9, నవంబర్ 2017, గురువారం

ఏ వారం.. ఏ పూజ... ఏ ఫలితం?



ఏ వారం.. ఏ పూజ... ఏ ఫలితం?
కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చెయ్యాల్సి ఉంటుంది.

ఆదివారం: ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.

సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.

మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.

బుధవారం: బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం: గురువారం ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.

శుక్రవారం: శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి.

శనివారం: శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేవాడు శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. సృష్టికి ఆదిలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు. పాపం చేయటం లేదా పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది. చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన.

దేహమే దేవాలయం_DehameDevalayam

    
దేహమే దేవాలయం

     మన దేహమే ఒక దేవాలయం. మన దేహమనే దేవాలయాన్ని చూసే భౌతిక ప్రపంచంలో దేవాలయాల నిర్మాణం జరిగింది. సుప్రభేద ఆగమం మంటపాల నిర్మాణాన్ని మన శరీరంతో పోల్చింది. దీని ప్రకారం మన శిరస్సే గర్భగృహం. శిఖయే గర్భాలయ శిఖరం. చేతులే ప్రాకారం. తొడలే సౌభాగ్య మంటపం. మోకాళ్లే మహాద్వారం. మన నాడులే స్తంభాలు. జిహ్వయే మహాఘంట. బ్రహ్మరంధ్రమే గర్భగృహ ద్వారం. ఇలా చూసుకుంటూ పోతే మన శరీరంలోని ప్రతి అవయవానికీ దేవాలయంలో ఏదో ఒక విభాగంతో పోలిక కనిపిస్తుంది. జ్ఞానులకు, యోగులకు వారివారి దేహాలే దేవాలయాలు. వారి హృదయాలలో భగవంతుడిని ఆరాధించడమే మానస పూజ.

దేవాలయాల్లో చేసేది కేవలం బాహ్యపూజే. మానస పూజ చేసే సాధకుడు తన దేహమనే దేవాలయంలోని ద్వారాలను దాటి గర్భాలయంలో ఉన్న పరమాత్మను తన ఆత్మగా గుర్తించగలుగుతాడు. అయితే ప్రతి దేవాలయంలోనూ మంటపాలు ఉండవు. తిరుపతి, కాళహస్తి, కంచి వంటి గొప్పగొప్ప దేవాలయాల్లో ఈ మంటపాలు ఉంటాయి. వాటినే పూర్ణదేవాలయాలు అని పిలుస్తారు. అరుణంలోని ‘అష్టాచక్రా నవద్వారా’ అనే మంత్రంలో అష్టచక్రాల గురించి ప్రస్తావన ఉంటుంది. ఇదే విధంగా యోగోపనిషత్తులలోను, శివసంహితలోను, భాగవతాది పురాణాల్లోనూ ఈ చక్రాల ప్రస్తావన ఉంటుంది. మన శరీరంలో ఒక్కో చక్రం దేవాలయంలో ఒక్కో మంటపం. మూలాధార చక్రమే మహాద్వారం. స్వాధిష్ఠాన చక్రమే సౌభాగ్య మంటపం. మణిపూరక చక్రమే యోగమంటపం. అనాహత చక్రమే నవరంగ మంటపం. విశుద్ధి చక్రమే అంతరాళ మంటపం. మన శరీరంలోని చక్రాలను, వాటి విధులను పరిశీలిస్తే దేవాలయాల్లోని మంటపాలతో సారూప్యత కనిపిస్తుంది. ఇటువంటి సారూప్యతలున్నాయి కాబట్టే మన పూర్వీకులు దేవాలయాలకు వెళ్లాల్సిందిగా అందరినీ ప్రోత్సహించేవారు. ఆ నిర్మాణాలను చూస్తే ఆత్మ చైతన్యం కలుగుతుందని భావించేవారు.స్వామి సరూపానందేంద్ర సరస్వతి

8, నవంబర్ 2017, బుధవారం

సాధన సప్తకం_SadhanaSaptakamu

      

 సాధన సప్తకం
 పుట్టుక, ముసలితనం, మరణం.. ఇవేవీ లేని ఆనందస్వరూపుడైన పరమాత్మను పొందడం ఎలా? ఉపాసనాత్మకమైన జ్ఞానం ద్వారా పొందవచ్చని ముండకోపనిషత్తు చెబుతోంది. వివేక, విమోక, అభ్యాస, క్రియా, కల్యాణ, అనవసాద, అనుద్ధర్షాలనే సాధన సప్తకాలతో ఇది సాధ్యం. అవేంటంటే..

వివేకం:
మంచి చెడులను గుర్తించ గల వివేక సంపన్నుడు మానవుడు. అంతఃకరణ శుద్ధికి అవసరమైన, దోషరహితమైన ఆహారం స్వీకరించడం వల్లనే మనిషి వివేకవంతుడు అవుతాడు.

విమోకం:
భోగ వస్తువులయందు, విషయముల యందు వ్యామోహము ఏర్పడకుండా జాగ్రత్తపడటమే విమోకం. భోగలాలసునికి ఉపాసన దశలో స్థిరచిత్తం ఏర్పడదు. కాబట్టి భోగలాలసను వదలాలి.

అభ్యాసం:
బయటి ప్రపంచంలోని వ్యక్తులపై అనురాగం ఏర్పడకుండా నిత్యం, నిరంతరం.. సమస్త శుభాలకు కేంద్రమైన ఆ భగవంతుని స్మరించడాన్నే అభ్యాసం అంటారు.
క్రియ: తమ శక్తి మేరకు రోజూ పంచమహాయజ్ఞాలను నిర్వహించడమే క్రియ. అవి..

