25, నవంబర్ 2016, శుక్రవారం

వజ్రం (డైమండ్) -Diamond

వజ్రం (డైమండ్)

వజ్రానికి అధిపతి రాక్షస గురువు అయిన శుక్రుడు. దీనికి పూలకం, హారం, మగమాణిక్యం, వైక్రాంతం, కుంఠం, కులిసం, గిరి జ్వరం, గిరి కంఠు, వజ్రం, మూలరాయి, నిర్ఘాతము, చితకమ, రవ్వ, హీరా అనే పేర్లు గలవు. భూమిపై లభ్యం కాగల పదార్ధాలలో అత్యంత గట్టి పదార్ధం వజ్రం. భూగర్భంలో 80 కి.మీ లోతున అత్యధిక ఉష్ణోగ్రత పీడనంలో బొగ్గులాగే కార్బన్ అణువులు ఒకదానితో ఒకటి అతుక్కుని వజ్రాలుగా రూపొందుతాయి. వజ్రం యొక్క విలువను క్వాలిటీ, కటింగ్, కలర్, క్యారెట్(4 సి) అనే నాలుగు అంశాలు ప్రభావితం చేస్తాయి.


బృహత్సంహితలో చెప్పిన దాని ప్రకారం నదీతీర ప్రాంతాలలో, హిమాలయ ప్రాంతాలలో లభించేవి స్వచ్ఛమైనవి, కాంతి వంతమైనవిగా తెలియజేయబడింది. షడ్బుజములు కలిగి తెల్లనిరంగులో ఉండేవి ఇంద్రునిచే, పాము నోటి వలె ముదురు రంగులో ఉండునవి యముని చేతను, అరటి చెట్టు ఆకారం కల్గినదైన శ్రీమహావిష్ణువు చేతను, కర్ణాకార పుష్పరంగులో స్త్రీ జనానాంగమువలె ఉన్న వరుణుడి చేతను, పులికన్నువలె త్రిభుజాకారములో ఉండేది అగ్నిచేతను, యవగింజలవలె అశోకపుష్పంలా ఉండేవి వాయువు చేతను సృష్టించబడినవట. పురాణాల ప్రకారం ఇంద్రుడు 6  భుజాలు కల తెల్లటి వర్ణ వజ్రాన్ని, యముడు నలుపు వర్ణవజ్రాన్ని, వరుణుడు గోధుమవర్ణ వజ్రాన్ని అగ్నిదేవుడు త్రికోణాకృతి కల వజ్రాన్ని, వాయుదేవుడు కంకి రూపంలో ఉన్న వజ్రాన్ని వాడేవారని చెప్పుదురు.

బృహత్సంహిత ప్రకారం స్వచ్ఛత, కాంతిహీనంగా, బీటలు ఉన్న, చారలు ఉన్న, నల్లటి వెంట్రుకల వంటి గీతలు ఉన్న, బుడగలు, చుక్కలు ఉన్న వజ్రాలను ధరించరాదు. లోపల అటుక గింజలవలె కనపడిన ఎర్రటి చుక్కలు, బీటలు ఉన్న చిపిలి దోషం ఉన్న వజ్రాలు ధరించరాదు. శూద్రవర్ణం కలిగిన నీలం, ముదురురంగులో ఉన్న వజ్రాలు కష్టనష్టాలు కలిగించునని తెలియజేయటమైనది.

బ్రాహ్మణవర్ణం కలిగిన మల్లెపూవు వలె తెల్లని వజ్రాలు భోగం, సంపద, క్షత్రియవర్ణం కలిగిన చెట్ల చిగుళ్ళ వలె, ఎరుపు, పసుపువర్ణం గల వజ్రాలు సకల జన వశీకరణం, వైశ్యవర్ణం కలిగిన బంగారు, శిరీష పుష్పాలవలె పచ్చగా ఉన్న వజ్రాలు ఐశ్వర్య సంపద ఇచ్చు వజ్రాలు శ్రేష్ఠమైనవి. పురుష వజ్రాలు ఆరుకోణాలు (ఆరు అంచులు) కలగి ఉంటాయి. స్త్రీ వజ్రాలు గుండ్రంగా రేఖ బిందువులు లేకుండా ఉంటాయి. నపుంసక వజ్రాలు అటుకుల రంగులో మూడు కోణాలలో మధ్యభాగం ఎత్తుగా ఉండి గుండ్రంగా ఉంటాయి. నపుంసక వజ్రం కంటే స్త్రీ వజ్రం, స్త్రీ వజ్రం కంటే పురుష వజ్రం శ్రేష్ఠం.

