27, ఫిబ్రవరి 2018, మంగళవారం

జలతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

జలతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు 

జలతత్వ రాశులు :- కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారు జలతత్వ రాశులకు చెందినవారు. అధిపతులు వరుసగా చంద్రుడు, కుజుడు, గురువు.  జలతత్వ రాశుల వారు ఆవేశపరులు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందటం, కష్ట సుఖాలు, సంపదలను గూర్చి ఎక్కువగా ఊహించుకోవటం. బార్యా పిల్లలతో ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. పరిసరాలకు ఆనుగుణంగా లోబడి ప్రవర్తిస్తారు. 


జలతత్వ రాశులవారు ఎక్కువగా ఆలోచిస్తారు. ఎప్పుడు ఊహాగానాలలో విహరిస్తారు. స్ఫురణ శక్తి కలవారు. ప్రతి విషయానికి వెంటనే ప్రతిస్పందిస్తారు. ప్రతి చిన్న విషయాలకు ఉద్వేగానికి లోనవుతారు. పరిస్ధితులకు అనుగుణంగా స్పందిస్తారు. చంచలమైన స్వభావం కలిగి ఉంటారు. భావనా శక్తి, కల్పనాశక్తి ఎక్కువ. ఎక్కువగా గేయ రచనలు చేయువారు ఈ తత్వానికి చెందినవారు అవుతారు.

కర్కాటకరాశి :- కర్కాటరాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి మేషాదిగా చతుర్ధరాశి కావటం వలన ఎప్పుడు మార్పులు కోరుకుంటారు. స్వాభిమానం కలవారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. ప్రతి పనిని జాగ్రత్తగా అమలు పరుస్తారు. చురుకుదనంతో పనిచేస్తారు. ఊహాత్మకంగా ఆలోచిస్తారు. జ్ఞాపకశక్తి అధికం. తమ అభిప్రాయాలను పరిస్ధితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ఉంటారు. కొంతకాలం సంతోషంగా, కొంతకాలం దుఃఖంగా ఉంటారు. వీరి ముఖ కవళికలలో మార్పులు గమనించవచ్చు.

కర్కాటక రాశి వారికి దేశాభిమానం ఎక్కువ. పరిసరాలకు అనుగుణంగా ఆత్మరక్షణ చేపడతారు. అమావాస్య, పౌర్ణమి, గ్రహణాల సమయంలో ఉద్రేకానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ. స్ధిరాస్ధుల విషయంలో మక్కువ కనబరుస్తారు. బంధుప్రీతి కలవారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వసతులను ఏర్పరుస్తారు. జనాధరణపై ఆసక్తి. ఆహారపానీయాలు, రసద్రవ్యాలు, నిత్యవసరాలు, జన సంబంధ విషయాలు ఈ రాశి కారకత్వాలకు చెంది ఉంటాయి.   

వృశ్చికరాశి :- వృశ్చికరాశికి అధిపతి కుజుడు. వృశ్చికరాశి మేషాదిగా అష్టమ రాశి కావటం వలన అంతర్గత విషయాలను తెలియజేస్తుంది. ప్రతి చిన్న విషయాలను లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అప్పటికప్పుడే తీవ్ర ప్రతిస్పందన కనబరుస్తారు. విపరీతమైన కోపం కలవారు.  మొండి పట్టుదల కలవారు. ప్రతిపనిలో ధైర్య సాహసాలు కనబరుస్తారు. రహస్య ప్రవర్తన కలవారు. బలమైన కోరికలు కలవారు. దృఢ సంకల్పం కలవారు. ప్రతి  పని విజయవంతంగా పూర్తి చేస్తారు. 

వృశ్చికరాశి వారు పరిస్ధితులను, పరిసరాలను, విషయాలను నిశితంగా పరిశోదిస్తారు. ఎటువంటి విషయాలకైనా సంసిద్ధత వహిస్తారు. ఎక్కడైనా నిర్భయంగా మాట్లాడతారు. ప్రతి విషయాన్ని, అంశాలను, జీవనోపాదిలోను కొన్నింటిని రహస్యంగా ఉంచుకుంటూ బయటకు బహిర్గతం చేయరు. ఈ రాశి వారికి గుప్త శత్రువులు ఎక్కువ. మూత్ర, గుద స్ధానాలు, జననేంద్రియ రుగ్మతలు ఈ రాశి వారికి కారకత్వాలుగా వర్తిస్తాయి.  

మీనరాశి:- మీనరాశి మేషాదిగా ద్వాదశ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశివారు ఊహాత్మకత కలవారు. కల్పనా చాతుర్యం కనబరుస్తారు. అనుకరణ శక్తి కలవారు. కళలపై ఆసక్తి కలవారు. సానుభూతిపరులు. ఆకర్షణవంతంగా కనబడాలనుకుంటారు. మంచి దానకర్ణులు. ఏకాంతంగా ఉంటూ ఊహాత్మకంగా ఆలోచిస్తారు. ఈ రాశివారు అధికంగా సైంటిస్టులు అవుతారు. ఉన్నది మొత్తం ఊడ్చిపెడతారు. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమలకు లోనవుతుంటారు. 

మీనరాశి వంచనకు లోనవుతారు. ప్రతి విషయంలో దాపరికం కనబరుస్తారు. ఆధ్యాత్మిక చింతన కలవారు. ధైవభక్తి కలవారు. రహస్య విషయాలను ఛేదించటంలో సిద్ధహస్తులు. నృత్య కళాకారులుగా రాణిస్తారు. విజ్ఞానవంతులు. మేధాశక్తితో భవిష్యత్ విషయాలను చక్కగా అందంగా తీర్చిదిద్దుకోగలరు. శరీరంలో పాదాలు ఈ రాశికి వర్తిస్తాయి. ఉన్నత విద్యలలో రాణిస్తారు. ఇతరులను అనుసరిస్తారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...