దేవ యజ్ఞం
: జపం, హోమం, స్తుతి, అర్చనతో దేవతారాధన చేయడం.
బ్రహ్మ యజ్ఞం: విజ్ఞాన సర్వస్వాలు, విశ్వశ్రేయస్కరాలు అయిన వేదాలను అధ్యయనం చేయడం.
పితృ యజ్ఞం: తల్లిదండ్రులను ఆదరించడం, వారి యోగక్షేమాలను శ్రద్ధగా పట్టించుకోవడం.. వారు స్వర్గస్థులయ్యాక శ్రద్ధతో వారికి పిండతర్పణాదులను సమర్పించడం.
మనుష్య యజ్ఞం: అతిథి, అభ్యాగతులను, బంధు మిత్రులను ఆదరించడం. వారికి తగిన సేవలను అందించడం. మాటలతో చేష్టలతో నొప్పించకపోవడం.
భూతయజ్ఞము: సాధుజంతువులైన గోవులకు ఇతర ప్రాణులకు ఆహారాన్ని అందించడం. ఈ ఐదు యజ్ఞాలను నిర్వర్తించడమే క్రియ.

కల్యాణం: సమస్త ప్రాణులకూ మేలు కలిగేలా త్రికరణ శుద్ధితో వ్యవహరించడం. మాటలతో చేష్టలతో ఎవరినీ హింసించకుండా ఇతరులకు ఉపయోగపడే మాటలనే పలకడం, పనులనే చేయడం.

అనవసాదం:
ఎలాంటి సందర్భంలోనూ మనసులో నిరుత్సాహం ఏర్పడకుండా మనసును, శరీరాన్ని శక్తిమంతంగా ఉంచుకోవడం.

అనుద్ధర్షం: సంపదలు పెరిగాయనో, మహోన్నత పదవి లభించిందనో, జ్ఞానమో రూపమో గుణములో తమలో ఎక్కువగా ఉన్నాయనే భావనలతో అతిగా సంతోషమును పొందక పోవడం. ఈ సాధన సప్తకం ఉపాసకులకు అత్యావశ్యకము.        -డాక్టర్‌ నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్

4, అక్టోబర్ 2017, బుధవారం

కరణాలు వాటి ప్రాముఖ్యత_The kARANALU are their significance

  
     తిధిలో సగ భాగమునకు కరణం అని పేరు. తిధి ప్రమాణం 12డిగ్రీలు. తిధి ప్రారంభం నుండి మధ్య వరకు మొదటి 6 డిగ్రీలు మొదటి కరణం అగును. తిధి మద్య నుండి ప్రారంభమై అనగా 7 డిగ్రీల నుండి 12 డిగ్రీల వరకు అనగా తిధి అంతం వరకు ద్వితీయ కరణం ఉండును. ప్రతిరోజు రెండు కరణములు వచ్చును.

    తిధిలో పూర్వార్ధమున పూర్వార్ధ కరణం ఉత్తరార్ధమున ఉత్తరార్ధ కరణం ఉండును. పంచాంగాలలో సూర్యోదయము నందు ఉన్న కరణం మాత్రమే చూపబడును. ఆ తరువాత కరణం చూపబడదు.

    కరణం అంటే చేయునది అని అర్ధం. కరణాలు రెండు రకాలు. చర కరణాలు, స్ధిర కరణాలు. కరణాలు మొత్తం 11.
చర కరణాలు :- 1) బవ 2) బాలవ 3) కౌలవ 4) తైతుల 5) గరజి 6) వణిజ 7) విష్టి (భద్ర)
స్ధిర కరణాలు:- 8) శకుని 9) చతుష్పాత్ 10) నాగ 11) కింస్తుఘ్న

=======================================
చంద్ర స్ఫుటం నుండి రవి స్ఫుటాన్ని తీసివేసి కరణం వచ్చును.

       చర కరణాలు 7 ప్రతి మాసంలోను శుక్లపక్ష పాడ్యమి ఉత్తరార్ధం నుండి బహుళ చతుర్ధశి పూర్వార్ధం వరకు ప్రతి తిధికి రెండు కరణాల వంతున మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి.

స్ధిర కరణాలు బహుళ చతుర్ధశి ఉత్తరార్ధము మొదలు శుక్ల పాడ్యమి పూర్వార్ధం ఒకసారి మాత్రమే వస్తాయి.

     చర కరణాలు 7 ప్రతి మాసంలో 8 సార్లు వస్తాయి. స్ధిర కరణాలు 4 ఒకసారి మాత్రమే వస్తాయి. కరణాలలో స్ధిర కరణాలైన శకుని, చతుష్పాత్, కింస్తుఘ్నం, చర కరణాలలో విష్టి, వణిజ కరణాలు మంచివి కావు కావున శుభ ముహూర్తాలలో విడిచి పెట్టాలి.

   విష్టి కరణం మొదలు సర్పాకృతిని, చివర తేలు ఆకృతిని కలిగి ఉండును. విష్టి కరణములో మొదటి నాలుగు గంటలు, చవరి నాలుగు గంటలు వదలి మగ్య నాలుగు గంటలు శుభకార్యాలలో తప్పని పరిస్ధితి ఐతే తీసుకోవచ్చును.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...