10, జులై 2017, సోమవారం

దశమాంశ వర్గ చక్రం

దశమాంశ వర్గ చక్రం

ఒకరాశిలో 10 వ భాగం దశమాంశ అవుతుంది. ఒక్కో భాగం 3° ప్రమాణం ఉంటుంది. రాశి చక్రంలో మొత్తం 120 దశమాంశలు ఉంటాయి.  బేసి రాశులకు ఆ రాశి నుండి, సరి రాశులకు నవమ స్ధానం నుండి గణన ప్రారంభమవుతుంది.

దశమాంశ చక్రం ద్వారా మనం చేసే కర్మలు, వాటి ఫలితాలు, ఉద్యోగం, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు, వృత్తిలో అంచనాలు, పోటితత్వం, విజయాలు, సమాజంలో తమకున్న ప్రాముఖ్యత, సంఘంలో పలుకుబడి మొదలగు వాటిని తెలుసుకోవచ్చును.  దశమాంశ వర్గ చక్రంలో గురువు ఉన్న స్ధితిని బట్టి వ్యాపారం లేదా ఉద్యోగంలో పురోగతి మరియు పెరుగుదల గురించి తెలుసుకోవచ్చును.


శని ఉన్న స్ధితిని బట్టి శ్రమ, అన్నిరకాలైన పనుల గురించి తెలుసుకోవచ్చును. బుధుడు ఉన్న స్ధితిని బట్టి వ్యాపారం మరియు వాటిలో మెళుకువలు, వాక్శుద్ది తెలుసుకోవచ్చును. సూర్యుడు ఉన్న స్ధితిని బట్టి ఆత్మవిశ్వాసం, అధికారం, ప్రభుత్వ ఉద్యోగం మొదలగు విషయాలు తెలుసుకోవచ్చును.

ఇంద్ర, అగ్ని, యమ, రాక్షస, వరుణ, వాయు, కుబేర, ఈశాన, బ్రహ్మ, అనంత మొదలగు అధినాధులు బేసిరాశులకు క్రమంగాను, అనంత, బ్రహ్మ, ఈశాన, కుబేర, వాయు, వరుణ, రాక్షస, యమ, అగ్ని, ఇంద్ర మొదలగు అధినాధులు సరి రాశులకు క్రమంగాను అవుతున్నారు.

౦° నుండి 3° వరకు బేసిరాశులకు, 27° నుండి 30° వరకు సరిరాశులకు అధిపతియైన ఇంద్ర స్ధానంలో ఎక్కువ గ్రహాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగం, ఉన్నతమైన పదవులు, రాజకీయ నాయకులుగా , గౌరవప్రదమైన, కీర్తిప్రదమైన వృత్తులలో రాణిస్తారు.

3° నుండి 6° వరకు బేసిరాశులకు, 24° నుండి 27° వరకు సరిరాశులకు అధిపతియైన అగ్ని స్ధానంలో ఎక్కువ గ్రహాలు ఉన్న అగ్ని సంబందిత వృత్తులలో రాణిస్తారు. సోలార్, అగ్నిమాపక శాఖలలోను, ఎలట్రానిక్, గ్యాస్ ఏజన్సీస్, పెట్రోలియం, ఇంజనీరింగ్ వృత్తులలో రాణిస్తారు.

 6° నుండి 9° వరకు బేసిరాశులకు, 21° నుండి 24° వరకు సరిరాశులకు అధిపతియైన యమ స్ధానంలో ఎక్కువ గ్రహాలు ఉన్న న్యాయవాదులుగా, టెలికాం, దేశ రక్షణ రంగాలలో, ఎలట్రికల్ ఇంజనీరింగ్, రైల్వే ఉద్యోగాలలో, అణు వ్యవస్ధలలో, పేలుడు పదార్ధాల వృత్తులలో, సమాచార రంగాలలో, లోహ పరిశ్రమలలో రాణిస్తారు.

9° నుండి 12° వరకు బేసిరాశులకు, 18° నుండి 21° వరకు సరిరాశులకు అధిపతియైన రాక్షస స్ధానంలో ఎక్కువ గ్రహాలు ఉన్న హింసాత్మకమైన వృత్తులలో, చట్టవ్యతిరేక కార్యక్రమాలలో, రహస్య వృత్తులలో రాణిస్తారు.

12° నుండి 15° వరకు బేసిరాశులకు, 15° నుండి 18° వరకు సరిరాశులకు అధిపతియైన వరుణ స్ధానంలో ఎక్కువ గ్రహాలు ఉన్న టూరిజం వృత్తులలో, మత్స్య పరిశ్రమలలో, ఔషద వృత్తులలో, నౌకా రంగాలలో, నీటికి సంబందించిన వృత్తులలో రాణిస్తారు.

