11, డిసెంబర్ 2017, సోమవారం

జాతకచక్రంలో తృతీయ భావ విశ్లేషణ

జాతకచక్రంలో తృతీయ భావ విశ్లేషణ 

తృతీయ భావంలో సోదరులు, తోబుట్టువులు, ధైర్యం, సాహసం, దగ్గరి ప్రయాణాలు, ఆయుర్ధాయం, చిత్ర లేఖనం, గొంతు, చెవులు, బంధువులు, జన సహకారం, మిత్రులు, కమ్యూనికేషన్, కవిత్వం, మ్యూజిక్, నృత్యాలు, డ్రామా, క్రీడలలో రాణింపు (స్పోర్ట్స్), వృత్తి సేవకులు, సంతానాభివృద్ధి (పంచమానికి లాభ స్ధానం), స్వయం కృషి, స్వయం ఉపాది, స్వయం వృత్తి, శరీర పుష్టి, భుజాలు, కుడిచేయి, సవతి తల్లి, తల్లి అనారోగ్యం (చతుర్ధానికి వ్యయం), వ్యామోహాలు, కోరికలు (కామ త్రికోణం) ఉపచయ స్ధానం వంటి విషయాలను పరిశీలించవచ్చును. 


తృతీయం ద్వితీయ భావానికి భావాత్ భావం, అష్టమ భావానికి తృతీయం భావాత్ భావం. అందుకే ద్వితీయం, అష్టమం బాగుంటే సరిపోదు తృతీయం కూడా బాగుండాలి. శుక్ర, చంద్రులు తృతీయ భావంపైన ప్రభావం చూపిస్తుంటే చెల్లెల్లు ఉంటారు. రవి, కుజ, గురు గ్రహాల సంబంధం ఉంటే సోదరులు ఉంటారు. కుజుడు తృతీయంలో స్వక్షేత్ర, మిత్ర, ఉచ్చ క్షేత్రాలలో కాకుండా ఇతర క్షేత్రాలలో ఉంటూ శుభగ్రహ వీక్షణ లేకుంటే సోదర సహాకారం ఉండదు. తృతీయంలో రాహువు ఉంటే కుటుంబంలో చిన్న లేదా పెద్ద అయి ఉంటారు. కేతువు ఉంటే కుటుంబంలో చిన్నవాడై ఒక్కడే ఉంటాడు. తృతీయంలో పాపగ్రహాలు ఉంటే ధైర్యం, సాహసం, బలం ఉంటాయి. శుభగ్రహం ఉంటే సౌమ్యత, దూకుడుతనం తక్కువగా ఉంటాయి.  

తృతీయ బావాధిపతి గ్రహ దశ, అంతరదశలలో దగ్గర ప్రయాణాలు చేస్తారు. తృతీయంలో పాపగ్రహం ఉండి శుభగ్రహ దృష్టి లేకుంటే అంగవైకల్యం పొందే అవకాశం ఉంది. 3, 6 అధిపతుల సంబంధం ఉంటే రోగ నిరోదక శక్తి ఉంటుంది. 3, 8 అధిపతుల సంబంధం ఉంటే దీర్ఘ అనారోగ్యం ఉంటుంది. 3, 12 ఆదిపతుల సంబంధం ఉంటే హాస్పటల్ ఖర్చులు ఉంటాయి.  కుజుడు తృతీయాధిపతి బేసి రాసులందుండి పురుష గ్రహాలచే చూడబడుతున్న జాతకునికి సోదరులు ఉందురు. సరి రాసులందుండి స్త్రీ  గ్రహాలచే చూడబడుతున్న జాతకునికి చెల్లెల్లు ఉందురు. తృతీయం బలహీనమైనను కుజుడు లేదా తృతీయాధిపతి గురువుతో కలసిన సోదర సౌఖ్యం ఉంటుంది. గురువు ఏకాదశంలో ఉన్న జ్యేష్ఠ సోదరునితో సమస్యలు వస్తాయి. 

తృతీయాధిపతి రవితో కలసిన తలపొగరు, కోపం ఉంటాయి. చంద్రునితో కలసిన భోళాతనం, కుజునితో ధైర్యం, బుధునితో కలసిన జాగ్రత్త కలవారుగా, గురువుతో కలసిన సూటిగా మాట్లాడతారు. శుక్రునితో కలసిన కాముకులుగా స్త్రీల కారణంగా గొడవలు, శనితో కలసిన మూర్ఖుడిగా, ఉత్సాహం లేనివాడుగా, రాహు, కేతులతో కలసి ఉన్న బయిటకు అమాయకులుగా మంచివారుగా కనపడినను బలహీనమైన మనస్సు కలగి పిరికి వారవుదురు.  మరియు సర్ప భయం కలగి ఉంటారు. 

తృతీయంలో రవి ఉంటే :-ధైర్యం, తెలివితేటలు, మూర్ఖత్వంతో పాటు విజయం కలిగి ఉందురు. సోదరులకు ఇబ్బంది. తండ్రికి అరిష్టం. పాపగ్రహం కావటం వలన జాతకునికి మంచిది. ప్రభుత్వ సహకారం, ఎముకల పుష్ఠి, సహకారం, పొగరు, పౌరుషం, లైంగిక శక్తిని కోల్పోవుదురు. 

