27, ఆగస్టు 2016, శనివారం

గోచారంలో శని సంచార ఫలితాలు

గోచారంలో శని సంచార ఫలితాలు 

గోచారం అంటే ప్రస్తుతం గ్రహము చేయు సంచారం. పుట్టిన సమయానికి వున్న గ్రహముల స్థితి సమయలగ్నం ఆధారంగా మనం దశలు అంతర్దశలు నిర్ణయించి ఫలితాలు చెబుతాం. దానికి తోడుగా చంద్రరాశి జన్మరాశి ఆధారంగా చేసుకొని ప్రస్తుతం నడుస్తున్న గ్రహ సంచారం ఆధారంగానే చెప్పే ఫలితాలకు గోచారం అని పేరు. దశలు అంతర్దశలు ఆ సమయంలో వున్న గోచారం ఆధారం చేసుకొని ఫలిత నిర్ణయం చేస్తారు.గోచారంలో శని ముఖ్య పాత్ర వహిస్తాడు.గోచారంలో శని అత్యదికంగా రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు.


శ్లో;- విపత్తి హానిం సంపత్తిం కుక్షిరోగం సుతక్షయం
లక్ష్మీకరం మహాదైన్యం మరణం దేహ శోషణం
బంధనం లాభ నష్టంచ క్రమేణ కురుతే శనిః 

శని జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు విపత్తును, ద్వితీయంలో హానిని, తృతీయంలో ధన లాభాన్ని, చతుర్ధంలో ఉదర సంబంధ రోగాలను, పంచమంలో సంతాన నష్టాన్ని, షష్ఠమంలో విశేష ధనప్రాప్తిని, సప్తమ స్ధానంలో మహా విచారాన్ని, అష్టమంలో మరణాన్ని, నవమంలో రోగాన్ని, దశమంలో రాజకీయ చిక్కులను, ఏకాదశంలో ధనలాభాన్ని, ద్వాదశంలో ధన నష్టాన్ని, స్ధాన చలనాన్ని కలిగిస్తాడు. 

జన్మ శని రెండున్నర సం.లు ఉంటుంది.దాని ప్రభావంగా శరీరం తేజస్సు కోల్పోవడం, మతిభ్రంశం కలగటం, హృదయ వ్యాధి, భయము, రోగ బాధలు పెరగడం, బంధు కలహము, దుఃఖము. అపకీర్తి, చంచలబుద్ధి, బంధు విరోధం కలుగుతాయి. 

శని రెండవ రాశిలో సంచారం చేయునప్పుడు ఎల్లప్పుడూ కష్టము, పనులు సక్రమంగా సాగకపోవడం, కారణం లేకుండా విరోధములు రావడం, ఎక్కువగా తిరగడం, స్వంత మనుషులతో కలహం, చెడు పనులు చేసి బాధపడటం వంటివి ఉంటాయి. సంతాన నష్టం, ధన నష్టం, సంచారం కలుగుతాయి.   

జన్మరాశి లగాయితు మూడవ రాశిలో శని సంచారం గోచారంలో ప్రారంభం అయినప్పుడు హృదయ సౌఖ్యము, స్వబుద్ధిచే కార్యక్రమములు పూర్తి చేయు లక్షణములు పెరగడం, భార్యాభర్తల అన్యోన్యం పెరగడం, సంతోషం, ప్రయత్నపూర్వకంగా ఇష్టమైన ప్రదేశమునకు లేదా స్వస్థానమునకు చేరడం, ఆరోగ్యంగా ఉండడం వంటివి జరుగుతాయి. స్వగ్రామంలో సౌఖ్యంగా జీవించటం, ఆరోగ్యం, ఉద్యోగాప్రాప్తి, సేవకులు కలిగిఉంటారు. 

