24, జూన్ 2016, శుక్రవారం

జాతక పరిశీలనలో కొన్ని ముఖ్యమైన అంశాలు




జాతక పరిశీలనలో కొన్ని ముఖ్యమైన అంశాలు  



నిష్పల రాశులైన కన్య, మిధునం, సింహం సంతానస్ధానం అయినప్పుడు సంతానానికి ఇబ్బందులు ఉంటాయి. అంతే కాకుండా నిష్పల రాశులు సంతానస్ధానమై, పంచమాధిపతి నిష్పల రాశులలో ఉండి, సంతాన కారకుడైన గురువు నిష్పల రాసులలో ఉంటే సంతాన అవకాశాలు తక్కువ. మరియు ప్రశ్నలో నిష్పల రాశులు లగ్నమైనప్పుడు ఆ పని నెరవేరుట కష్టం అని తెలుసుకోవాలి.   


బుధుడు కేంద్రంలో ఉండి, శుక్రుడు ద్వితీయంలో ఉంటే జ్యోతిష్య విద్యపై పట్టు సాధిస్తారు. కేంద్రంలో బుధుడు  కొత్త, కొత్త ఆలోచనలను కల్పిస్తూ ప్రతి విషయాన్ని అంచనా వెయ్యగలిగే సామర్ధ్యాన్ని కల్పిస్తాడు. ద్వితీయంలో శుక్రుడు జాతకుడికి ఏది చెబితే విని ఆచరించగలడో అది చెప్పగలిగే సామర్ధ్యం ఉంటుంది. మాటల్లో లాజిక్ ఉంటుంది. 

కుజదోషం చాలామంది జాతకాలలో కనపడుతుంది. లగ్నం నుండి, చంద్రుడి నుండి, శుక్రుడి నుండి కుజదోషాన్ని పరిశీలించేటప్పుడు కుజుడు లగ్నానికి మిత్రుడైన, కుజుడు మిత్రక్షేత్రాలలో కలసి ఉన్న, శుభగ్రహాల దృష్టి ఉన్న (గురు దృష్ఠి), శుభగ్రహ యుతి ఉన్న (చంద్రుడు) కుజదోష ప్రభావం ఉండదు. ఎటువంటి శుభత్వం లేని కుజుని జాతకచక్రంలో తీవ్రతకు అనుగుణంగా పరిహారాలు చేసుకోవటం ద్వారా కుజదోష ప్రభావాన్ని తగ్గించవచ్చు. కుజదోషం వలన వివాహం కాకపోవటం, వివాహం అయిన తరువాత విడిపోవటం జరగదు. 

కుజదోషం పూర్వం స్త్రీలకు మాత్రమే చూసేవారు. కుజుడు సంసారజీవితంలో కోరికలు కలిగిస్తాడు. కుజ దోషం ఉన్న వ్యక్తికి అదే సమానమైన కోరికలు కలిగి ఉన్న కుజ దోషం ఉన్న వ్యక్తికి వివాహం చేయటం ద్వారా వారిరువురు సంసార సౌఖ్యతను పొందుతారని, ఒకరికి కుజదోషం ఉండి ఇంకొకరికి కుజదోషం లేకుంటే అవతలివారి కోరికలకు అనుగుణంగా ఇవతలి వ్యక్తులు ప్రతిస్పందించకుంటే వారి మధ్య సంసార సౌఖ్యత ఉండదు అని భావించి పూర్వం ఇద్దరికి కుజదోషం ఉన్న వ్యక్తులకు లేదా ఇద్దరికి కుజదోషం లేని వ్యక్తులకు ఇచ్చి వివాహం చేసేవారు. 

కాలసర్పదోషం మనుషులకు వర్తించదు. అధికారం చెలాయించే వాళ్ళకు మాత్రమే వర్తింస్తుంది. ఉదాహరణకు రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి గాని  కిందస్ధాయి మంత్రులకు గాని కాలసర్పదోషం ఉన్నప్పుడు ఆ కాలసర్పదోష దశలు నడుస్తున్నప్పుడు వారు పరిపాలించే ప్రాంతాలలో కరువు కాటకాలు, వ్యాధులు, ఆర్ధిక సమస్యలు ఉంటాయి.  

జాతకచక్రంలో లగ్నంలో కుజుడు గాని, రవి గాని ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుంటే తలకు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. లగ్నంలో రవి ఉంటే యుక్త వయస్సులోనే తల వెంట్రుకలు తెల్లబడటం, జుట్టు ఊడిపోయి బట్టతల రావటం జరుగుతుంది. 

వివాహాం ఎప్పుడు జరుగుతుందో, ఎవరితో జరుగుతుందో అని జ్యోతిష్యుడిని అడగకూడదు. ఎప్పుడు చేసుకుంటే మంచిదో, వివాహాం చేసుకున్న తరువాత వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. 

విద్య కేవలం చతుర్ధ స్ధానంలోనే కాకుండా మిగతా భావాలలోనూ చూడవచ్చు. ద్వితీయ భావం ద్వారా తనకు తెలిసినది చెప్పగలిగే భావప్రకటనా విద్య, తృతీయంలో వినటం ద్వారా వచ్చే విద్య, చతుర్ధంలో తనంతట తాను చదువుకోవాలనే ఆకాంక్ష కొద్ది చదివే విద్య. పంచమంలో మననం చేసుకుంటూ చేసే ఊహాత్మక విద్య, షష్టంలో పోటితత్వంతో చదివే విద్య, నవమంలో తృప్తితో చదివే ఉన్నత విద్య, దశమంలో కృషితో చేసే విద్య.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...