20, డిసెంబర్ 2017, బుధవారం

మూడమిలో పెళ్ళిచూపులు

మూడమిలో పెళ్ళిచూపులు

పూర్వకాలామృతం ప్రకారం ‘అదౌస్వేప్సిత దేవతాం గ్రహగణం సంపూజ్యకర్తుస్తదా - తారాచంద్ర బలాన్వితే శుభదినే లగ్నే శుభేవాసరే’ అని చెప్పారు.

దేవతలను గ్రహగణములను పూజించి తారాచంద్ర బలములతో కూడి శుభదిన శుభలగ్న శుభ వారములలో జ్యోతిశ్శాస్తవ్రేత్తలను సంప్రదించి వధూవరుల జాతక వివరాలు చూపి ప్రయత్నాలు ప్రారంభించమని చెప్పారు. మరి తారాబలం కూడిన శుభ దినంలోనే మాటలాడమని చెప్పారు కదా! ఇక ఆషాఢం, భాద్రపదం, పుష్యమాసాలు, మూఢమి దినములు శుభముకు పనికిరావు కదా. అందువలన ఈ మూఢమి వంటి రోజులలో పెండ్లి చూపులు చూడరాదు. దానికి ఒక పెద్ద కారణం ఉంది.

వధూవరులు ఇరువురు మొదట చూసుకున్న సమయం మంచిది కాకపోతే ఆ ప్రభావం జీవితాంతం వెంబడిస్తుంది. శాస్త్రంతో పనులు చేద్దాం అనుకుంటే శాస్త్రం చెప్పినవి అన్నీ చేయాలి. అలాగ చేయకపోతే సమస్యలు రాగలవు. సరే ఇక మనం యాంత్రిక జీవనంలో వున్నాం సమయం చాలా అరుదుగా కుదిరే సందర్భాలలో మూఢమి వంటివి వస్తే ఏమి చేయాలి అనే ప్రశ్న అందరినీ బాధిస్తుంది. అందుకే శాస్తజ్ఞ్రులయిన పెద్దలు అనుభవం మీద కొన్ని విశేషాలు తెలియజేశారు. అది ఏమిటి అంటే దేవాలయం దైవసన్నిధి.కి దోషం వుండదు కావున వధూవరులను మొట్టమొదట ఏదేని దేవాలయంలో చూసుకునేలాగ చేయుట అనంతరం వారి గృహమందు కలియుట ద్వారా మూఢమి దోషం ఉండదు అని చెబుతారు. ప్రతి విషయంలోనూ దైవ సన్నిధిలో చేయుటకు విశేషం అని వింటున్నాం కదా.

మనం ఏ కార్యం చేసినా గణపతిని ఆరాధించి పెద్దలు, వేద పండితుల ఆశీస్సులు తీసుకొని ప్రారంభించడం మన సంస్కృతి మనకు నేర్పిన పాఠం. రోజువారీ కార్యక్రమాల విషయంగా ఒక వేళ ఈ నియమం పాటింపక పోయినా ప్రతి విశేష కార్యములలోనూ పై నియమం పాటింపవలసినదే అనేది భారతీయ వాదన. విఘ్నములు పోగొట్టువాడు కావున గణపతిని అర్చించడం, పెద్దలు పూజ్యుల నుండి స్వస్తి మంగళ వాచకములు ఆశీఃపూర్వకంగా తీసుకొని ప్రారంభిస్తే అంతా శుభం కలుగుతుంది అనేది ఒక గట్టి నమ్మకం. మంచి పొందేవాడు పై మంచి పనులు తప్పక చేస్తాడు. అలాంటిది జీవితకాల బంధాలకు సంబంధ మైన వివాహం విషయంలో మంచి చూసి ప్రారంభించాలి. సంబంధం తెలిసి దాని ప్రయత్నంలో ప్రారంభంలో ఈ విధంగా గణపతిని పూజ్యులను పూజించి వెళ్లుట శ్రేయస్కరం.

అలా మంచి సమయం కుదరని వారు ఆషాఢంలోనే ఒక మంచిరోజు (ఉన్నంతలో) మంచి వారం తారాబలం కుదిరిన రోజున దైవసన్నిధిలో దేవాలయంలో పెళ్లిచూపులు చూసుకోవడం ద్వారా దుష్ఫలితాలు రావు అని పండితులు చెబుతారు. వధువు తరఫు పెద్దలు వరుని చూచుటకు, వరుని తరఫు పెద్దలు వధువును చూచుటకు ఆషాఢ, భాద్రపద, పుష్య, మూఢమి దోషాలు పట్టింపు కాదు. ఈ మధ్య చాలా అపహాస్యమైన పద్ధతి నడుచుచున్నది. అది ఏమనగా మంచి రోజులలో ఒక సంబంధం చూసేస్తే, తరువాత వాటికి మంచి రోజులతో పట్టింపు లేదు అని. అది తప్పుడు వాదన. 

ప్రతి ప్రయత్నంలోనూ మంచి రోజులు చూసుకోవడం తప్పనిసరి. ఎన్ని సంబంధాలు చూసినా మంచి రోజులకే ప్రాధాన్యం ఇచ్చి శాస్త్ర వాక్యం పాటించిన వారు జీవితాంతం సుఖపడతారు. శాస్త్ర వాక్యములు వాటి పరమార్థం పూర్తిగా తెలుసుకోకుండా మనకు తోచిన మాటలు చెప్పడం సమంజసం కాదు. శాస్త్ర వాక్యాలు లేదా పెద్దల మాటలు తెలుసుకొని చర్చించుకోవడం ద్వారా శాస్త్ర గౌరవం కాపాడినవారవుతారు. తద్వారా ఆచరించిన వారు సుఖపడతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...