8, నవంబర్ 2017, బుధవారం

సాధన సప్తకం_SadhanaSaptakamu

      

 సాధన సప్తకం
 పుట్టుక, ముసలితనం, మరణం.. ఇవేవీ లేని ఆనందస్వరూపుడైన పరమాత్మను పొందడం ఎలా? ఉపాసనాత్మకమైన జ్ఞానం ద్వారా పొందవచ్చని ముండకోపనిషత్తు చెబుతోంది. వివేక, విమోక, అభ్యాస, క్రియా, కల్యాణ, అనవసాద, అనుద్ధర్షాలనే సాధన సప్తకాలతో ఇది సాధ్యం. అవేంటంటే..

వివేకం:
మంచి చెడులను గుర్తించ గల వివేక సంపన్నుడు మానవుడు. అంతఃకరణ శుద్ధికి అవసరమైన, దోషరహితమైన ఆహారం స్వీకరించడం వల్లనే మనిషి వివేకవంతుడు అవుతాడు.

విమోకం:
భోగ వస్తువులయందు, విషయముల యందు వ్యామోహము ఏర్పడకుండా జాగ్రత్తపడటమే విమోకం. భోగలాలసునికి ఉపాసన దశలో స్థిరచిత్తం ఏర్పడదు. కాబట్టి భోగలాలసను వదలాలి.

అభ్యాసం:
బయటి ప్రపంచంలోని వ్యక్తులపై అనురాగం ఏర్పడకుండా నిత్యం, నిరంతరం.. సమస్త శుభాలకు కేంద్రమైన ఆ భగవంతుని స్మరించడాన్నే అభ్యాసం అంటారు.
క్రియ: తమ శక్తి మేరకు రోజూ పంచమహాయజ్ఞాలను నిర్వహించడమే క్రియ. అవి..

దేవ యజ్ఞం
: జపం, హోమం, స్తుతి, అర్చనతో దేవతారాధన చేయడం.
బ్రహ్మ యజ్ఞం: విజ్ఞాన సర్వస్వాలు, విశ్వశ్రేయస్కరాలు అయిన వేదాలను అధ్యయనం చేయడం.
పితృ యజ్ఞం: తల్లిదండ్రులను ఆదరించడం, వారి యోగక్షేమాలను శ్రద్ధగా పట్టించుకోవడం.. వారు స్వర్గస్థులయ్యాక శ్రద్ధతో వారికి పిండతర్పణాదులను సమర్పించడం.
మనుష్య యజ్ఞం: అతిథి, అభ్యాగతులను, బంధు మిత్రులను ఆదరించడం. వారికి తగిన సేవలను అందించడం. మాటలతో చేష్టలతో నొప్పించకపోవడం.
భూతయజ్ఞము: సాధుజంతువులైన గోవులకు ఇతర ప్రాణులకు ఆహారాన్ని అందించడం. ఈ ఐదు యజ్ఞాలను నిర్వర్తించడమే క్రియ.

కల్యాణం: సమస్త ప్రాణులకూ మేలు కలిగేలా త్రికరణ శుద్ధితో వ్యవహరించడం. మాటలతో చేష్టలతో ఎవరినీ హింసించకుండా ఇతరులకు ఉపయోగపడే మాటలనే పలకడం, పనులనే చేయడం.

అనవసాదం:
ఎలాంటి సందర్భంలోనూ మనసులో నిరుత్సాహం ఏర్పడకుండా మనసును, శరీరాన్ని శక్తిమంతంగా ఉంచుకోవడం.

అనుద్ధర్షం: సంపదలు పెరిగాయనో, మహోన్నత పదవి లభించిందనో, జ్ఞానమో రూపమో గుణములో తమలో ఎక్కువగా ఉన్నాయనే భావనలతో అతిగా సంతోషమును పొందక పోవడం. ఈ సాధన సప్తకం ఉపాసకులకు అత్యావశ్యకము.        -డాక్టర్‌ నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...