5, జూన్ 2016, ఆదివారం

అష్టకవర్గు ద్వారా జాతకచక్ర పరిశీలన

అష్టకవర్గు ద్వారా జాతకచక్ర పరిశీలన

ప్రతిగ్రహం తన నుండి మరియు ఇతర గ్రహాల నుండి ఒక ప్రత్యేక పద్ధతిలో ప్రతి భావంలో శుభ బిందువులను ఇచ్చును. దీనినే అష్టకవర్గు అంటారు.


లగ్నంలో ఎక్కువ బిందువులు ఉండి సప్తమంలో తక్కువ బిందువులు ఉన్నప్పుడు ఇతరులకంటే తాను గొప్ప అనుకోవటం, ఇతరుల మాటకు విలువ ఇవ్వకపోవటం జరుగుతుంది. లగ్నం కంటే సప్తమంలో సర్వాష్టకవర్గు బిందువులు ఎక్కువ ఉంటే ఇతరులపై మన ప్రభావం ఎక్కువ ఉంటుంది.




ద్వితీయ స్ధానంలో తక్కువ సర్వాష్టకవర్గు బిందువులు ఉన్నప్పుడు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.


తృతీయ స్ధానంలో లగ్నం కంటే ఎక్కువ సర్వాష్టకవర్గు బిందువులు ఉన్నప్పుడు ఇతరుల సహకారం గాని సలహాలు గాని  తీసుకోవాలి.


చతుర్ధ స్ధానంలో 28 బిందువులు కంటే తక్కువ సర్వాష్టకవర్గు బిందువులు ఉన్నప్పుడు శరీర సౌకర్యాలు తక్కువ, వేళకు తిండి సరిగా తినలేరు.


పంచమ స్ధానంలో 28 బిందువుల కంటే ఎక్కువ సర్వాష్టక వర్గు బిందువులు ఉన్నప్పుడు సొంత ఆలోచనా విధానం ఉంటుంది. తన ఆలోచనలకు తగ్గట్టుగా సంతానం కలుగుతుంది. పంచమంలో తక్కువ దశమంలో ఎక్కువ సర్వాష్టక వర్గు బిందువులు ఉన్నప్పుడు అనాలోచితంగా పనిచేస్తారు. పంచమంలో, నవమ భావాలలో సర్వాష్టకవర్గు బిందువులు 28 కంటే ఎక్కువ ఉన్నప్పుడు తన ఆలోచనకు తగ్గ ఆచరణ ఉంటుంది. నవమంలో ఎక్కువ ఉంటే ఊహించిన దానికంటే మంచి జరుగుతుంది.


షష్టమ స్ధానంలో 28 బిందువుల కంటే ఎక్కువ సర్వాష్టక వర్గు బిందువులు ఉన్నప్పుడు శత్రువులపైన విజయం ఉంటుంది. రోగనిరోదక శక్తి ఉంటుంది.


సప్తమ స్ధానంలో 28 బిందువుల కంటే ఎక్కువ సర్వాష్టక వర్గు బిందువులు ఉన్నప్పుడు జీవిత బాగస్వామితోను, సామాజిక సంబంధాలలోను ఇబ్బందులు ఉండవు.


అష్టమ స్ధానంలో 28 బిందువుల కంటే ఎక్కువ సర్వాష్టక వర్గు బిందువులు ఉన్నప్పుడు ఆకస్మిక లాభ నష్టాలు కలుగుతాయి. రోగం లేకపోయిన ఏదో రోగం ఉన్నట్టు భావిస్తారు. మానసిక బలహీనత కలిగి ఉంటారు.


నవమ స్ధానంలో స్ధానంలో 28 బిందువుల కంటే తక్కువ సర్వాష్టక వర్గు బిందువులు ఉన్నప్పుడు సంతృప్తి తక్కువ ఉంటుంది. బాగా కష్టపడితే గాని విజయం సాదించలేరు.  28 బిందువుల కంటే ఎక్కువ సర్వాష్టక వర్గు బిందువులు ఉన్నప్పుడు మరణించిన తరువాత కూడా ఇతరుల మనస్సులో బ్రతికే ఉంటారు. ఊహించని మంచి కలుగుతుంది.


దశమ స్ధానంలో 28 బిందువుల కంటే ఎక్కువ సర్వాష్టక వర్గు బిందువులు ఉన్నప్పుడు శ్రమకు తగ్గ గౌరవం లభిస్తుంది.


లాభం స్ధానం కన్నా ఎక్కువ సర్వాష్టక వర్గు బిందువులు వ్యయంలో ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా వస్తాయి.