ఇనుప దిమ్మెపైన పెట్టి సమ్మెటతో బలముగా కొట్టినను వజ్రం పగలదు. నీటిలో వేసిన మునగదు. ఆకురాయితో అరగదీసిన అరగదు. రంపంతో కోసిన గీత పడదు. అటువంటి వజ్రం ధరించుట వలన సకల సంపదలు, శుభములు కలుగును. ప్రకాశవంతమైన మెరుపు కాంతి విరజిమ్మే వజ్రం ధరించాలి. 1756 సం.లో బ్రెజిల్ దేశంలో వజ్రాల గనులు కనిపెట్టేంతవరకు భారతదేశం నుండే ఇతర దేశాలకు వజ్రాలు సరఫరా అవుతూ ఉండేవి. 1875 సం// నుండి దక్షిణాఫ్రికాదేశంలో కింబర్లి గనులలో లభించే వజ్రాలు ప్రఖ్యాతి వహించాయి. ‘హెన్రీమొల్సన్’ కృత్రిమ వజ్రాలను తయారు చేయుటకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ‘జనరల్ ఎలక్ట్రిక్’ అనే శాస్త్రవేత్త 2760 డిగ్రీల వద్ద కర్బనాన్ని వజ్రంగా తయారుచేసి సఫలం అయ్యాడు.

వజ్రాలు కృతయుగంలో పర్వతాలలోను, ఏనుగు కుంభ స్ధలాలలోను దొరికేవట. ఆంద్రప్రదేశ్ లో గల గుంటూర్ జిల్లా కొల్లూరు, అనంతపురం జిల్లా వజ్రకరూర్ లు గోల్కొండ గనులుగా ప్రసిద్ది చెందాయి. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వజ్రాలు ఈ గనులలో లభ్యమైనవే. మద్యప్రదేశ్ రాష్ట్రంలో గల పన్నాజిల్లా వజ్రాలకు ప్రసిద్ధి గాంచింది. వజ్రాలు ఎక్కువగా ఆస్ట్రేలియా, రష్యా, బ్రెజిల్, సిరియా, నమీబియా, అమెరికాలో ఎక్కువగా లభ్యమవుతున్నాయి.

1650 సం లో గ్రేట్ మొగల్ వజ్రం దొరికినప్పుడు 793 క్యారెట్లు కాగా సాన పెట్టిన తరువాత బరువు 280 క్యారెట్లు ఉంది. 1304 సం లో కోహినూర్ వజ్రం దొరికినప్పుడు 191 క్యారెట్లు కాగా సానపెట్టిన తరువాత 108.93 క్యారెట్లు ఉంది.  వజ్రం గట్టిగా, కఠినంగా ఉంటుంది. దీనిని సాన బెట్టుటకు వజ్రమే కావాలి. వజ్రం బొగ్గుల చూర్ణంలో ఉంచి కొలిమిలో పెట్టి ఎంత సేపు కాల్చిన చూర్ణంగా మారదు.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వజ్రాన్ని ఆవుపాలలో, గోమూత్రంలో, పసుపు నీటిలో, పంచామృతంలో, ఉలవచారులో నాన బెట్టిన శుద్ధి అగును. ఉలవగంజిలో ఇంగువ, సైంధవ లవణం వేసి దానియందు వజ్రం ఉంచి 21 సార్లు కాల్చిన తరువాత మాత్రమే భస్మంగా మారగలదు. ఎలుకలు, పాము కుబుసం, మేకకొమ్ము, తాబేలు బొరుసు, కుందేటి ఎముకలను ఎండబెట్టి చూర్ణం చేసి ఆచూర్ణం సమ భాగాలుగా తీసుకొని వజ్రం ఉంచి అగ్నిలో పెట్టిన వజ్రం భస్మం కాగలదు. వజ్ర భస్మం సేవించిన వీర్యవృద్ధి, బలం, తేజస్సు, ఉత్సాహం, చురుకుతనం కలుగును. దగ్గు, క్షయ, ఉబ్బసం వంటి వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది. రసాయన, సాంకేతిక శాస్త్రపరంగా కార్బన్ పరమాణువుల సమ్మేళనం వజ్రానికి గట్టితనాన్ని ఇస్తుంది. పరమాణువుల మద్య నత్రజని వాయువు ఉన్నట్లయితే లేత పసుపు వర్ణంలోను, బోరాన్ ఉన్నట్లయితే నీలిరంగు వజ్రాలు కనిపిస్తాయి.

