7, జూన్ 2017, బుధవారం

లగ్నంలో వివిధ గ్రహాల ఫలితాలు మరియు లగ్నాధిపతి వివిధ భావాలలో ఉంటే కలుగు ఫలితాల సమగ్ర పరిశీలన

లగ్న భావ పరిశీలన

లగ్నం అంటే జన్మించే సమయానికి తూర్పు దిగ్మండలంపై ఏ రాశి ఉదయిస్తుందో అదే లగ్నం అంటారు. లగ్నం నుండి శరీరం, ఎత్తు, రంగు, రూపం, సామర్ధ్యం, ఆయుర్ధాయం, వ్యక్తిత్వం, వ్యక్తి యొక్క గుణాలు, తెలివితేటలు మొదలగు అంశాలను తెలుసుకోవచ్చును. పుట్టిన వ్యక్తి యొక్క జన్మ సమయాన్ని శిశువును గర్భాశయం నుండి బయటకు తీసినప్పుడు కాకుండా శిశువు మొదటి శ్వాస, మొదటి ఏడుపు ద్వారా  శిశువు జన్మ సమయాన్ని తీసుకొనవలెను.


లగ్నభావాన్నే తనూభావం అంటారు. బాల్యం, ఆరోగ్యం, వ్యక్తిత్వం, దేహం, నడవడిక, శరీర వర్ణం,శారీరక, మానసిక స్ధితి, జన్మించిన విధం, ఎత్తు, సామర్ధ్యం, గుణాలు, తెలివితేటలు, ఆయుర్ధాయం మొదలుగునవి తనూభావం ద్వారా తెలుసుకోవచ్చును. లగ్న కారకత్వాలు పరాశరుడు లగ్నం గురించి వివరిస్తూ లగ్నం ద్వారా తెలుసుకోదగిన అంశాలను ఈ విధంగా చెప్పాడు.

శ్లో।। తనుం రూపంచ జ్ఞానంచ, వర్ణం చైవ బలాబలం ।
ప్రకృతిం సుఖ దుఃఖంచ, తనుభావద్విచింత్యయేత్‌ ।। -

బృహత్పరాశరి, భావవివేచనాధ్యాయం, శరీరము, రూపము, వర్ణము, జ్ఞానము, బలాబలాలు, స్వభావము, సుఖదుఃఖాలు తనుభావము నుంచి తెలుసుకోవాలి.

కాళిదాసు తన ఉత్తర కాలామృతములో లగ్నభావకారకత్వాల్ని మరింతనిశితముగా విశ్లేషించాడు. శ్లో।।దేహశ్చావయవస్సుఖరాస్తే జ్ఞాన జన్మస్థలే, కీర్తిస్వప్న బలాయతీర్నృ -పనయాఖ్యాశాంతిర్వయః। కేశాకృత్యభిమాన జీవనపరద్యూతాంకమానత్వచో, నిద్రాజ్ఞాన ధనాపహార నృతిరస్కార స్వభావారుజః । వైరాగ్యప్రకృతీచ కార్యకరణం, జీవక్రియాసూద్యమః, మర్యాదప్రవినాశనంత్వితిభవేద్వర్థోపవాదస్తనోః ।।

దేహము, కాళ్ళు, చేతులు మొదలైన అవయవములు, సుఖదుఃఖములు, ముసలితనము, జ్ఞానము, జన్మభూమి, కీర్తి, స్వప్నము, బలము, ఆకారము, తర్వాత జరిగే ఫలితాలు అంటే ఒక కార్యముయొక్క పర్యవసానము ఏ విధముగా ఉంటుందో తెలుసుకోవటము, రాజనీతి, ఆయుర్దాయము, శాంతి, వయస్సు, కేశములు, అభిమానము, జీవనము, అపర విషయములు, జూదము, చిహ్నము, పౌరుషము, చర్మము, నిద్ర, అజ్ఞానము, ధనమును దొంగలించటము, మనుష్యులను తిరస్కరించు స్వభావము, రోగము లేకపోవటము, వైరాగ్యము, ప్రకృతి, కార్యములను చేయటం, జీవకార్యములయందు ప్రయత్నించుట, మర్యాదను పోగొట్టుకొనుట, మొదలైన ఫలితాలను లగ్నము ద్వారా చూడాలి.

చరలగ్నం అయిన సంచారం చేయువాడుగాను, స్ధిర లగ్నం అయిన స్ధిరంగా ఉండటం, ద్విస్వభావ లగ్నం అయిన మిశ్రమంగా ఉండటం.

