19, ఏప్రిల్ 2017, బుధవారం

వివాహ విషయంలో సప్తమ స్ధానం ప్రాముఖ్యత



వివాహ విషయంలో సప్తమ స్ధానం ప్రాముఖ్యత 

        భారతీయ సాంప్రదాయంలో వివాహం జీవితంలో ఒకే ఒకసారి జరిగే అతి ముఖ్యమైన అంశం. వివాహం అనంతరం భార్యా భర్తలు జీవితాంతం కలసి ఉండే విధంగా జాతకాదులు పరిశీలించాలి. వివాహ విషయంలో కేవలం వధూవరుల గుణమేళన పట్టికలోని గుణాలను మాత్రమే పరిశీలించటమే కాకుండా, మిగతా అంశాలైన సప్తమ స్ధానం, పంచమ స్ధానం, వివాహానంతర దశలు మొదలగు అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవలెను. 


         ప్రస్తుతం వధూవరుల నిర్ణయ విషయంలో ఉభయులకు విద్య, వృత్తి, సంపాదన, ఆస్తి, అందం, రంగు, పొడవు, ఎత్తు, లావు, సన్నం అనే విషయాలపై శ్రద్ధ వహిస్తూ ఇద్దరి మధ్య సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇద్దరి మద్య సఖ్యత లోపించినప్పుడు పై అంశాలు అన్ని నిరర్ధకం అని తెలుసుకోవాలి.

         యుక్త వయస్సు దాటి ఆలస్యమవుతుందని ఆరాట్మ్లో ఏదో ఒక సంబందాన్ని కుదుర్చుకోవాలనే ఆతృత కంటే వధూవరుల శాశ్వత సౌఖ్యానికి అధిక ప్రాదాన్యమిచ్చి ఆలస్యమైనా సరైన సంబంధం నిర్ణయించటం సముచితం.

      ప్రస్తుత సమాజంలో మహిళలు విద్య, వివిధ రంగాలలో ఉత్సాహం చూపిస్తూ స్వతంత్ర భావాలు, స్వాభిమానం, ధైర్యం పెంపోందించుకుంటున్నారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు నిర్వహిస్తూ స్వయంగా సంపాదనకు ప్రాముఖ్యం ఇస్తూ పురుషులకు పోటీతత్వంగా ఉంటున్నారు. కళలు, క్రీడలు, రాజకీయ రంగాలలో రాణిస్తున్నారు. కనుక శక్తికి, చైతన్యానికి, స్వతంత్ర భావాలకు, ధైర్య సాహసాలకు కారకుడు అయిన కుజ గ్రహం వీరి జాతకాలలో బలంగా కనిపిస్తుంది. వివాదాలకు కూడా కుజుడే కారకుడు కావటం వలన దాంపత్య జీవితంలో ప్రతికూల స్ధానంలో ఉన్న కుజుడు సఖ్యతకు భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి. విద్యా అర్హతలతో ఉద్యోగాలలో రాణిస్తున్న నేటి మహిళలు భర్త వేదింపులు సహించలేక ఎటువంటి సంకోచం లేకుండా విడాకులకు సిద్ధమవుతున్నారు. కనుక తల్లిదండ్రులు, వధూవరుల జాతకంలోని సఖ్యత విషయమై నిదానంగా పరిశీలించి నిర్ణయాలకు రావటం శ్రేయస్కరం. 

           ముందుగా ఇద్దరి  జాతకాలలోని సప్తమ స్ధానం, అక్కడి గ్రహాలను, సప్తమాధిపతి ఉన్న రాశి, భావాలను, వాటికి ఇతర గ్రహాల దృష్టి సంయోగాలను పరిశీలించాలి. 

         సప్తమంలో రవి, బుధ గురు, శుక్రులు శుభ ఫలితాన్ని ఇస్తారు. చంద్రుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. శని, రాహు, కేతువులు బాధను కలిగిస్తారు. వక్రించిన గ్రహాలు సప్తమంలోఉన్న, సప్తమాధిపతి వక్రించిన వివాహ సంబంధాలు నిర్ణయించటం కష్టం అవటమే కాకుండా ఆలస్యమవుతుంది.  