తమలపాకులు, పత్తి వేళ్ళు మెత్తగా నూరి ముద్దగా చేసి రేగు ఆకులో వజ్రం మరియు ఆ ముద్దను చేర్చి భస్మం చేసిన దానిని సేవించిన అతి మూత్ర రోగం, అతిమోహరోగం, స్త్రీల బహిష్ఠురోగం, సుఖ సంబంధ వ్యాధులు నివారించ వచ్చును. అన్నిరత్నాల కంటే వజ్రం నుంచి వచ్చు కాస్మిక్ కిరణాలు మానవ శరీరంలోకి సులభంగా చొచ్చుకొని పోగలవు.

             వజ్రం ధరించుట వలన కలుగు ప్రయోజనాలు:- వజ్రం చాలా గట్టిది. దానిని కోయటానికి వజ్రాన్నే ఉపయోగిస్తారు. వజ్రం ధరించుట వలన తేజస్సు, భోగభాగ్యాలు కలుగును. స్త్రీలు ప్రసవ సమయంలో వజ్రం ధరించిన సుఖ ప్రసవం అగును. భార్యాభర్తల మద్య తరచుగా కలహాలు జరుగుతున్నప్పుడు అన్యోన్నతకు, సుఖసంతోషాలకు వజ్రం ధరించవలెను. అనుకూలించటం మొదలు పెడితే వజ్రం కన్నా గొప్ప రత్నం లేదు.

జాతకంలో జన్మలగ్నానికి శుక్రుడు 6,8,12 స్ధానంలో గాని, కన్య రాశిలో నీచస్ధానంలో గాని ఉన్న, భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్రాల వాళ్ళు, శుభగ్రహ దృష్టిలేని శుక్రదశ, అంతర్దశ జరుగుతున్న వైవాహిక సమస్యలు, ధరిద్రం, కష్ట, నష్టాలు కలుగును. యుక్త వయస్సులో ఉండి వివాహం కాని యువతీ యువకులు వజ్రం ధరించిన త్వరలో వివాహం జరుగగలదు. జాతకంలో కుజ, శుక్రులు కలసి ఉన్నప్పుడు వజ్రం ధరించిన కుజదోష పరిహారం కాగలదు. వజ్రం ధరించుట వలన సుఖరోగాలు, చర్మవ్యాధులు, మలేరియా జ్వరాలు శ్లేషం, పొడిదగ్గు, క్షయ, ఉబ్బసం, స్త్రీలకు తెల్లబట్ట లాంటి వ్యాధులు ఉన్నవారు వజ్రం ధరించుట వలన పూర్తిగా నివారించవచ్చును.   

సంగీతం, సాహిత్యం, భరతనాట్యం, చిత్రలేఖనం, లలితకళల యందు అభిరుచి కలవారు వజ్రం ధరించిన కీర్తి ప్రతిష్ఠలు తెచ్చుకుందురు. సినిమారంగంలో వారికి వజ్రం ధరించిన అవకాశాలు మెరుగుగా ఉండగలవు. వజ్రం ధరించే ముందు “అశ్వధ్వజాయ విద్మహే ధనుర్ హస్తాయ ధీమహీ తన్నో శుక్ర ప్రచోదయాత్” అనే మంత్రాన్ని పఠిస్తూ 10 సెంట్స్ నుండి 20 సెంట్స్ వరకు గల వజ్రాన్ని చిటికినవేలుకు గాని, మద్యవేలుకు గాని శుక్రవారం రోజు శుక్రహోరలో బొబ్బర్లు దానం ఇస్తూ ధరించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...