జన్మించే సమయానికి లగ్నానికి మారకాధిపతి దశ గాని, భాదకాధిపతి దశ గాని, 22 వ ద్రేక్కాణాధిపతి దశ గాని, 64 వ నవాంశాధిపతి దశ గాని, అష్టమాధిపతి దశ గాని, అష్టమాన్ని చూస్తున్న గ్రహ దశలు గాని, అంతర్ధశలు గాని శిశువుకి జరుగుతున్నప్పుడు శరీరానికి సంబందించిన కష్టాలు, అనారోగ్యాలు కలుగుతాయి.

జన్మ లగ్నం చంద్రుని లగ్నం కంటే బలంగా ఉంటే వింశోత్తరి దశల ద్వారా ఫలితాలు మంచిగా వస్తాయి. చంద్ర లగ్నం జన్మ లగ్నం కంటే బలంగా ఉంటే లగ్న స్ఫుటం నుండి అనగా లగ్నం ఉన్న నక్షత్రం యొక్క అధిపతి ఎవరో ఆ దశల ద్వారా ఫలితాలు మంచిగా వస్తాయి. రవి లగ్నం అనగా రవి ఉన్నరాశి జన్మ, చంద్ర లగ్నాల కంటే బలంగా ఉంటే గురువు ఉన్న నక్షత్రం యొక్క అధిపతి దశల ద్వారా ఫలితాలు మంచిగా వస్తాయి.

లగ్నాధిపతి  ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి ఎవరో ఆ అధిపతి సూచించు వృత్తి సంబందించిన విషయాలలో పురోభివృద్ధి ఉంటుంది. లగ్నానికి యోగకారకులైన గ్రహాల యొక్క దశ అంతర్ధశలలోను వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి అయిన దశ అంతర్ధశాలలోనూ వృత్తి, వ్యాపార సంబంధ విషయాలలో పురోభివృద్ధి ఉంటుంది.

లగ్నంలో రవిగ్రహం ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో రవి ఉంటే దీర్ఘకాలం కోపం, పగ ఉండటం. శిరోవేదన, ఉష్ణతత్వం, శరీరం పుష్టిగా ఉండటం, పల్చని జుట్టు, బట్టతల (లేత వయస్సులో), పాప గ్రహాల కలయిక వలన దయా గుణం లేకపోవటం, క్రూరంగా మాట్లాడటం జరుగుతుంది. సృజనాత్మక శక్తి, ధైర్యం, సాహసం కలిగి ఉంటారు.

లగ్నంలో చంద్రుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో చంద్రుడు ఉంటే గుండ్రని ముఖం, దట్టమైన జుట్టు, సున్నితమైన మనస్సు, బిడియం, సౌమ్యం, మానసికమైన సమస్యలు ( ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో), ఆటుపోటులు, కంటివ్యాది, మానసిక వ్యాది (అంతర్గత జబ్బు, ఎడమ చెవి ప్రాబ్లం, మాట త్వరగా రాకపోవటం( నత్తి), ధనానికి ప్రాబ్లం ఉండదు.

లగ్నంలో కుజుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో కుజుడు ఉంటే దూకుడుతనం, కలర్ తక్కువ కలిగి ఉంటారు, ముఖంపై మచ్చలు ఉండటం, దెబ్బలు తగలటం, జన, సోదర సహకారం కలిగి ఉండటం, క్రీడలలో రాణింపు, గట్టిగా మాట్లాడటం, వివాదాలు కలిగి ఉండటం, త్వరగా కోపం రావటం, ఇతరులను నిందించటం, కొట్టటం, చెడు అలవాట్లకు బానిస కావటం జరుగుతుంది.

లగ్నంలో బుధుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో బుధుడు ఉంటే తెలివితేటలు కలిగి ఉంటారు. అతితెలివి కూడా కలిగి ఉండటం. మంచి వస్త్రాలు ధరిస్తారు. చక్కని భాష కలిగి ఉంటారు. లెక్కలలో రాణిస్తారు. ప్రతి విషయాన్ని అంచనా వేస్తారు. వాక్ శుద్ధి కలిగి ఉంటారు. రాయబారాలు నెరవేరుస్తారు. కమ్యూనికేషన్ రంగంలో రాణిస్తారు. ఇతరులు ఏది చెబితే వింటారో అది చెప్పగలగటం, లాజిక్ గా తెలివిగా మాట్లాడి జనాలను ఆకర్షిస్తారు. నపుంసకత్వం, నరాల బలహీనత కలిగి ఉంటారు.