జన్మరాశి నుండి నాల్గవ రాశిలో శని సంచారమునకు అర్దాష్టమ శనిసంచారం అని పేరు. ఆ సమయంలో వాత సంబంధంగా శారీరక ఇబ్బందులు, మానసిక అశాంతి, భయము. స్ధాన చలనం, అనారోగ్యం, కళత్ర నష్టం, కళత్ర పీడ, బంధు క్షయం, ఆస్తి నష్టం కలుగుతాయి. 

శని గోచారంలో అయిదవ ఇంట సంచరించేటప్పుడు ఆస్తి విషయంగా సంతానం విషయంగా చికాకులు ఇస్తారు. ప్రతి పనిలోను అడ్డంకులు ఇస్తారు. మనోవ్యధ, సంతతి నష్టం, కష్టాలు కలుగుతాయి.
గోచారంలో ఆరవ యింట శని సంచారం చేయునప్పుడు ధన ధాన్యవృద్ధి, బంధువుల ద్వారా సంతోషం, భార్యాభర్తలకు అనుకూల స్థితి, గృహ నిర్మాణ ఆవశ్యకత ఉంటుంది.
 
గోచారంలో సప్తమంలో శని సంచారం ఫలితములు వ్యాధి వలన బాధ, దేశాంతరవాసం చేయవలసి రావడం, హృదయమునకు బాధ కలిగించే స్థితి రావడం, ప్రతి విషయానికి భయము, డబ్బుకు ఇబ్బంది. మనస్తాపము కలుగును. కళత్ర దోషం, ప్రయాణాలలో ఆపదలు, నిత్యం ఏదో ఒక బాధ కలుగుతాయి. 

శని గోచారంలో ఎనిమిదవ ఇంట సంచరించేటప్పుడు అష్టమ శనిఫలితాలు సమస్త కార్యముల యందు విరోధము, రోగ బాధ, ధనక్షయము, ప్రతి నిమిషం అపమృత్యు భయము కలుగుతాయి. పనులు ఆలస్యం, బంధువుల, మిత్రుల, ప్రజల విరోధం, రోగం, ధన నష్టం, ప్రాణ భయం, ఆకస్మిక ఆపదలు సంభవిస్తాయి. 

గోచారంలో జన్మరాశి లగాయితు తొమ్మిదవ రాశిలో శని సంచారం చేయునప్పుడు కొన్నిసార్లు లాభము సుఖము, కొన్నిసార్లు నష్టము, దుఃఖము కలుగజేస్తారు. భార్యా పుత్రుల ద్వారా కష్టనష్టములు ఇస్తారు. విచారం, రోగం, కష్టాలు, ధన నష్టం, పాప కార్యాలు చేయటం, కార్య నాశనం, వృత్తిలో బంగం కలగటం జరుగుతాయి.  

దశమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు మనోవ్యాకులము, దుఃఖము తద్వారా పరితాపము, ఉద్యోగ కార్యముల యందు విఘ్నము, కృషి కర్మల యందేకాక ఇతర విషయముల యందు కూడా విఘ్నములు ఉంటాయి. వృత్తిలోను, అన్నీ విషయాలలోనూ వ్యతిరేక ఫలితాలు వస్తాయి. 

శని గోచారంలో లాభం స్ధానంలో  సంచారం చేయునప్పుడు, ఆరోగ్యంగా ఉండుట, ధన లాభం, పుత్రుల వలన సౌఖ్యము, సంతోషం కలగటం, ఇష్టార్ధ సిద్ధి ఉంటాయి.
 
శని గోచారంలో వ్యయంలో జన్మరాశి లగాయితు సంచారం చేయునప్పుడు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. గౌరవ మర్యాదల యందు చికాకు, మనస్సుకు కష్టం కలిగించే అంశాలు ఎక్కువగా ఉండడం, భోజన అసౌకర్యము, ప్రతి పనీ శ్రమయుక్తముగా ఉండడం, ధన చికాకులు ఉంటాయి. ఇతరుల దగ్గర పని చేయటం, బోజన సౌఖ్యం లేకపోవటం, దరిద్రం, నిత్యం కలహాలు, అనారోగ్యం కలుగుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...