15° నుండి 18° వరకు బేసిరాశులకు, 12° నుండి 15° వరకు సరిరాశులకు అధిపతియైన వాయు స్ధానంలో ఎక్కువ గ్రహాలు ఉన్న పండితులుగా, ఉపాధ్యాయులుగా, తత్వవేత్తలుగా, రచయితలుగా రాణిస్తారు.

18° నుండి 21° వరకు బేసిరాశులకు, 09° నుండి 12° వరకు సరిరాశులకు అధిపతియైన కుబేర స్ధానంలో ఎక్కువ గ్రహాలు ఉన్న గోల్డ్ ట్రేడింగ్, మనీ ట్రేడింగ్, పన్నులు వసూలు చేసే వృత్తులలో, చార్టెడ్ ఎక్కౌటెంట్ వృత్తులలో రాణిస్తారు.

21° నుండి 24° వరకు బేసిరాశులకు, 06° నుండి 09° వరకు సరిరాశులకు అధిపతియైన ఈశాన స్ధానంలో ఎక్కువ గ్రహాలు ఉన్న ధార్మిక రంగాలలో, ఆధ్యాత్మికమైన రంగాలలో, ప్రవచన కర్తగా, వేద పఠనం నేర్పేవారుగా, అద్యాపకులుగా, బ్యాంక్ ఉద్యోగులుగా రాణిస్తారు.

24° నుండి 27° వరకు బేసిరాశులకు, 03° నుండి 06° వరకు సరిరాశులకు అధిపతియైన బ్రహ్మ స్ధానంలో ఎక్కువ గ్రహాలు ఉన్న పరిశోధనా రంగాలలో, సైంటిస్ట్ లుగా రాణిస్తారు.

27° నుండి 30° వరకు బేసిరాశులకు, 00° నుండి 03° వరకు సరిరాశులకు అధిపతియైన అనంత స్ధానంలో ఎక్కువ గ్రహాలు ఉన్న అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకునే వృత్తులలో రాణిస్తారు. ట్రేడింగ్, షేర్స్ వృత్తులలో రాణిస్తారు.

అర్ధ త్రికోణ రాసులైన 2, 6, 10 భావాధిపతులు వర్గ చక్రంలో ఉన్న స్ధితిని బట్టి సంపాదనా మార్గాలను తెలుసుకోవచ్చును.

దశమాత్ దశమం అయిన సప్తమ స్ధానాన్ని దశమాంశ వర్గ చక్రంలో పరిశీలించవలెను. రాశిచక్రం లో  దశమాదిపతి దశమాంశ చక్రంలో సప్తమంలో ఉంటే వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి బాగుంటుంది.

రాశిచక్రంలో దశమాధిపతి అయిన రవి దశమాంశ వర్గ చక్రంలో  సప్తమంలో ఉంటే రాజకీయ నాయకుడు గాని ప్రభుత్వ ఉద్యోగిగాని సీనియర్ అధికారిగా గాని రాణిస్తాడు.

రాశిచక్రంలో దశమాధిపతి అయిన చంద్రుడు దశమాంశ వర్గ చక్రంలో  సప్తమంలో ఉంటే హోటల్స్  గాని రెస్టారెంట్స్  వ్యాపారాలలో రాణిస్తాడు. ప్రజా సంబంద, ద్రవ సంబంద వ్యాపారాలలో రాణిస్తారు.

రాశిచక్రంలో దశమాధిపతి అయిన కుజుడు దశమాంశ వర్గ చక్రంలో  సప్తమంలో ఉంటే పోలీస్  గాని ఆర్మీ లోగాని   రాణిస్తాడు. ఎలక్ట్రానిక్ రంగాలలో రాణిస్తారు.

రాశిచక్రంలో దశమాధిపతి అయిన బుధుడు దశమాంశ వర్గ చక్రంలో  సప్తమంలో ఉంటే వ్యాపారంలో గాని, పత్రికా విలేఖరిగా గాని, రచనలలో గాని, పచురణలలో గాని రాణిస్తాడు. చదవటం, వ్రాయటం, సమాచారం సేకరించటం, సమాచార ప్రసార మాధ్యమాలలోను, వివిధ రకాలైన రవాణా వృత్తుల యందు రాణిస్తారు.

