జాతకచక్రంలో షష్టమ భావ విశ్లేషణ
పాప గ్రహములు షష్టమ స్ధానం లో ఉన్న శత్రు బాధలు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. లగ్నం నుండి ఆరవ స్ధానం వ్యాధి, విరోధం, ఋణం, బాధ, గాయాలు, మేనమామలు, మానసిక ఆందోళన, ఋణాల బారిన పడటం, తగువులు, దురదృష్ఠం, చెడ్డపేరు, దొంగతనం, అగౌరవం, శత్రుబాధలు వంటి చెడు ఫలితాలతో పాటు విజయాలు, పరిశీలనా సామర్ధ్యం, పోటీతత్వంతో ముందుకు వెళ్ళటం వంటి శుభ ఫలితాలను కూడా సూచిస్తుంది. అయితే ఈ భావ కారకత్వాల ద్వారా లభించే శుభ ఫలితాలు కూడా మరో విధంగా కొంత బాధను కలిగించటం గమనించాలి. విజయం పొందటం ఆనందదాయకం అయినా ఆ విజయాన్ని పొందటానికి ఎంతో శ్రమించాలి. పైగా సాధించిన విజయాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం కృషి చేయాలి. అంటే ఆరవ స్ధానం తెచ్చిపెట్టే ఈ విజయం ఎంతో శ్రమకరమైనదిగా గమనించాలి. సత్యాచార్యుల వారు లగ్నాదిగా షష్ఠాధిపతి లగ్నంలో ఉంటే వ్యక్తి అధికార సంపన్నుడు అవుతాడని అదే విధంగా రోగగ్రస్తుడు కూడా కావటం గమనించాలి అని చెప్పారు.