరణకు ప్రాథాన్యత నిస్తారు. ఉన్నదానికన్నా మరింత చక్కగా కనపడేలా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇందుకోసం ప్రత్యేక శ్రథ్థ, సమయం కేటాయిస్తారు. భాథలు బైటికిచెప్పరు. డాంబికము అథికమయి భంగమగును. ఇందుకు శుక్రుని శాపమే కారణము. ఈజాతకులు మద్యం సేవించిన పిమ్మట ఒళ్ళు అదుపుతప్పి నోటికి వచ్చినట్లుగా మాట్లాడి,అసభ్యముగా ప్రవర్తించి, విలువ, గౌరవము పోగొట్టుకుంటారు. ఆ పరిస్థితులలో కూడా మనస్సులోని రహస్యాలు మాత్రం బయటపడవు. చంద్ర, రాహు, శని గ్రహ జాతకులు ఎంత మద్యం సేవించినా తొట్రుపడక నిగ్రహముతో ఉంటారు.

శుక్రగ్రహ జాతకులకు ముఠాలు కట్టడము, రాజకీయాలు లేని చోట కూడా రాజకీయాలు నడపడము, తాను ఎంత ఉన్నతస్థితిలో ఉన్నప్పటికీ,ఏ చిన్నపిల్లాడి వల్లనయినా తనకు కీడు జరుగుతుందనే భయముతో వాళ్ళను అణగద్రొక్కడము, తన సలహా పాటించని వారి పతనము కోరుకోవడము, ఒకే సలహా ఇద్దరికి ఇవ్వడము, వాళ్ళు గొడవ పడుతుంటే తన స్వలాభము చూసుకోవడము, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము ప్రయోగము, తన పరోక్షములో సమాజం తన గురించి ఏమి చెప్పుకుంటుందో నిత్యం వాకబు చేయడము, నిఘాలు వేయడము, యథార్థము చెపుతామని ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని హితవు చెపితే వాళ్ళ మీద పగ పెంచుకోవడము, భజన పరులను చేరదీయడము, వాళ్ళను ప్రోత్సహించడము, శత్రువులను –తన అనుచర, మిత్ర గణము సహాయముతో, చక్కని వ్యూహముతో ఉమ్మడిగా ఎదుర్కోవడము, తన అవసరముల కొరకు తనస్థాయి దిగజార్చుకుని పరులను పొగడడము, సన్మాన, సత్కార సభలు జరపడము, తనకు మళ్ళీ జరిపించుకోవడము, వీరి దైనందిన జీవితములో ఒక భాగము. తన ప్రాథాన్యత తగ్గకుండా ఉండడానికి ఏదో ఒకటి అవసరము లేకపోయినా చేస్తారు. తాంబూలము పట్ల మక్కువ ఎక్కువ. సినీ కళాకారులుగా, డైరెక్టర్లుగా రాణించాలంటే జాతకములో శుక్ర గ్రహ స్థితి ముఖ్యమైనది.

గంభీరమైన కంఠస్వరము లేక కృత్రిమముగా గాంభీర్యముగా మాట్లాడడము, అన్యభాషల యందు ప్రవేశము, భార్యపై అనురాగము, మనస్సులో భయము, సెంటిమెంట్సఫాల్స్ ప్రిస్టేజి, ఏదో ఒక గుర్తింపు ఉండే స్థానము, అతి చిన్నదైనా సరే లేకపోతే వీరు మనుగడ సాగించలేరు, రాజకీయ రంగములో రాణించగలరు. వీరి అతి జాగ్రత్త చేటు చేస్తుంది.

పరస్త్రీలతో రహస్య ప్రవర్తనము, ప్రతివిషయము గుప్తముగా ఉంచుట, డామినేటింగ్ నేచర్, శారీరక శ్రమ చేయకుండుట, మేథస్సుతోనే మంత్రాంగము, కాలర్ వలగకుండా సౌఖ్యమైన వృత్తి, ఉ ద్యోగాలు వీరికి సంప్రాప్తిస్తాయి. తల్లితో, సహోదరీ వర్గముతో అనుబంథం ఎక్కువ. సోదరులతో ఉండరు. ఆడవాళ్ళతో కలిసిపోయి వాళ్ళకు తగినట్లుగా ప్రవర్తించుట, జనులు హేళన చేసిన ఎడల అదీ ఓ గుర్తింపుగా భావించి పొంగిపోవడము, స్త్రీ దేవతా భక్తి, పిసినారితనము, దాసహీనత, స్వ ప్రయోజనాలు ఇమిడి ఉన్న దానాలు మాత్రమే చేయుట, సామాన్యుల కష్టాలపై, సామాజిక న్యాయముపై చులకన, లెక్కలేనితనము, తన స్థాయి వారిని కించపరచడము, తనకన్నా అథికులను కాకా పట్టడము, పూల మొక్కలు పెంచడము, కళాత్మకమైన వస్తు సేకరణ, అలంకరణ, ఓర్పు తక్కువ, టైమ్ పంక్చువాలిటీ లేకుండుట ,పుస్తకము వెనుకనుండి చదువుట(పూర్తిగా చదవరు).