లగ్నంలో గురువు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో గురువు ఉంటే ఆరోగ్యవంతమైన శరీరం, కొవ్వు పట్టిన లావు శరీరం, ఉభకాయం,, ధర్మాన్ని కాపాడటం, శాంత స్వభావం, ఆలోచనా విధానం లో మార్పులు, తను కష్టపడి శత్రువుకైనా మంచి చేస్తాడు. శుభ్రత కలిగి ఉండటం, దైవ చింతన, తీర్ధయాత్రలు చేయటం, మంచి అలవాట్లు కలిగి ఉంటారు.

లగ్నంలో శుక్రుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో శుక్రుడు ఉంటే అందమైన శరీరం, సుగంధ ద్రవ్యాల యందు ప్రీతి, సున్నితమైన శరీరం, సుఖ జీవనంపైన మక్కువ, కష్టపడి పని చేయలేకపోవటం, ఆకర్షణ, స్త్రీలను అధికంగా ఆకర్షించుట, ఇతరుల ఆకర్షణకు లోబడటం జరుగుతుంది. లగ్జరీగా ఉండటం జరుగుతుంది.

లగ్నంలో శని ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో శని ఉంటే సన్నని పొడవైన శరీరం, బద్ధకం, నల్లని శరీరం, ప్రతి పని నిదానం, లోభం, పిసినారి తనం కలిగి ఉండటం, అపరిశుభ్రం, చింపిరి జుట్టు, చిన్నతనంలోనే ముసలి ఛాయలు, మురికి బట్టలు ధరించటం, ఆలస్య వివాహాలు, ప్రతి పనిలోనూ ఆటంకం, నిరాశగా ఉండటం జరుగుతుంది. మొండిగా ప్రవర్తించటం.

లగ్నంలో రాహువు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
 లగ్నంలో రాహువు ఉంటే మోసపోవటం, మోసగించటం, లొంగిపోవటం, లోగదీసుకోవటం, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవటం, ఉద్రేకంగా ఉండటం, క్రూరమైన ఆలోచన కలిగి ఉండటం. మనస్సులో అనుకున్నది చెప్పకపోవటం, వక్రబుద్ధి కలిగి ఉండటం, చపలత్వం కలిగి ఉండటం, ఊహాత్మకమైన విషయాలు, అనుమానాలు, ఏదో జరుగుతుందని ముందుగానే ఊహించుకొని బయపడటం, అనవసరమైన అపోహలు విదేశీయానం చేయటం, స్త్రీలకు వాయుతత్వ రాసులైన లగ్నంలో రాహువు మంచిది.

లగ్నంలో కేతువు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో కేతువు ఉంటే మూడ భక్తి కలిగి ఉంటారు. తప్పుడు సలహాలు ఇస్తారు. వివాహంపై మక్కువ లేకపోవటం జరుగుతుంది. ఈ పని సరిగా చేయకపోవటం, నిలకడలేకపోవటం, వితండవాదం చేయటం వీరికున్న లక్షణాలు. ప్రతి చిన్న విషయానికి అలగటం, భయపడటం, మౌనవ్రతం పాటించటం. దైవంపైన అతి భక్తి.

లగ్నాధిపతి వివిధ భావాలలో ఉంటే కలిగే ఫలితాలు
నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి ఎవరో ఆ అధిపతి సూచించు వృత్తి సంబందించిన విషయాలలో పురోభివృద్ధి ఉంటుంది. లగ్నానికి యోగకారకులైన గ్రహాల యొక్క దశ అంతర్ధశలలోను వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి అయిన దశ అంతర్ధశాలలోనూ వృత్తి, వ్యాపార సంబంధ విషయాలలో పురోభివృద్ధి ఉంటుంది.

లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ధైర్యం కలిగి ఉంటారు, మంచి ఆయుర్ధాయం, మంచి నేర్పరితనం, ఆత్మ విశ్వాసం కలిగి ఉంటారు. ఎదుటివాళ్ళను లెక్కచేయకుండా గర్వం కలిగి ఉంటారు. నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడూ చెడ్డ ఆలోచనలు, చెడు స్నేహాలు కలిగి ఉంటారు. శుభగ్రహాలు ఉంటే మంచి నడవడిక, మృధు స్వభావం, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అన్నీ తనకు తెలుసు అని ఎదుటి వాళ్ళ మాట వినకుండా నిందించటం వీరి లక్షణాలు.

లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే శరీర పుష్టి, చక్కని మాట, ద్వితీయ కళత్రం కలిగి ఉంటారు. చక్కని బోజనప్రియులు, తనకంటే ఎక్కువ వయస్సు వారితో పరిచయాలు, స్నేహాలు, కుటుంబ పోషణ బాద్యత కలిగి ఉంటారు. భార్య తరుపున ఆస్తి కలసి రావటం, గురు శనులు కలిస్తే పిత్రార్జితం రాదు. వచ్చిన నిలవదు. మారక స్ధానం, విద్యలో రాణిస్తారు.

లగ్నాధిపతి తృతీయంలో ఉంటే శరీరం బలహీనం కలిగి ఉంటారు. కుటుంబంలో చిన్నగాని, పెద్దగాని ఆయి ఉంటారు.  పాపగ్రహాల కలయిక వలన శరీర ఇబ్బందులు. సోదరుల వలన సుఖం ఉండదు. సోదరుల అభివృద్ధి ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు తరచుగా చేస్తారు. క్రీడలపై మక్కువ, స్వయంగా అభివృద్ధి కలిగి ఉంటారు. కుజ సంబంధం ఉంటే మంచి క్రీడాకారుడు అవుతాడు. కేతువు సంబంధం ఉంటే విదేశాలలో బందింపబడటం జరుగవచ్చును. బుధ సంబందం ఉంటే సంగీతం, కమ్యూనికేషన్, జర్నలిస్ట్ రంగాలలో రాణిస్తారు. శుక్ర సంబందం ఉంటే లలిత కళలలో రాణిస్తారు. శని సంబందం ఉంటే రాజకీయాలలో రాణిస్తారు.

లగ్నాధిపతి చతుర్ధంలో ఉంటే స్దిరత్వం కలిగి ఉంటారు. స్ధిరమైన ఆరోగ్యం, సుఖపడతాడు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణింపు, మాతృబలం కలిగి ఉంటారు. గృహ సౌఖ్యం కలిగి ఉంటారు. కుటుంబంలో గౌరవింపబడతారు. స్వయం కృషితో సౌఖ్యాలను అనుభవిస్తారు. కుటుంబంలో ఆ వ్యక్తి పుట్టిన తరువాత బాగా అభివృద్ధి చెందటం. ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండటం. విద్యలో రాణింపు, చతుర్ధంలో రవి ఉండి లగ్నాధిపతి కలసి ఉంటే పితృ దోషం ఉంటుంది. నవమాదిపతి చతుర్ధంలో ఉన్న పితృ దోషం కలిగి ఉంటారు.

లగ్నాధిపతి పంచమంలో ఉంటే మంచి ఆలోచన, ఉపాసనా శక్తి కలిగి ఉంటారు. మంచి గురువు దగ్గర విద్య నేర్చుకుంటారు. పుణ్యబలం కలిగి ఉంటారు. మంచి సంతానం కలిగి ఉంటారు. విద్యలో రాణిస్తారు. క్రితం జన్మలో అకాల మృత్యువు జరగలేదని చెప్పవచ్చును. అదృష్టవంతుడు. పుణ్యబలం ఉండటం వలన తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సంపాదిస్తారు. పుణ్యస్నాలు తీర్ధయాత్రలు, సత్కర్మలు చేస్తారు. భవిష్యత్ (పంచమం రాబోవు రోజులలోని కర్మలపై ప్రభావం) కర్మలపై అవగాహన కలిగి ఉంటారు. దర్మబుద్ధి కలిగి ఉంటారు కాబట్టి న్యాయవాదిగా రాణిస్తారు సంతాన భాగ్యం కలుగుతుంది. పాప గ్రహ సంబంధం ఉంటే సంతాన నష్టం, కుజ రాహువులు ఉంటే నాగ దోషం, కుజుడు ఉంటే గర్భస్రావం చేస్తాడు. కేతువు ఉంటే అల్ప సంతానం కలిగి ఉంటారు. శుక్ర చంద్రులు ఉంటే షేర్లు, లాటరీలు, క్రీడా ద్వారా లాభాలు ఆర్జిస్తారు.

లగ్నాధిపతి షష్టంలో ఉంటే తను ఎవరి కిందయిన పనిచేస్తాడు. అప్పులు వసూలు చేసే శక్తి కలిగి ఉంటారు. అనారోగ్యాలు కలిగి ఉంటారు. శత్రువులపై విజయం, రవి, కుజుల సంబందం ఉంటే సర్జన్ గా రాణిస్తారు. రవి రాహువులు కలసి ఉన్న వైద్య వృత్తిలో రాణిస్తారు. గురువు ఉన్న ఆయుర్వేదంలో రాణిస్తారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు. తిండి సరిగా తినక ముఖం కళ తప్పటం జరుగుతుంది. గొడవలు, కొట్లాటలు చేస్తారు.