        లగ్నాధిపతికి సప్తమాధిపతి సంయోగం కానీ, పరస్పర కోణ స్ధితి ఉన్న ఇద్దరి మధ్య సఖ్యతకు నిదర్శనంగా ఉంటుంది. 

            సప్తమ స్ధానంలో శనిగ్రహం ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది. లేదా ఇద్దరి మద్య వయో భేదం ఉంటుంది. లేదా ఇదివరకు వివాహం అయిన వారితో పెళ్ళి జరగచ్చు. లేదా వివాహం పట్ల విముఖత, అశ్రద్ధ, అసంతృప్తి కనిపించవచ్చు. సప్తమ శనికి శుభదృష్టి ఉంటే క్రమేణ అనుబంధాలు బలపడతాయి. కేంద్రంలో ఉన్న రవి, చంద్ర, శుక్రులకు శనితో సంయోగం ఇబ్బందికరంగా ఉంటుంది. 

             సప్తమంలో కుజుడి వలన తీవ్ర విభేధాలు, వివాదాలు సంవిస్తాయి. కేంద్రంలో ఉన్న చంద్ర, శుక్రులతో  కుజుడు కలసి ఉన్న ప్రతికూల పరిస్ధితులు ఉంటాయి. గురు దృష్టి ఉన్న అనుకూలంగా ఉండును.

             సప్తమంలో రాహు, కేతువుల వలన అపోహలతో సంసార జీవితాన్ని పాడు చేసుకుంటారు. అన్య మతస్ధులతో గాని ఇతర కులస్ధులతో గాని వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. శుభగ్రహ దృష్టి ఉంటే అనుకూల పరిస్ధితులు ఉంటాయి.
          
          లగ్నం, సప్తమ స్ధానం ద్విస్వభావ రాశులైన మిధునం, మీన, కన్య రాశులై  రవి, చంద్ర, కుజ, శుక్రులు సప్తమాధిపతి  ద్విస్వభావ రాశులలో ఉంటే రెండు వివాహాలు గాని, వివాహేతర సంబంధాలు గాని జరగవచ్చు.

             సప్తమ స్ధానంలో చంద్రుడు ఉన్న అందమైన వారితో గాని, సంచార వృత్తి లేదా ఉద్యోగం ఉన్న వారితో గాని, జన సంబంద, జనాకర్షణ కలిగిన వృత్తులలో ఉన్న వారితో వివాహం జరిగే అవకాశం ఉంది. సప్తమ చంద్ర స్ధితి కొంత వ్యామోహాలకు, చంచలత్వానికి సంకేతంగా ఉంటుంది.

            లగ్నం నుండి చతుర్ధాధిపతికి సప్తమం, సప్తమాధిపతితో సంబంధం ఏర్పడిన మాతృ వర్గీయులతోను, దశమాధిపతికి సప్తమం, సప్తమాధిపతితో సంబంధం ఏర్పడిన పితృ వర్గీయులతో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. 

             లగ్నం నుండి తృతీయ, నవమ స్ధానాలకు సప్తమ స్ధానంతో సంబంధం ఏర్పడితే  సోదరి, సోదరులు లేదా ధూరపు బందువులకు సంబందించిన వారితో లేదా వారి చొరవతో వివాహం  జరుగుతుంది. 

        సప్తమాధిపతి నవమ, ద్వాదశ స్ధానాలలో ఉంటే విదేశాలలో ఉన్నవారితో గాని, భోధన, ప్రచార, సమాచార, సంచార రంగాలలో ఉన్న వారితో వివాహం జరగవచ్చును. 

        సప్తమాధిపతి షష్టమ, అష్టమ, ద్వాదశ స్ధానాలలో ఉన్న వైద్యులతో  వివాహం జరుగవచ్చు.

సప్తమాధిపతి పంచమ, లాభ, తృతీయ, నవమ స్ధానాలలో ఉన్న, లేదా వాటి అధిపతులు సప్తమంలో ఉన్న ప్రేమ వివాహాలు జరుగవచ్చు. 

సప్తమాధిపతి ద్వాదశ భావాలలో భావంలో ఉన్న ఆ భావానికి సంబంధించిన విషయాలలో ఆసక్తి గాని, వృత్తిగాని, ప్రాదాన్యం గాని ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...