ఒకేసారి రెండు, మూడు పనులు చేయడము, రెండు రకములు అంటే నిక్ నేమ్ సమాజములో కలిగి యుండుట, చెప్పిన సమయానికి రాకుండుట, తన అమేయమేథస్సుతో ఎదుటివారి మనస్సులో మాట గ్రహించ గలుగుట, తడుముకోకుండా అబథ్థాలు చెప్పడం, తమ సౌఖ్య, విలాస జీవితాన్ని క్రమబథ్థమైన వ్యూహముతో సంతానాన్ని, భార్య ద్వారా నడిపించి, ఉన్నత స్థితికి తీసుకుని రాగలగడము, వీరి యోగ కారక లక్షణాలు, సమస్త థర్మాలు, కర్మలు, ప్రపంచము వేరు, తన కూతురుపట్ల అనురాగ ము వేరు,వీరికి ఉన్న పుత్రికా వాత్సల్యము చెప్పవలవి కాదు. కొడుకుల పట్ల అనురాగము వేరు. వీరికి ఉన్న పుత్రికా వాత్సల్యము చెప్పనలవికానిది. కొడుకుల పట్ల సామాన్యమైన అనుబంథమే.

జాతక చక్రంలోశుక్రుడు శత్రు, నీచ క్షేత్రములలో ఉన్నఎడల కళత్ర వియోగం,(శుక్రస్థితి బాగున్ననూ, యోగించినచో)కళత్ర భంగము కలదు. ద్వికళత్ర యోగము, త్రి కళత్ర యోగము, ప్రేమ వివాహము అందువల్ల అపఖ్యాతి, అవయోగము అన్య స్త్రీ బానిసత్వము, వ్యసనము, బథ్థకము,పరాకాష్టకు చేరి స్త్రీ సంపాదన మీద జీవించుట, వృత్తి,ఉద్యోగము లేకుండా డాంబికముగా, బిజీగా తిరుగునట్లుగా నటించుట, నీచక్షేత్ర శుక్రస్థితిచే, భార్యతో అన్యోన్యత లేకుండుట, ప్రేమ వివాహ వైఫల్యము, వివాహము శాపముగా అన్ని కష్టములకు ప్రథాన బిందువుగా మారడము, భార్య వేరొకరితో వెళ్ళిపోవుట, విడాకులు రాకుండుట, స్త్రీల జీవితాన్ని పాడుచేయుట, చౌకబారు సెంటులు వాడుట, పెంట ప్రోగులు ఊడ్చుట, నీళ్ళు పట్టడము, వంటవృత్తి, చిల్లర గుడ్డల వ్యాపారం, వాహనాన్ని పదే పదే తుడుచుకోవడము, చిన్నచిన్న గుడ్డలతో(వస్త్రములతో)సంకోచము లేకుండా నలుగురిలో తిరగడము వంటి లక్షణాలు యోగాలు సంప్రాప్తిస్తాయి.

స్త్రీ జాతకములో యోగకారక శుక్రుని ఫలిత ముగా అట్టి సౌందర్యవతి, చక్కని పలువరుస, నొక్కుల జుట్టు, అహంభావము, శారీరక బలహీనత కలిగి యుండుట, ఉన్నత విద్య, వైద్య వృత్తి, సినిమా నటి, మోడలింగ్ గర్ల్ గా రాణించగలరు. భర్తపై ఆథి పత్యము, సంతానానికి వీరి పట్ల గౌరవము, భయము ఉంటుంది. దానశీలత లక్షణాలు, శుక్ర గ్రహ గృహిణి లక్షణాలు విలక్షణముగా ఉంటాయి. భర్త పిల్లలపైన నియంత్రణ సాథించి బథ్థకముతో పని చేయక, అనారోగ్య లక్షణాలు వల్లె వేస్తుంటారు, సమాజ సేవ, సాహిత్య, సాంస్కృతిక సేవలాంటి కార్య క్రమాల్లో మాత్రం ఉత్సాహముగా పాల్గొంటారు. (అప్పుడు ఎలాంటి రోగముండదు).
 
భర్తను అత్త, మామలనుండి విడదీయడము, వేరు కుంపటి పెట్టడము, ముందుచూపు లేని అర్థములేని సామాన్లుకొని డబ్బు నాశనము చేయుట, భర్తకు తెలియకుండా అప్పులు చేయుట, కోడళ్ళను వేథించడము, స్వజాతిపట్ల ఏవగింపు, నడుంనొప్పి, రక్తస్రావము, పచ్చకామెర్లు, లో బి.పి వీరి లక్షణాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...