తృతీయంలో చంద్రుడు ఉంటే :- సోదరీమణుల సహాకారం, మంచి చిత్రలేఖకులు, క్రియేటివిటి కలిగి ఉంటారు. ప్రయాణాలు అంటే ఇష్టపడతారు. ఈతలో ప్రావీణ్యం ఉంటుంది. తల్లికి అరిష్టం,. జలగండం. జలవ్యాధి, బుధ, శనిగ్రహాలు కలసి ఉంటే నపుంసకులు అగుదురు. వృత్తిలో తరచుగా మార్పులు పొందుతారు. భార్య లేదా భర్త అందంగా ఉంటారు. జ్ఞానం, ఆధ్యాత్మిక విషయాలలో విభిన్న భావాలు కలగి ఉంటారు. మంచి సంతానం, బలహీనమైన క్రూరత్వం, మానసిక శాంతి లేకపోవటం జరుగుతుంది. 

తృతీయంలో కుజుడు ఉంటే:- సోదర, సోదరి విషయాలలో ఇబ్బందులు. క్రీడాకారులుగా రాణింపు, స్వయం ఉపాది, డిఫెన్స్ సర్వీస్, చెవి సమస్యలు, భుజాలు బలహీనం, ప్రయాణాలలో ప్రమాదాలు, కుటుంబంలో భేదాభిప్రాయాలు, నిర్లక్ష్యంగా ఉండటం, మాట వినకపోవటం, ఈ స్ధానం బలహీనమైన  క్రూర ప్రవృత్తి, ఆత్మహత్యలు ఛేసుకోవటం. 

తృతీయంలో బుధుడు ఉంటే:- ఇతరులులకు మంచి మంచి జరుగుతుంది. కాటి తనకు సంతోషం ఉండదు. చురుకుతనం, చదువుపై ఆసక్తి కలిగి ఉంటారు. అప్పగించిన పనిని తెలివితో పూర్తి చేయటం. లౌక్యం, నేర్పు కలిగి ఉంటారు. వ్యాపారంలో రాణిస్తారు. చెస్ క్రీడలో రాణింపు, మిత్రుల, బంధువుల సహాకారం. నరాల బలహీనత, చరరాశి అయితే ప్రయాణాలు, ఆర్టిస్ట్, గణితం, ఆడిటింగ్, మార్కెటింగ్ సేల్స్ ఆఫీసర్ గా రాణింపు. 

తృతీయంలో గురువు ఉంటే:- తెలివికలవాడు, తండ్రితో సత్సంబందాలు ఉండవు. తీర్ధయాత్రలు ఛేస్తారు. ఆధ్యాత్మిక పుస్తకాలు వ్రాయటం, వినటం, తోబుట్టువుతో అన్యోన్నత, గురువు పాపి అయితే కృతజ్ఞత, దయాగుణం, మిత్రులు లేనివారగుదురు. సాంప్రదాయం పాటించనివారు. అవకాశాలను ఉపయోగించుకోలేని వారై ఉంటారు.  

తృతీయంలో శుక్రుడు ఉంటే:- మానసికంగా మంచిగా ఉన్న అనారోగ్యవంతులు. జీవశక్తి లేనివారై ఉంటారు. గానం, సంగీతం, నృత్యం, లలితా కళలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆర్ధికపరమైన విజయావకాశాలు తక్కువ. శుక్రుడు బలహీనుడైన బీదరికం, పాప బుద్ధి, శారీరక సుఖాలు లేకపోవటం జరుగుతుంది. ఇతరులను బయపెట్టటం, అపవాదులు వేయటం. సోదరులు ఉన్నత స్ధితి కలిగి ఉంటారు. సంతాన సౌఖ్యం ఉండదు. బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్, డ్రాయింగ్, నపుంసకుడు, భార్యా విధేయుడు, వినోదయాత్రలు చేయటం. కామాశక్తి కలిగి ఉంటారు. 

తృతీయంలో శని ఉంటే :- ఆయుర్దాయం కలిగి ఉంటారు. ప్రజల సహకారం, బద్ధకస్తుడు. మానసిక సమస్యలు, సంతానం వలన సమస్యలు, తోబుట్టువులకు అరిష్టం, సోదర నష్టం, ధైర్యసాహసాలు, క్రూరత్వం కలిగి ఉంటారు. మునిసిపాలిటిలో ఉధ్యోగాలు, నిరాశ నిస్పృహాలు కలిగి అనేక వ్యతిరేకతలకు లోనై తరువాతనే విజయవంతులు అవుతారు. ఉద్వేగం, అనుమానం, కోపం కలిగి ఉంటారు. 

తృతీయంలో రాహువు ఉంటే :- బయటకు ధైర్యంగా కనిపిస్తారు. ఆకస్మిక, అనుకోని వార్తలు వినటం, సోదరుల విషయంలో మంచిది కాదు. వీరి ఆలోచనలు, ఉద్దేశాలు కారణంగా విమర్శలు ఎదుర్కొంటారు. ఆయుర్ధాయం, చెవి సమస్యలు, ఎక్కువ మంది చెల్లెల్లు కలిగి ఉంటారు.లోతు వియయాలపై ఆసక్తి. 

తృతీయంలో కేతువు ఉంటే:- క్రీడలలో రాణింపు, చురుకుతనం, ధన సంపాదన, భౌతికపరమైన సుఖాలు, శత్రువులపై విజయాలు, కుటుంబంలో చిన్నవాడై ఉంటాడు. భయస్తులు, వైరాగ్యం, మానసిక చింతన కలిగి ఉంటారు. బ్రాంతి కలిగి ఉంటారు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...