15, జులై 2017, శనివారం

శంకుస్ధాపన చేయు విధానం


శంకుస్ధాపన చేయు విధానం 

గృహ నిర్మాణానికి ప్రదానాధికారం శంకుస్ధాపనతో ఏర్పడుతుంది. శంకుస్ధాపన వలన గృహ యజమాని నూతన ఉత్తేజాన్ని, మానసిక సంకల్పాన్ని పొందుతాడు. ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో ఉండాలంటే ప్రకృతి సహకరించాలి. అటువంటి ప్రకృతిని మనకు అనుకూలంగా ఉండేటట్లు చేసే నివాసాలను తయారు చేసుకొని సుఖ జీవనం గడపటం కోసం శంకుస్ధాపన పద్ధతిని శాస్త్రరీత్యా అనుసరించి సుఖ జీవనం కలిగించే గృహ నిర్మాణాన్ని చేపట్టాలి. గృహారంభం చేయడానికి యజమాని స్ధల శుద్ధి చేసి ఇంటి నమూనా తయారు చేసి నిపుణుడైన స్ధపతి ద్వారా ఏయే ప్రదేశాలలో వాస్తుపూజ చేయాలో ఎక్కడ శంకుస్ధాపన చేయాలో నిర్ణయిస్తాడు. 


శంకువు నిర్మాణం
శంకువులు పాల కర్రతోను, చండ్ర కర్రతోను నిర్మిస్తారు. ఈ శంకువులు గృహ నిర్మాణ సమయంలో తప్పనిసరిగా భూమిలో గర్భస్ధానంలో ప్రతిష్ఠించాలి. ఆ శంకువు భూమిలో ఉన్న శల్య దోషాలను, వాస్తు దోషాలను తొలగించి ఆగృహంలో నివసించే వారికి అన్ని విధాల రక్షణ కవచంలా సహాయ పడుతుంది. శంకువు సూచీ ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా గుండ్రని వస్తువును సూర్యునికి అభిముఖంగా ఉంచినట్లయితే దాని ఛాయ ఒక నియమిత ప్రదేశం వరకు శంకు ఆకారంలో ప్రయాణం చేస్తుంది. ఈ శంకువునకు శక్తిని ఆకర్షించే లక్షణం ఉంది. అందు చేతనే శ్రీచక్రం  కూడా శంకు ఆకారంలోనే ఉంటుంది. మన దేవాలయాలపై ఉంచే పసిడి కలశాలు చివరలు కూడా శంకు ఆకారంలోనే ఉంటాయి.

        సూర్యుని సహస్త్ర కిరణాల ప్రభావాన్ని ఈ శంకువు తనలోకి ఆహ్వానిస్తుంది. దాని ద్వారా ఆ ఇల్లు శక్తి వంతమైన ప్రాణ శక్తిని ఆ ఇంట్లో ఉండే వాళ్లందరికి పంచుతుంది. తద్వారా గృహంలో ఉన్నవారు ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో వర్ధిల్లుతారు. శంకువును వాస్తు పురుషుని నాభి స్ధానంలో ఉంచటం వలన మానవ శరీరానికి పరిపూరకంగా కావలసిన శక్తిని నాభి ద్వారా అందిస్తుంది. శరీరానికి నాభి ద్వారా మాతృ గర్భంలో ఉన్న శిశువుకు తల్లి ఆహారాన్ని ఎలా అందిస్తుందో అదే విధంగా ప్రకృతి మాట వాస్తు పురుషుని నాబి నుండి ఆ స్ధలానికంతటికి శంకు అనే యంత్రం ద్వారా అందిస్తుంది. 

శంకువు కొలతలు:-
బ్రాహ్మణులకు  24'' పొడవు 6'' వెడల్పు
క్షత్రియులకు 20'' పొడవు 6'' వెడల్పు
వైశ్యులకు 16'' పొడవు 6'' వెడల్పు
శూద్రులకు 12'' పొడవు 6'' వెడల్పు 

కాలామృతం, జ్యోతిర్నిబంధం మొదలగు గ్రంధాలు అందరికి 12 అంగుళాల పొడవుగల శంకువు శ్రేయస్కరమని తెలియజేసినాయి. దేవాలయాలకు రాతి శంకువును, మనుష్యాలయాలకు చెక్క శంకువును వాడటం శ్రేయస్కరం. రక్త చందనం, మోదుగ, ఎర్రటేకు, వేప, బిల్వ చెట్లు, వెదురు, తాడి చెట్లు వాడతారు. 

