4, ఏప్రిల్ 2017, మంగళవారం

నవాంశవర్గ చక్ర నిర్మాణ పద్ధతి

నవాంశవర్గ చక్ర నిర్మాణ పద్ధతి 

రాశిలో 9 వ భాగమును నవాంశ అంటారు. రాశి పరిమాణం 30 డిగ్రీలు ఉంటుంది. దీనిని తొమ్మిది భాగాలు చేయగా 3డిగ్రీల 20 నిమిషాలు వస్తుంది. ఒక నవాంశ అంటే 3° 20' ఒక నక్షత్ర పాదం. ఒక రాశిలో 9 నవాంశలు ఉంటాయి. రాశి చక్రంలో మొత్తం 108 నవాంశలు ఉంటాయి. నవాంశ వర్గ చక్రాన్ని స్ధూల మరియు సూక్ష్మ పరిశీలనకు ఉపయోగిస్తారు. రాశి చక్రములో ఉన్న గ్రహాలు నవాంశ చక్రములో బాగుంటేనే ఆ గ్రహము యొక్క ఫలితాన్ని పొందుతారు. రాశి చక్రములో యోగం ఉన్నప్పుడు ఆ యోగ కారక గ్రహాలు నవాంశలో మంచి స్ధితిలో ఉంటేనే ఆ యోగాన్ని పొందుతారు. గ్రహాల యొక్క అంతర్గత శక్తిని ఈ నవాంశ వర్గ చక్రం ద్వారా పరిశీలించవచ్చును. నవాంశ చక్రములో గ్రహ దృష్టులు, యోగాలను చూడరాదు. గ్రహాలు స్వక్షేత్రం, మిత్ర క్షేత్రం, ఉచ్చలలో ఉన్నాయా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవలెను. రాశి చక్రంలోని లగ్నం నవాంశ లగ్నానికి షష్టాష్టకం అయిన అశుభ ఫలితాలను ఇస్తుంది.  గ్రహాలు కూడా నవాంశ లగ్నానికి షష్టాష్టకం అయిన అశుభ ఫలితాలను ఇస్తుంది. 


నవాంశ వర్గ చక్ర నిర్మాణం

ఏదైనా గ్రహం అగ్నితత్వరాశులలో ఎన్నో నవాంశలో ఉందో అన్ని నవాంశలు మేష రాశి నుండి లెక్కించాలి. గ్రహం భూతత్వరాశిలో ఉంటే మకరరాశి నుండి లెక్కించాలి. గ్రహం వాయుతత్వరాశిలో ఉంటే తులారాశి నుండి లెక్కించాలి. గ్రహం జలతత్వరాశులలో ఉంటే కర్కాటక రాశి నుండి లెక్కించాలి.

మరొక పద్ధతి ద్వారా ఏదైనా గ్రహం చరరాశిలో ఉంటే అన్ని నవాంశలను అదే స్ధానం నుండి లెక్కించాలి. స్దిరరాశిలో ఉంటే అన్ని నవాంశలను 9 వ స్ధానం ఏ రాశి అవుతుందో ఆ రాశి నుండి లెక్కించాలి. ద్విస్వభావ రాశులకు 5 వ స్ధానం నుండి లెక్కించాలి.     

మరొక పద్ధతి ద్వారా నక్షత్ర పాదాలను అనుసరించి ఉంటుంది. మేషం నుండి అశ్వనీ నక్షత్రం 4 పాదాలు వరుసగా, భరణి 4 పాదాలు, కృత్తిక 4 పాదాలు వరుసగా వెయ్యాలి. మరలా 3 నక్షత్రాల చొప్పున వరుసగా వెయ్యాలి. ఆ విధంగా 27 నక్షత్రాలను వరుసగా వెయ్యాలి. రాశి చక్రంలో గ్రహం ఏ క్షేత్రం, ఎన్నో పాదంలో ఉందో చూచి నవాంశలో ఎక్కడ సూచిస్తుందో అక్కడ ఆ గ్రహాన్ని వేయాలి.

వర్గోత్తమ నవాంశ

రాశి చక్రంలోను మరియు నవాంశ చక్రంలోను ఏదైనా గ్రహం లేదా లగ్నం ఒకే రాశిలో ఉంటే ఆ గ్రహమును లేదా లగ్నాన్ని వర్గోత్తమం అంటారు. చర రాశిలోని మొదటి నవాంశ, స్ధిరరాశిలోని 5 వ నవాంశ, ద్విస్వభావ రాశిలోని 9 వ నవాంశలను వర్గోత్తమములు అంటారు. వర్గోత్తమంలో ఉన్న గ్రహాలు శుభ ఫలితాలను ఇచ్చును.