వ్యయ స్ధానంలో 28 బిందువుల కంటే ఎక్కువ సర్వాష్టక వర్గు బిందువులు ఉన్నప్పుడు చేతిలో డబ్బు నిలవదు. విదేశీ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. లగ్జరీగా బ్రతకాలనుకుంటారు.


జాతకచక్రంలో ప్రతి  భావంలోను 28 బిందువుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ వ్యక్తి జాతకచక్రంలో ఆ రాశి ఏ భావాన్ని తెలియజేస్తుందో ఆ భావ సంబంధ ఫలితాలు మంచిగా ఉంటాయి. 28 బిందువుల కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ భావం బలహీనమై ఆ భావ సంబంధ ఫలితాలు ఇబ్బందికరంగా ఉంటాయి.


గ్రహం ఉచ్చ స్ధానంలో ఉన్న భావంలో 28 బిందువుల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ భావ సంబందిత శుభ ఫలితాలను పొందలేడు. గ్రహం నీచలో ఉన్న 28 బిందువుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ భావ సంబందిత శుభఫలితాలను పొందగలడు.


జాతకచక్రంలో లగ్నం, నవమ స్ధానం, దశమ స్ధానం, లాభ స్ధానంలో 30 బిందువులు ఉన్నప్పుడు జీవితంలో మంచి పురోభివృద్ధి కలిగి ఉంటారు.


జాతకచక్రంలో దశమ స్ధానం, ద్వాదశ స్ధానాలలో కంటే లాభ స్ధానంలో ఎక్కువ బిందువులు ఉన్నప్పుడు తక్కువ శ్రమతో (10 వస్ధానం), తక్కువ ఖర్చుతో (12 వ స్ధానం), అధిక లాభాన్ని ( 11వ స్ధానం) ఆర్జించవచ్చును. అదే విధంగా లాభస్ధానం, లగ్న స్ధానం కంటే వ్యయ స్ధానంలో తక్కువ బిందువులు ఉన్నప్పుడు చక్కని ఆత్మ విశ్వాసంతో (లగ్న స్ధానం), తృప్తిగా (11 వ స్ధానం), తక్కువ ఖర్చు (12 వ స్ధానం) పెడతాడు.


క్షీణ చంద్రుడు ( రవి చంద్రులు ఒకే రాశిలో) ఉన్న రాశిలో తక్కువ బిందువులు ఉన్నప్పుడు శని దృష్టి ఉంటే దృష్టిదోషాలు, మానసిక ఆందోళనలు, ధన నష్టం కలుగుతాయి.


దశమ స్ధానం కంటే లాభ స్ధానంలో అధిక బిందువులు ఉంటే వ్యక్తి జీవితంలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందుతాడు.


ద్వితీయం కంటే వ్యయంలో ఎక్కువ బిందువులు ఉంటే కుటుంబంలో కలహాలు, ధనాభివృద్ధి లేకపోవటం, మాటకు విలువ లేకపోవటం జరుగుతాయి.


లాభ స్ధానంలో కంటే వ్యయ స్ధానంలో ఎక్కువ బిందువులు ఉంటే లగ్జరీ లైఫ్ కావాలని కోరుకోవటం, విదేశీ ప్రయాణాలను (ఖర్చు) తెలియజేస్తుంది.


చతుర్ధాధిపతి, చతుర్ధ భావాధిపతి బలహీనంగా ఉంటే విదేశీ యోగం ఉంటుంది. ఎందుకంటే చతుర్ధ స్ధానం  స్ధాన బలాన్ని తెలియజేస్తుంది.


ద్వితీయ స్ధానంలో వ్యయ స్ధానం కంటే ఎక్కువ బిందువులు ఉన్నప్పుడు కుటుంబంలో అన్యోన్నత, ధనాభివృద్ధి, చేతిలో డబ్బు, మాట విలువ ఉంటాయి.


జాతక చక్రంలో ఏ భావంలో ఐతే తక్కువ బిందువులు ఉన్నాయో పరిశీలించి ఆ భావం ఏ రోజు ఉదయిస్తుందో (రవి ఉన్న రాశి ఉదయ లగ్న రాశి అంటారు) ఆ రోజు రోగం ఉన్న వ్యక్తి డాక్టర్ ని సంప్రదిస్తే రోగం తొందరగా నయం అవుతుంది.  