శంకువును 12'' అంగుళాల పొడవు కలిగినది తీసుకొనిన దానిని మూడు భాగాలుగా చేసి అనగా 4'' లుగా విభజించి, శంకువును ఊర్ధ్వముఖంగా ఉంచి కింద 4'' పరిమాణంలో 4 నిలువ గాట్లు, మధ్య 4'' పరిమాణంలో 8 నిలువ గాట్లు పెట్టి చివర 4'' పరిమాణాన్ని చివర కొనను పెన్సిల్ కొన మాదిరి చెక్కి శంకువును ఏర్పాటు చేసుకోవాలి. 

శంకుస్ధాపన
ప్రస్తుత కాలంలో శంకుస్ధాపన ఇంటికి ఈశాన్యంలో గోయి తీసి దానిలో రాళ్ళు వేసి శంకుస్ధాపన చేస్తున్నారు. గ్రంధ ప్రమాణం ఆధారంగా శంకుస్ధాపన వాస్తుపురుషుని నాభి భాగంలో చేయాలని నిర్దేశించాయి. 

ఈశాన్యం నుండి నైరుతి వరకు గల గృహ నిర్మాణ ప్రదేశాన్ని 28 భాగాలుగా చేసి దానిలో వాస్తు పురుషున్ని లిఖించి ఈశాన్యం శిరస్సు నుండి పదిభాగాలు,  నైరుతి పుచ్ఛం నుండి 17 భాగాలు వదిలేసి మిగిలిన ఒక భాగాన్ని నాభిగా నిర్ణయించాలి. ఈ నాభికి మధ్యస్తంగా శంకుస్ధాపన చేయాలని నిర్దేశించబడింది. శంకువును ఈశాన్య కోణంలో గాని, ఇంద్రస్ధానంలో గాని ఉంచాలి. 

ఈశాన్యకోణంలో శంకువును ఉంచటం వలన పుత్రాభివృద్ధి ఉంటుంది. శంకువును ఈశాన్య కోణంలో వచ్చే పిల్లరు కింద కాకుండా తూర్పు ఈశాన్యంలోగాని, ఉత్తర ఈశాన్యంలోగాని, ఊర్ధ్వముఖంగా స్ధాపించాలి. 

ఈశాన్యంలో శంకువును స్ధాపించ్చేటప్పుడు ఇంకా రెండు ప్రక్రియలను చేయాలని మయుడు తెలియజేసినాడు. అవి 

1) గర్భన్యాసం
2) ప్రధామేష్టికాన్యాసం 

గర్భన్యాసం :- గృహ నిర్మాణ కార్యంలో ముందుగా గర్భన్యాసం చేయాలి. గర్భన్యాసం చేయనిచోట నాశనం కలుగుతుంది. గర్భంలో దాన్యముంచి ఆ పైన రాగిపాత్రను ఉంచాలి. ఆ తరువాత రాగిపాత్రలో సుగంధద్రవ్యాలు (పంచద్రవ్యాలు), పంచ మూలికలు, పంచలోహాలు, సప్త ధాతువులు, నవరత్నాలు, ఔషదులు రాగిపాత్రలో ఉంచి గర్భస్ధాపన చేయాలి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గర్భస్ధాపన చేయరాదు. 

 ప్రధామేష్టికాన్యాసం:- ప్రధామేష్టికాన్యాసం అంటే ప్రధమ ఇటుకను స్ధాపించటం. మయుని వచనం ప్రకారం ముఖ ద్వారం గల గోడలో ప్రధామేష్టికాన్యాసం చేయాలి. అక్కడ ముఖద్వారం ఏ దిశలో ఉంటే ఆదిశలో గర్భస్ధాపన చేయాలి. ముఖద్వారం సాధారణంగా ఏకాశీతి పద వాస్తువును అనుసరించి తూర్పున మహేంద్రపదంలో, దక్షిణాన గృహక్షత పదంలోను, పడమర పుష్ప దంత పదంలోను, ఉత్తరమున భాల్లాట పదంలోను గర్భస్ధాపన చేయాలి. ఏ ముఖ ద్వారం కలిగిన ఇంటికైనా ఈశాన్య కోణంలో గర్భ గృహానికి తూర్పు ఉత్తర గోడలు కలియు మూల ప్రధామేష్టికాన్యాసం చేసే ఆచారం ప్రస్తుతం అమలులో ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...