పుష్కర భాగాలు

మేష రాశిలో 21°, వృషభంలో 14°, మిధునంలో 24°, కర్కాటకంలో 7°, సింహంలో 21°, కన్యలో 14°, తులలో 24°, వృశ్చికంలో 7°.ధనస్సులో 21°, మకరంలో 14°, కుంభంలో 24°, మీనంలో 7°  లను పుష్కర భాగాలు అంటారు. ఇవి మేషం నుండి కర్కాటకం, సింహం నుండి వృశ్చికం, ధనస్సు నుండి మీనం వరకు వరుసగా రిపీట్ అవుతాయి.

పుష్కర నవాంశ

మేషరాశిలో 7,9 నవాంశలు, వృషభంలో 3,5 నవాంశలు, మిధునంలో 6,8 నవాంశలు, కర్కాటకంలో 1,3 నవాంశలు పుష్కర నవాంశలు అంటారు. రాశి చక్రంలో లగ్నం గాని ఇతర గ్రహాలు గాని ఈ పుష్కర భాగాలలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో పవిత్రంగా ఉంటాడు. ముహూర్త లగ్నం విషయంలోనూ లగ్నం మరియు భావ సంబంద గ్రహం పుష్కర భాగంలో ఉన్నప్పుడూ అది ఎంతో పవిత్రమైన లగ్నంగా భావిస్తారు. గోచారంలో గ్రహం పుష్కర భాగాలలోకి వచ్చినప్పుడు మంచి ఫలితాలనే ఇస్తుంది. మహాదశ, అంతర్ధశలలోనూ పుష్కరాంశలో ఉండే గ్రహం శుభ ఫలితాలనే ఇస్తుంది. గోచారరీత్యా గ్రహం పుష్కరాంశలలో ఉన్నప్పుడు పాప స్ధానాలైన సరే శుభఫలితాలనే ఇస్తాయి.

దైవ గుణ నవాంశలు
0°  నుండి 3° 20' ప్రధమ నవాంశ
10° 00' నుండి 13° 20' చతుర్ధ నవాంశ
20° 00' నుండి 23° 20' సప్తమ నవాంశ

మనుష్య గుణ నవాంశలు
3° 20' నుండి 6° 40' ద్వితీయ నవాంశ
13° 20' నుండి 16° 40' పంచమ నవాంశ
23° 20' నుండి 26° 40' అష్టమ నవాంశ

రాక్షస గుణ నవాంశలు
6° 40' నుండి 10° 00' తృతీయ నవాంశ
16° 40' నుండి 20° 00' షష్టమ నవాంశ
26° 40' నుండి 30° 00' నవమ నవాంశ

దైవ గుణ నవాంశలలో లగ్నం గాని గ్రహాలు గాని ఉంటే ధర్మపరులుగా, సంపన్నులుగా, ఉదారం స్వభావం కలిగి ఉంటారు. గౌరవనీయమైన జీవితం ఉంటుంది. పవిత్రమైన మనస్సు కలిగి ఉంటారు. పవిత్రమైన పూజలు చేయువారు అగుదురు.

మనుష్య గణ నవాంశలలో లగ్నం గాని గ్రహాలు గాని ఉంటే సామాజిక సంబంధాలు కలిగి ఉంటారు. నీతి నిజాయితీ కలిగి ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. శక్తివంతంగా ఉంటారు. ఆసక్తి మరియు ఇతరులకు సేవ చేసుకోవటం. అందరికి సహాయ సహకారాలు అందించువారుగా ఉంటారు.

రాక్షస గుణ నవాంశలలో లగ్నం గాని గ్రహాలు గాని ఉంటే క్రూరమైన మనస్తత్వం, చెడ్డ పనులపైనా ఆసక్తి ఉండటం, హింసాత్మక చర్యలకు పాల్పడటం, అత్యాశ కలిగి ఉండటం, అసూయ కలిగి ఉండటం, చెడు వ్యామోహాలకు లొంగి పోవటం పాపపు పనులపైన ఆసక్తి కలిగి ఉండటం చేస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...