జాతక చక్రంలో ఏ భావంలో ఐతే తక్కువ బిందువులు ఉన్నాయో పరిశీలించి ఆ భావం ఏ రోజు ఉదయిస్తుందో ఆ రోజు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్న, బ్యాంక్ లోను  కోసం అప్లయ్ చేసిన అప్పు త్వరగా క్లియర్ కావటం, బ్యాంక్ లోనూ తొందరగా క్లియర్ కావటం జరుగుతుంది.


వివాహా పొంతనలోను వధూవరుల జాతకచక్రంలో ఇరువురికీ చంద్రుడు ఉన్న రాశిలో 30 బిందువుల కంటే ఎక్కువ ఉంటే వారి వివాహా దాంపత్యం ఎటువంటి కలతలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.


గోచారంలో ఏదైన గ్రహం 28 కంటే ఎక్కువ బిందువులు ఉన్న భావంపై సంచరిస్తున్నప్పుడు ఆ గ్రహం శుభ ఫలితాన్ని ఇస్తుంది.


ఎల్నాటి శని జరుగుతున్నప్పుడు చంద్రుని నుండి వ్యయ, జన్మరాశి, ద్వితీయ భావాలలో శని సంచారం జరుగుతున్నప్పుడు  30 బిందువులు ఉన్నప్పుడు శని ఇబ్బంది పెట్టాడు.


గోచారంలో గ్రహం ఏదైన సరే తక్కువ బిందువుల నుండి ఎక్కువ బిందువులు ఉన్న భావాలలోకి సంచారం  జరుగుతున్నప్పుడు  ఒక్కసారిగా మంచి ఫలితాలు వస్తాయి.


దశ, అంతర్ధశ అధిపతులు ఏ భావంలో అయితే ఉన్నారో ఆ భావంలో సర్వాష్టకవర్గు బిందువులు 30 బిందువులు పైన ఉంటే దశ, అంతర్ధశ మంచిగా యోగిస్తుంది.


ఇందు లగ్నం నుండి దశమ, లాభ, వ్యయ, లగ్న భావాలలో ఎక్కువ బిందువులు ఉంటే మంచి ధన సంపాదన ఉంటుంది. ఇందులగ్నంపై గోచార గురువు సంచరిస్తున్నాప్పుడు మామూలు సంపాదనతో పాటు అదనపు ఆదాయం వస్తుంది.


లాభంలో అష్టకవర్గు బిందువులు ద్వితీయం కంటే ఎక్కువ ఉంటే సంపాదిస్తాడు గాని ధనాన్ని నిలుపుకోలేడు.

అష్టమంలో అష్టకవర్గు బిందువులు షష్టంలో ఉన్న అష్టకవర్గు బిందువుల కంటే ఎక్కువ ఉంటే రోగ నిరోదక శక్తి తక్కువై తరచుగా అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి.


దశమ స్ధానంలో లేదా షష్టమ భావాలలో ఎక్కువ సర్వాష్టకవర్గు బిందువులు ఉన్నఎటువంటి ఒడిదుడుకులు లేని స్దిరమైన ఉద్యోగం కలిగి ఉంటారు.


దశమ స్ధానంలో ఎక్కువ బిందువులు ఉన్న వ్యాపారం మరియు స్వయం ఉపాధి వృత్తులలో బాగా రాణిస్తారు. సర్వాష్టకవర్గులో బందుకవర్గులో (1,5,9 భావాలు) ఎక్కువ శుభ బిందువులు ఉన్న స్వయం ఉపాధిని కలిగి ఉంటారు. సేవక వర్గులో (2,6,10 భావాలు) ఎక్కువ శుభ బిందువులు ఉన్న ఉద్యోగమును సూచించును.


అష్టకవర్గులో పంచమాధిపతి ఏ భావంలో ఎక్కువ భిన్నాష్టకవర్గు బిందువులు ఇస్తాడో ఆ భావాధిపతి దేవతను పూజిస్తే మన మనస్సులో కోరికలు సిద్ధిస్తాయి.


కుజుడు గోచారరీత్యా సున్నా భిన్నాష్టకవర్గు బిందువులు ఉన్న లగ్నంలో గాని, జన్మ రాశి మీద గాని సంచారం చేస్తున్నప్పుడు రక్త దర్శనం గాని, ఇతర కుజగ్రహ ఇబ్బందులు గాని కలుగజేస్తాయి. 



ఏదైన భావంలో తక్కువ బిందువులు ఉన్నప్పుడు దానం, జపం, హోమ, తర్పణ ప్రక్రియల ద్వారా తక్కువ బిందువులు ఉన్న భావాలను వృద్ధి చెందించవచ్చును.  .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...