రాశిచక్రంలో దశమాధిపతి అయిన గురువు దశమాంశ వర్గ చక్రంలో  సప్తమంలో ఉంటే న్యాయాధికారిగా, ప్రవచన కర్తగా రాణిస్తాడు. ఫైనాన్స్ వృత్తుల యందు, సలహాదారులుగా రాణిస్తారు. పూజారిగా రాణిస్తారు.

రాశిచక్రంలో దశమాధిపతి అయిన శుక్రుడు దశమాంశ వర్గ చక్రంలో  సప్తమంలో ఉంటే చిత్రలేఖకులుగా, సినిమాలలోనూ, ఫ్యాషన్ డిజైనర్, కవిత్వం చెప్పేవారుగా రాణిస్తారు. ఆభరణ వృత్తుల యందు, కార్ల వృత్తుల యందు, సౌందర్య ఉపకరణ వృత్తుల యందు రాణిస్తారు.

రాశిచక్రంలో దశమాధిపతి అయిన శని  దశమాంశ వర్గ చక్రంలో  సప్తమంలో ఉంటే భూగర్భ పనులకు సంబందించిన వృత్తులు, మైనింగ్, యంత్రాలకు సంబందించిన వృత్తులలో రాణిస్తారు.

రాశిచక్రంలో దశమాధిపతి అయిన రావువు గాని కేతువు గాని  దశమాంశ వర్గ చక్రంలో  సప్తమంలో ఉంటే ఎగుమతులు, దిగుమతులు కలిగిన వృత్తులలో, ఎలక్ట్రానిక్ పరికరాల వృత్తులలో రాణిస్తారు. రాహువు పెద్ద పెద్ద కంపెనీలు, ప్యాక్టరీలు, పెద్ద నిర్మాణ ప్రాజెక్టులకు ప్రాదాన్యత వహిస్తాడు.

రాశి చక్రంలో షష్ఠాధిపతి దశమాంశ చక్రంలో ఉచ్చ స్దితిలోగాని, దశమంలో శుభగ్రహ దృష్టి కలిగి ఉన్న ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. అదే సప్తమాధిపతి దశాంశ చక్రంలో ఉచ్చ స్దితిలోగాని, దశమంలో శుభగ్రహ దృష్టి కలిగి ఉన్న  వ్యాపారంలో రాణిస్తారు.

మన పై అధికారులను నవమ స్ధానంలో చూడవలెను. ఆ అదికారి ఆధీనంలో ఉన్న సిబ్బందిని పంచమ స్ధానంలో చూడవలెను. నవమ స్ధానం పాపార్గళం పొందితే తన కింద ఉన్న సిబ్బందిని అవమాన పరచటం, తనపై దుష్ప్రబావాలు మోపటం, ఈర్షాద్వేషాలు కలిగి ఉండటం జరుగుతుంది. నవమ స్ధానం శుభార్గళం పొందితే తనక్రింద ఉన్న సిబ్బందికి అన్నీ విధాలా సహాయసౌకర్యాలు అందించటమే కాకుండా తన సిబ్బందిని సొంత పిల్లలుగా చూసుకుంటాడు. ప్రమోషన్ భాద్యతను తనే వహిస్తాడు.

లగ్నం ద్వారా స్వశక్తిని, షష్ఠమ స్ధానం ద్వారా సేవలను, దశమం ద్వారా శక్తి సామర్ధ్యాలను, విజయాలను తెలుసుకోవచ్చును. లగ్నాధిపతి దశమాంశ చక్రంలో తృతీయంలో ఉన్న దశ అంతర్ధశలలో ఉద్యోగానికి కొన్నాళ్లు సెలవు  పెట్టటం జరుగుతుంది.  షష్ఠమాధిపతి దశమాంశ చక్రంలో అష్టమంలో ఉన్న దశ అంతర్ధశలలో ఉద్యోగానికి రిటైర్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. దశమాధిపతి దశమాంశ చక్రంలో వ్యయంలో ఉన్న చాలా రోజుల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టటం జరుగుతుంది.

దశమాంశ వర్గ చక్రంలో దశమంలో శని ఉన్న నిరుద్యోగాన్ని కల్పిస్తాడు. లేదా చాలా కాలానికి ఉద్యోగాన్ని కల్పిస్తాడు. దశమాంశ వర్గ చక్రంలో దశమంలో శని ఉన్న దశ అంతర్ధశలలో ఉద్యోగం పోవటం జరుగుతుంది. ఈ శని గ్రహంతో కుజుడు కలసిన అవమానాలు పొందటం లేదా అపకీర్తి తెచ్చుకోవటం జరుగుతుంది.

2 కామెంట్‌లు:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...