లగ్నాధిపతి సప్తమంలో ఉంటే తనలో తాను గొప్పవాడుగా ఫీలవుతాడు. వివాహంపై మక్కువ ఉండదు. కామ త్రికోణం కావటం వలన కుజ, శుక్ర సంబంధం ఉంటే కామత్వం ఎక్కువ కలిగి ఉంటారు. సమాజంలో గౌరవాలు కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇస్తారు. విదేశీ సంపాదన, విదేశాలలో రాణింపు కలిగి ఉంటారు. కుజ, రవి కలసి ఉన్న వైద్య వృత్తిలో రాణింపు, రాహు గాని కేతువు గాని ఉన్న శస్త్ర చికిత్సలు, పాప గ్రహ దృష్టి ఉంటే ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఎక్కువ. బలహీనంగా ఉంటే ఇతరులను మెప్పించటం కష్టం.

లగ్నాధిపతి అష్టమంలో ఉంటే ఆయుర్ధాయం కలిగి ఉంటారు. రహస్య సంపాదన కలిగి ఉంటారు. శరీరంలో ఏదో ఒక అనారోగ్యం లేదా లోపం ఉండి కూడా బయటకు తెలియకుండా రహస్య పరచటం జరుగుతుంది. లంచాలు, మాముళ్ళ ద్వారా సంపాదన కలిగి ఉంటారు. నిద్రలో నడిచే అలవాటు కలిగి ఉంటారు.

లగ్నాధిపతి నవమంలో ఉంటే అనుభవ పూర్వకమైన జీవితం కలిగి ఉంటారు. గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. దేవాలయ ప్రతిష్టలు చేస్తారు. మంచి గురువు దగ్గర వేద అద్యయనం చేస్తారు. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. స్పర్శ విద్యలో రాణిస్తారు. నాడీ వైద్యంలో రాణింపు. తండ్రితో మంచి అవగాహన కలిగి ఉంటారు. మంచి నేర్పు గల న్యాయ నిర్ణేతగా రాణిస్తారు. విదేశీ ప్రయాణాలపై మక్కువ కలిగి ఉంటారు. వ్యయాధిపతి, సప్తమాధిపతితో సంబంధం ఉంటే చిన్న వయస్సులోనే స్ధిరపడతారు.

లగ్నాధిపతి దశమంలో ఉంటే మంచి లక్షణాలు కలిగి ఉంటాడు. కర్మ స్ధానం కావటం వలన సత్కర్మలు చేస్తాడు. దర్మ కార్యాలు చేస్తాడు. కర్మ కారకుడైన శని ఈ స్ధానంలో ఉంటే చిన్న స్ధాయి నుండి ఎదుగుదల కలిగి ఉంటారు. సొంతంగా వ్యాపారం కలిగి ఉంటారు. స్వయం కృషితో రాణిస్తారు. అభివృద్ధి, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అధికారం చూపించి ఇతరులచే పనులు చేయించుకునే నేర్పరితనం కలిగి ఉంటారు. మంచి ఆయుర్ధాయం కలిగి ఉంటారు. ధర్మ ( 1,5,9) అర్ధ ( 2,6,10) భావాలకు సంబంధ గోచారంలో ఉంటే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే  ఆయువృద్ధి, రవి, బుధ, చంద్ర సంబంధం ఉంటే సుఖవంతమైన జీవితం కలిగి ఉంటారు. భౌతికపరమైన సుఖాలు, మంచి స్నేహితులు కలిగి ఉంటారు. పెద్దల ద్వారా లాభం, సొంతంగా లాభాలను ఆర్జిస్తారు. స్నేహితులకు ఉపయోగపడతాడు.

లగ్నాధిపతి ద్వాదశంలో ఉంటే బద్ధకం, చెడు ఆలోచన, ఇబ్బందులు ఎదుర్కోవటం,, పరస్త్రీలపైనా మక్కువ కలిగి ఉండటం, ఖర్చు ఎక్కువ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు లేకపోవటం, దేశం విడిచి పోవటం, కారాగారం, విదేశాలలో స్ధిరత్వం, ఖర్చుపై నియంత్రణ లేకపోవటం. తిండి, నిద్ర సరిగా లేక అనారోగ్యాలు తెచ్చుకోవటం జరుగుతుంది. వృద్ధాప్యంలో దైవ చింతన కలుగుతుంది. కేతువుగాని, గురువు గాని ఉంటే మోక్షం కలుగుతుంది.           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...