21, ఫిబ్రవరి 2016, ఆదివారం

గృహారంభ సమయం, భూపరీక్షా విధానం

గృహారంభ సమయం, భూపరీక్షా విధానం

మత్స్య పురాణంలో గృహ నిర్మాణాలు ఏ మాసంలో చేస్తే ఏ ఫలితమో కూడా సూతుడు పేర్కొన్నాడు.

గృహారంభానికి చైత్ర మాసం వ్యాధి ప్రదం; వైశాఖ మాసం ధన, రత్న ప్రదం; జ్యేష్ఠం మృత్యుకరం; ఆషాఢం భృత్య, రత్న, పశువృద్ధికరం; శ్రావణం భృత్య, లాభం; భాద్రపదం హానికరం; ఆశ్వయుజం పత్నీ నాశకరం; కార్తీకం ధన, ధాన్య వృద్ధికరం; మార్గశిరం అన్న వృద్ధికరం; పుష్యం చోర భయప్రదం; మాఘం బహులాభ దాయకం; ఫాల్గుణం కాంచన బహుపుత్ర ప్రధమని సూతుడు చెప్పాడు.

ఇల్లు కట్టుకోవటానికి తగిన భూమిని పరీక్షించే పద్ధతిని కూడా ఇక్కడే వివరించాడు సూతుడు. గృహ నిర్మాణానికి ఎంచుకున్న భూమిని పరీక్షించాలనుకున్నప్పుడు పిడిమూక లోతు, అంతే పొడవు వెడల్పుతో చక్కగా ఒక గుంటను తవ్వాలి. ఆ గుంటను బాగా అలకాలి. ఒక పచ్చి మూకుడు తెచ్చి దానిలో నెయ్యి పోసి నాలుగు దిక్కులలో నాలుగు వత్తులను ఆ మూకుడులో ఉంచి వెలిగించి పొయ్యి మధ్యన ఉంచాలి. ఏ దిక్కున ఉన్న వత్తి బాగా కాంతితో వెలుగుతుందో గమనించాలి. తూర్పు దిక్కున ఉన్న వత్తి బాగా వెలిగితే ఆ భూమి విప్రులకు అనుకూలంగా ఉంటుంది. దక్షిణ దిక్కున ఉన్న వత్తి బాగా వెలిగితే క్షత్రియులకు, పడమటది వైశ్యులకు, ఉత్తరం వైపుది శూద్రులకు శుభకరమైన భూమిగా భావించాలి. ఒకవేళ నాగులు దిక్కులలో ఉంచిన వత్తులు అన్నీ సరిసమానంగా బాగా ప్రకాశిస్తుంటే దాన్ని సామూహిక వాస్తు ప్రదేశం అంటారు. అలాంటి భూమి ఎవరైనా సరే ఇళ్ళు కట్టుకొని హాయిగా ఉండటానికి అనువైనది.

దీప పరీక్ష అయిన తరువాత ఆ తవ్విన మట్టితోనే ఆ గోతిని పూడ్చాలి. గొయ్యిని పూడ్చటానికి మన్ను ఎక్కువైతే అది శుభప్రదం. సరిగా సరిపోతే అది సమం. మట్టి తక్కువైతే మాత్రం మంచిది కాదు. అంటే ఆ భూమిలో గృహ నిర్మాణం చేయటం శుభప్రదం కాదు. గొయ్యిని పూడ్చిన తరువాత ఆ భూమినంతా నాగలితో దున్ని అన్ని విధాలైన (నవ ధాన్యాలను) విత్తనాలను చల్లాలి. ఆ విత్తనాలు మూడు రోజులకు మొలకెత్తితే శుభ ప్రదం. ఐదు రోజులకు మొలకెత్తితే మధ్యమం, ఏడు దినాలకు మొలకెత్తితే అది అధమం. అలా ఏడు దినాలకు మొలకెత్తిన ప్రదేశం గృహ నిర్మాణానికి పనికిరాదు. అని ఇలా మత్స్య పురాణంలో సూతుడు వాస్తు పురుష ఉత్పత్తి గురించి, గృహ నిర్మాణ పరీక్ష గురించి తెలియ చెప్పాడు. ఈ విషయాన్ని మన పూర్వుల నమ్మకంగా భావించవచ్చు. ఆనాటి వారి ఆచార వ్యవహారాలకు ఇదొక ఉదాహరణగా కనిపిస్తోంది. అయితే దీన్నే కొద్దిగా శాస్త్రీయ దృక్పధంలో పరిశీలించినా అవన్నీ పూర్తిగా గుడ్డి నమ్మకాలు కావని, పూర్వ రుషులు తమ జీవితానుభవాన్ని రంగరించి తపశ్శక్తిని మిళితం చేసి చెప్పినవేనని పురాణజ్ఞులు వివరిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...