24, సెప్టెంబర్ 2016, శనివారం

జాతకకర్మ



జాతకకర్మ

శిశువు జన్మించిన వార్త వినగానే జాతక కర్మ చేయాలని ధర్మ శాస్త్ర వచనాలు చెబుతున్నాయి. అదికూడ నాభిచ్చేదనానికి ముందే జరగవలెనట. నాభిచ్చేధం తరువాత తండ్రికి జాతాశౌచం ప్రారంభమవుతుంది. కనుక అంతకుముందే  జాతకకర్మ తండ్రి నిర్వహించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఆడ శిశువుకైన మగశిశువుకైన జన్మించిన వెంటనే జాతకకర్మ చేసే ఈ పద్ధతిలో తిధి వార నక్షత్రాలతో గాని ముహూర్త బలంతో గాని సంబంధం లేదన్న మాట. ఏ కారణం చేతనైన అప్పుడు జాతకర్మ కుదరకపోతే ఆ తరువాత చేయవలసినప్పుడు మాత్రం తిధి వార నక్షత్రాదులను చూసి ముహూర్తం నిర్ణయించవలెను. 


“స్నాతోలంకృతః పితా అకృత నాలచ్ఛేదం అపీతస్తన్యం అన్త్యెరస్పృష్టం ప్రక్షాళితం కుమారం మాతురుత్సాం  గేకారాయిత్వా..... అస్యకుమారస్య గర్భాంబు పాతజనిత దోష నిబర్హణాయుర్మేధాభివృద్ధి బీజ గర్భ సముద్భావైనో నిబర్హణ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం జాతకకర్మ కరిష్యే “ అని ధర్మ సింధువు జాతకకర్మ  సంకల్ప విధానాన్ని నిర్దేశిస్తున్నది. దీన్నిబట్టి జాతకకర్మ ప్రయోజనం మాత్రమే కాక అది ఎప్పుడు చేయవలసిందో కూడా స్పష్టమవుతుంది. అయితే ఈ విధానంలో కొంత ఇబ్బంది లేకపోలేదు. 

ముహూర్త దర్పణం నందు
“తస్మిన్ జన్మముహూర్తే పి సూతకామ్టే ధవా శిశోః కుర్యాద్వైజాతకర్మాఖ్యం పితృపూజని తత్పరః” శిశువు జన్మించిన వెంటనే గాని పురుడు తొలగిన తరువాత గాని జాతకకర్మ చేయవలెనని నిర్దేశిస్తున్నది. ఈ విధంగా చేయబడుతున్నదే ఈనాటి బారసాల. ముహూర్త చింతామణిలో “తజ్జాతకర్మాది శిశోర్విధేయం పర్వఖ్యరిక్తోన తిధే శుభే హ్ని ఏకాదశ ద్వాదశకే పి ఘస్రేంమృధ్రువ క్షీప్రచారోడుశుస్యాత్” అని 11 వరోజుగాని, 12 వ రోజు గాని జాతకకర్మ చేయవలెనని చెప్పినది. పర్వతిధులు, రిక్త తిధులు, జాతకకర్మకు పనికిరావు. మృధు,ధృవ,క్షిప్ర, చర నక్షత్రాలలో ఏవైనా జాతకకర్మ చేయవచ్చును. చవితి, నవమి, చతుర్ధశి రిక్త తిధులు, ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య ఇవి పర్వతిధులు, మృగశిర, రేవతి, చిత్త, అనురాధా మృధు నక్షత్రాలు, ఉత్తరా త్రయం, రోహిణి ధృవ నక్షత్రాలు, హస్త, అశ్వని, పుష్యమి, అభిజిత్ క్షిప్ర నక్షత్రాలు, స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ఠ, శతభిష చర నక్షత్రాలు, మంగళ, శనివారాలు జాతక కర్మకు పనికి రావని ధర్మ సింధువు వచనం. 

ప్రస్తుతం బారసాలకు తిధులు నక్షత్రాలు చూడటం ఆచారంగా లేదు. పైగా అది వైదిక జాతకర్మ సంస్కారంగా నిర్వహించబడటం కానరాదు. అంతేకాదు జాతకర్మాదులను ప్రాయశ్చిత్త పూర్వకంగా ఉపనయనానికొక రోజు ముందుగా (ఒకొక్కప్పుడు ఆదేరోజు కూడా) జరిపించేయటం ఆచారంగా మారిపోయింది. 

దేవర్షి పితృ ఋణాలు మూడింటిలో పిత్ర జననం వలన పితృ ఋణాలు విముక్తి కలుగుతుందని భారతీయుల పవిత్ర భావన. జాతకకర్మ, నామకరణం, డోలారోహణాలతో పాటుగా బాలింతరాలి చేత మొట్టమొదటగా నూతిలో చేద వేయించి నీరు తోడించే కార్యక్రమాన్ని కూడా కలిపి లౌకికాచారంగా ఇరవై ఒకటో నాడు నిర్వహించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో కానవస్తుంది. ఆ సమయంలో వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా మాత్రం చూస్తున్నారు.       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...